రివ్యూ : న‌క్ష‌త్రం

తెలుగు360.కామ్ రేటింగ్ 1.5/5

    కొంత‌మందిని చూస్తే జాలేస్తుంటుంది.
    అరె.. ఇన్ని మంచి సినిమాలు తీశాడే… ఇప్పుడేంటి? మ‌రీ ఇంత సిల్లీగా ఆలోచిస్తున్నాడు? అంటూ బాధేస్తుంటుంది.
    కృష్ణ‌వంశీని చూసినా ఇదే ఫీలింగ్‌.
    కృష్ణ‌వంశీ అంటే ఏమిటి?
    ఓ సింధూరం
    ఓ నిన్నే పెళ్లాడ‌తా
    ఓ గులాబీ
    ఓ ఖ‌డ్గం!!

– ఆహా కృష్ణ‌వంశీ. అదీ కృష్ణ‌వంశీ అంటే. కృష్ణ‌వంశీ ఫ్రేమ్ పెడితే తిరుగు ఉండ‌దు. ఓ క‌థ ప‌ట్టుకొన్నాడంటే… అందులో ఏదో ఓ గొప్ప విష‌యం ఉండే ఉంటుంది. ఓ సీన్ చూపించ‌డంటే.. నేర్చుకోవ‌డానికి ఎన్ని విష‌యాలుండేవో. పాటలు రొమాంటిక్‌గా ఉంటే, హీరోయిన్ల బొమ్మ‌లు మ‌న‌సులో ముద్రించుకుపోయేవి. మొత్తంగా చూస్తే… కృష్ణ‌వంశీ ఓ అనుభూతి ఇచ్చేవాడు. అనుభ‌వాల్ని పంచేవాడు.

కానీ న‌క్ష‌త్రం చూశాక కృష్ణ‌వంశీ గురించి ఇంకోసారి ఆలోచించండి.
ఏమైపోయిందా క్రియేటివిటీ అనిపిస్తుంది.
అస‌లు ఏం తీస్తున్నాడో త‌న‌కైనా తెలిసిందా? అంటూ జాలేస్తుంది
మ‌రో ద‌ర్శ‌కుడైతే `నీక‌స‌లు బుర్రుందా` అని అని తిట్టేస్తాం. కానీ తీసింది కృష్ణ‌వంశీ అక్క‌డ‌. గ‌త సినిమాలు చూసైనా కృష్ణ‌వంశీపై ఎక్క‌డో ఏదో ఓ మూల బ‌తికున్న అభిమానాన్ని గౌర‌వించైనా స‌రే.. థియేట‌ర్ నుంచి మౌనంగా త‌ల వొంచుకొని వ‌చ్చేయాల‌నిపిస్తుంది. న‌క్ష‌త్రం అలా ఉంది.

* క‌థ‌
ఓ కుర్రాడు ఎస్.ఐ కావాల‌నుకొంటాడు. ఓ దుర్మార్గుడు అడ్డు ప‌డ‌తాడు. త‌న క‌ల‌కి అడుగు దూరంలో నిలిచిపోవాల్సివ‌స్తుంది. ప్ర‌తీ పౌరుడూ యూనీఫామ్ లేని పోలీసే అనుకొని… ఎస్ ఐ అవ్వ‌క‌పోయినా, యూనీఫామ్ వేసుకొని డ్యూటీ చేస్తుంటాడు. ఆ ప్ర‌యాణంలో అలెగ్జాండ‌ర్ గురించి తెలుస్తుంది. ఓ గొప్ప సిన్సియర్ ఆఫీస‌ర్ ని చంపిన‌వాళ్ల‌పై ప‌గ తీర్చుకోవ‌డంతో క‌థ ముగుస్తుంది.

* విశ్లేష‌ణ‌
ఈ ఒక్క పాయింట్ చాలు కృష్ణ‌వంశీకి. దీని చుట్టూ బ‌ల‌మైన పాత్ర‌లు, ఇంకా బ‌ల‌మైన భావోద్వేగాలు, దేశ‌భ‌క్తి, త‌న క్రియేటివిటీ మేళ‌వించి సినిమా తీసేయ‌డానికి. కానీ… మ‌న దుర‌దృష్టం అదే జ‌ర‌గ‌లేదు. ఈ క‌థ‌ని ఇంకా నాసిర‌కంగా హ్యాండిల్ చేసి, లెక్క‌కు మించి పాత్ర‌ల్ని రంగంలోకి దింపి, ఏం చెప్పాలో, ఎందుకు చెప్పాలో, ఎంత చెప్పాలో తెలీక క‌న్‌ఫ్యూజ్ అయి.. ఆ గంద‌ర‌గోళంలో ఏమీ చెప్ప‌క‌, చెప్పిన విష‌యాల్లో త‌న మార్క్ చూపించ‌లేక అయ్యో కృష్ణ‌వంశీ అనిపించాడు. కృష్ణాన‌గ‌ర్‌లో క‌థ‌లు ప‌ట్టుకొని.. తిరిగే కుర్రాళ్ల కంటే.. కృష్ణ‌వంశీ దారుణంగా, తెలివి త‌క్కువ‌గా ఆలోచిస్తున్నా అనిపిస్తోంది కొన్ని స‌న్నివేశాలు చూస్తుంటే.

ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌.. న‌డిరోడ్డు మీద‌… వేలాది మంది చూస్తుండ‌గా.. మాన‌వ‌బాంబు రూపంలో పేలిపోతాడు. ఆ విష‌యం ప్ర‌భుత్వానికి తెలీదా? అత‌ని గురించి పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇంకా ఇన్వెస్టిగేష‌న్ చేస్తూనే ఉంటుంది? పోలీసుల‌పై గౌర‌వం పెంచే సినిమా తీశా అని చెప్పుకొంటున్న కృష్ణ‌వంశీ… ఈ ఒక్క సీన్‌తో పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలివి తేటల్ని ఎంత త‌క్కువ అంచ‌నా వేశాడో క‌దా?

ప్ర‌గ్యా జైస్వాల్ ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. ఆ పాత్ర‌ని ఓ దొంగ‌గా ప‌రిచ‌యం చేశాడు. దాని వెనుక ఏదో బ్ర‌హ్మాండ‌మైన ఎత్తుగ‌డ ఉందీ అనుకొంటే… అదేం క‌నిపించ‌దు. అస‌లు ఆ పాత్ర‌ని అలా ప‌రిచ‌యం చేయ‌డం వెనుక మ‌ర్మం.. వంశీకైనా తెలుసా?

`అలెగ్జాండ‌ర్‌ని ఎలా చంపానో తెలుసా.. కావాలంటే వీడియో చూడు` అని ఓ పాత్ర చెబుతుంది. ఆ వీడియో చూస్తే.. అంత‌కు ముందు స‌న్నివేశాలు కూడా క‌నిపిస్తాయి. మ‌రీ ఇంత ఘోరంగా స‌న్నివేశాలు అల్లుకొంటారా?

సిన్సియ‌ర్‌, డ్యూటీ మైండెడ్ పోలీస్ ఆఫీస‌ర్ ప్ర‌కాష్ రాజ్‌. ఇంట్లో త‌న కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోలేడా?

ఇలా ఒక‌టా రెండా?? సినిమాలో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో..?? కృష్ణ‌వంశీ కాగితం పై సీన్లు రాశాడా, లేదంటే సెట్‌కి వెళ్లి త‌న‌కు తోచిందేదో తీసేశాడా? అనే అనుమానం వ‌స్తే అది ప్రేక్ష‌కుడి త‌ప్పు కాదు.

* న‌టీన‌టులు
క‌థానాయిక‌ల్ని అందంగా చూపిస్తాడ‌న్న‌ది కృష్ణ‌వంశీకి ఉన్న పేరు. బ‌హుశా అదే అత‌న్ని పాడు చేసేసిందేమో. ప్ర‌తీ సీన్‌లోనూ క‌థానాయిక పాత్ర‌కు బోల్డ‌న్ని బిల్డ‌ప్ షాట్స్ వేశాడు కృష్ణ‌వంశీ. అవ‌స‌రం ఉన్నా, లేక‌పోయినా… అన్ని బిల్డ‌ప్‌లు ఎందుకో అర్థం కాదు. త‌న క‌థ‌లో హీరో ఎవ‌ర‌న్న విష‌యంలో కృష్ణ‌వంశీకి క్లారిటీ లేదు. సందీప్ కిష‌న్‌ని పెట్టుకొని.. ఆ హీరోయిజం చూపించే ఛాన్స్ ప్ర‌గ్యా జైస్వాల్‌కి ఇచ్చేశాడు. సినిమాలో చాలా చాలా పాత్ర‌లు క‌నిపిస్తాయి. అయితే… దేనికీ స‌రైన న్యాయం చేయ‌లేదు. ప్ర‌కాష్‌రాజ్‌ని ఇలానా వాడుకొనేది? జేడీ చ‌క్ర‌వ‌ర్తి స్థానంలో ఏ బ‌క‌రా ఉన్నా.. ఆ సీన్ ఇంతే క‌దా? పాట‌ల్లో సౌండ్స్ ఎక్కువ‌. డీఐ చేయ‌కుండా వ‌దిలేశాడేమో మొహాల‌న్నీ పాలిపోయిన‌ట్టు క‌నిపిస్తున్నాయి. ప్ర‌తీ సన్నివేశంలోనూ అప‌రిప‌క్వ‌త క‌నిపించిందంటే.. కృష్ణ‌వంశీ మ‌ళ్లీ సినిమా పాఠాలు నేర్చుకోవాలేమో అనిపిస్తుంది. సందీప్ ప్ర‌తీదానికీ అంత అరుస్తాడెందుకో అర్థం కాదు. డైలాగుల్ని అరుస్తూ చెబితే అవార్డులు వ‌స్తాయ‌ని ఎవ‌రైనా చెప్పారా? అలెగ్జాండ‌ర్ పాత్ర ఎలా ఉంటుందో అని అంతా ఆవురావురు మంటూ ఎదురుచూస్తారు. క‌నీసం క‌థ‌లో ఆ పాత్ర అయినా జోష్ తీసుకొస్తుంద‌ని న‌మ్ముతారు. కానీ.. అలెగ్జాండ‌ర్ గా మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ అద‌ర‌గొట్టిందీ ఏమీ ఉండ‌దు. త‌నీష్ కూడా ఓవ‌ర్ చేశాడు. రెజీనా, ప్ర‌గ్యా… ఉన్నా, శ్రియ ఐటెమ్ పాట చేసినా లాభం లేకుండాపోయింది.

* సాంకేతిక వ‌ర్గం
కృష్ణ‌వంశీ సినిమాల్లో పాట‌లు బాగుంటాయి. పైసా ఫ్లాప్ అయినా.. అందులో పాట‌లు ఇప్ప‌టికీ వినొచ్చు. కానీ.. ఆ అవ‌కాశం న‌క్ష‌త్రం ఇవ్వ‌లేదు. అస‌లు కొన్ని పాట‌ల్లో ప‌దాలే చెవికి సోక‌లేదు. ఏ పాట ఎందుకు వ‌స్తుందో తెలీదు. డీఐ చేయ‌డానికి డ‌బ్బుల్లేవో, లేదంటే… టైమ్ లేదో, ఇలా వ‌దిలేస్తే క్రియేటివిటీ అనుకొన్నాడో, తెర‌పై న‌టీన‌టులంతా సున్నాలేసుకొని వ‌చ్చిన‌ట్టు క‌నిపించింది. బాంబు బ్లాస్టింగ్ గ్రాఫిక్స్ దారుణంగా ఉన్నాయి.

* ఫైన‌ల్ ట‌చ్‌
కృష్ణ‌వంశీ కాస్త లాంగ్ బ్రేక్ తీసుకోవాలి. త‌న లోపాలేంటో నిజాయ‌తీగా అర్థం చేసుకోవాలి. వీలైతే… త‌న స్కూల్ నుంచి ఒక్క‌సారి బ‌య‌ట‌కు వ‌చ్చి ఆలోచించాలి. కృష్ణ‌వంశీ సినిమా అంటే ఇప్ప‌టికీ న‌మ్మ‌కంగా టికెట్ కొంటున్నాడు స‌గ‌టు ప్రేక్ష‌కుడు. ఇంకా కృష్ణ‌వంశీ క్రియేటివిటీపై న‌మ్మ‌కాలు చావ‌లేదు. ఆ న‌మ్మ‌కాన్ని కృష్ణ‌వంశీనే బ‌తికించుకోవాలి. కృష్ణ‌వంశీ సినిమాల్లో హీరోలు అవ‌స‌రం లేదు. క‌థే హీరో. కృష్ణ‌వంశీనే హీరో. అలాంటి హీరో మాటిమాటికీ జీరో అవుతుంటే ప్రేక్ష‌కుడు త‌ట్టుకోలేడు. సినిమాకీ అది మంచిది కాదు. వేక‌ప్ కృష్ణ‌వంశీ.. వేక‌ప్‌

తెలుగు360.కామ్ రేటింగ్ 1.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.