ఎవరి ‘తీర్పు’ వారిదే.. రాజధాని బాలారిష్టాలు తొలగేనా?

సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత వెలువడింది నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తలపెట్టిన అమరావతి రాజధాని నగర నిర్మాణానికి ఇది అనుమతించింది. అయితే దానితో పాటే కొన్ని కీలక ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతవరకూ అందరికీ అర్ధమైన విషయం. అయితే ఈ విషయంలో పాలక, ప్రతిపక్ష పార్టీలు తీర్పును ఎవరికి వారు తమ వాదనకే అనుకూలం అంటూ చెప్పడం మొదలుపెట్టారు. దీంతో సామాన్య జనంలో మళ్లీ అయోమయం నెలకొంది.

రాజధాని నిర్మాణానికి ఎన్జీటీ అనుమతించడం పట్ల సిఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. తీర్పు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వాడనలకు అనుకూలంగా ఉన్నట్టు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఎటువంటి ఆటంకాలు లేకుండా రాజధాని నిర్మాణం పూర్తవుతుందన్నారు. అదే విధంగా మంత్రి అయ్యన్న పాత్రుడు తదితర తెలుగుదేశం నేతలూ స్పందించారు. రాజధాని అడ్డుకోవాలన్న కుట్రలను ఎన్జీటీ తీర్పు తిప్పికొట్టిందంటూ వీరు తీర్పును స్వాగతించారు.

అదే సమయంలో కొండవీటి వాగును తమనకు అనుకూలంగా మార్చుకోవాలనే టీడీపీ కుట్రలకు ట్రిబ్యునల్‌ బ్రేక్‌ వేసిందంటూ వైసీపీ ఎమ్మల్యే ఆర్కే అంటున్నారు. ఎన్‌జీటీ తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు అనీ, ఎన్జీటీ తీర్పుతోనైనా సిఎం తన నివాసాన్ని కరకట్ల నుంచి తొలగించాలనీ ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. అదే విధంగా రాజధాని నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టు కెక్కినపిటిషనర్‌ శ్రీమన్నారాయణ కూడా తీర్పు తమకే అనుకూలం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్జీటీ కొండవీటి వాగు దిశను మార్చవద్దనడం వల్ల 15 వేల ఎకరాలకు ముప్పు తప్పిందన్నారాయన. అలాగే నిర్మాణ పనులను నెల నెలా సమీక్షించాల్సి ఉంటుందనీ, కరకట్టలను ముందుకు జరపద్దుని స్పష్టంగా ఇచ్చిన తీర్పులను అమలు చేయకపోతే కోర్టు థిక్కరణ ఎదుర్కోవలసి ఉంటుందని పిటిషనర్‌ తరపు న్యాయవాది అంటున్నారు. వరద ప్రాంతాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు చెప్పంది. దీనిని బట్టి మాస్టర్‌ ప్లాన్‌ను మార్చాల్సి ఉంటుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇక 6గురు సభ్యులతో సూపర్‌వైజర్‌ కమిటీ ఏర్పాటు ఆదేశాలు కూడా తమకే అనుకూలం అన్నట్టు మాట్లాడారాయన. ఏదేమైనా… పండే భూములను కాపాడే వరకూ నా పోరాటం ఆగదంటున్న శ్రీమన్నారాయణ… తదితరుల మాటలను బట్టి… రాబోయే రోజుల్లో రాజధాని నిర్మాణం ఇక ఎటువంటి అడ్డంకులూ లేకుండా సాఫీగా సాగబోతోందని మాత్రం చెప్పలేం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.