జమిలీ ఎన్నికలకు మెజార్టీ పార్టీల వ్యతిరేకత..! బీజేపీ ఏం చేస్తుంది..?

భారతీయ జనతా పార్టీ.. లోక్‌సభతో పాటు.. అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని తాపత్రయపడుతోంది. దేశంలో మెజార్టీ రాష్ట్రాలు బీజేపీ అధీనంలో ఉన్నప్పటికీ.. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకంగా ఉన్నాయి. వాటిని కాదని.. ఏకపక్షంగా ముందస్తుకు వెళ్లే సూచనలు లేవు. అందుకే లా కమిషన్ ద్వారా జమిలీ కలను సాకారం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. లా కమిషన్ కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా.. వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపుతూ సిఫార్సులు చేస్తూ వస్తోంది. ఇప్పుడు రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంది.

రెండు రోజుల పాటు లా కమిషన్ జరిపిన అభిప్రాయ సేకరణలో.. బీజేపీకి సన్నిహితంగా ఉండే నాలుగు పార్టీలు మాత్రమే.. జమిలీ ఎన్నికలకు పూర్తి స్థాయి సానుకూలత తెలిపాయి. తొమ్మిది పార్టీలు వ్యతిరేకత తెలిపాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం తన అభిప్రాయాన్ని చెప్పలేదు. కానీ తాను జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్లు.. గతంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. లాకమిషన్ కు అభిప్రాయం చెప్పబోమని గతంలో ప్రకటించింది. దానికి తగ్గట్లుగానే లా కమిషన్ వద్దకు ప్రతినిధిని పంపలేదు.

ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే.. మెజార్టీ పార్టీలు జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకంటే.. జమిలీ ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడానికే పెడుతున్నారనేది ఆయా పార్టీల వాదన. దేశంలో ఇప్పటి వరకూ జరిగిన జమిలీ ఎన్నికల్లో కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ.. ఒకే పార్టీ గెలిచిన సందర్భాలు 77 శాతం ఉన్నాయి. జమిలీ ఎన్నికలు జరిగితే.. రెండు ఓట్లు ఒకే పార్టీకి వేసే సంప్రదాయం భారత ఓటర్లలో ఉందని.. దాన్ని క్యాష్ చేసుకోవడానికే బీజేపీ.. జమిలీ ఎన్నికలకు వెళ్తోందనేది.. ఆయా పార్టీల అభిప్రాయం. అందుకే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

2019 ప్రారంభంలో లో పన్నెండు రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పట్టుదలతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 2024కు దేశవ్యాప్తంగా ఒకే సారి జమిలీ నిర్వహించాలనేది ఆలోచన. దాని ప్రకారమే ప్రస్తుతం.. కసరత్తు నడుస్తోంది. చివరిగా లా కమిషన్ పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంది. మెజార్టీ పార్టీల అభిప్రాయాల ప్రకారం నిర్ణయం తీసుకోవాలనే రూలేమీ లేదు కాబట్టి.. అంతా మోడీ చేతుల్లోనే ఉందని భావించవచ్చు. కాకపోతే.. ఆయా రాష్ట్రాల పదవీ కాలాన్ని ముందుగానే రద్దు చేయాలన్నా.. మరింతగా పొడిగించాలన్నా.. రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అది చేస్తే..జమిలీ నిర్వహించడం మోడీకి సులువే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]