తెరాస‌లో త‌గ్గిన కొడంగ‌ల్ ఉప ఎన్నిక హ‌డావుడి!

తెలుగుదేశం పార్టీకి రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన వెంట‌నే కొడంగ‌ల్ నియోజ‌క వ‌ర్గంలో ఉప ఎన్నిక త‌ప్ప‌ద‌నే వాతావ‌ర‌ణ‌మే క‌నిపించింది. టీడీపీకి గుడ్ బై చెప్పేస్తూ, స్పీక‌ర్ ఫార్మాట్ లోనే రేవంత్ రాజీనామా లేఖ రాశారు. దీంతో ఉప ఎన్నిక త‌ప్ప‌ద‌నే అంద‌రూ అనుకున్నారు. అధికార పార్టీ తెరాస కూడా ఈ అంశ‌మై చ‌క‌చ‌కా పావులు క‌ద‌ప‌డం మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డి అనుచ‌రుల్ని ఆక‌ర్షించింది. ఆ నియోజ‌క వ‌ర్గం ప‌రిధిలో అన్ని స్థాయుల నేత‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిమ‌రీ వ‌ల‌స‌ల్ని ప్రోత్ప‌హించారు. అంతేనా… మంత్రి హ‌రీష్ రావుకు రేవంత్ ఇలాఖాలో పార్టీ వ్య‌వ‌హారాలు చూసే బాధ్య‌త‌ను ప్ర‌త్యేకంగా అప్ప‌గించారు. కొడంగ‌ల్ లో ఓ నెల‌రోజుల‌పాటు ఆయ‌న మ‌కాం వేయ‌బోతున్న‌ట్టు కూడా ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ్డాయి. అధికార ప‌క్షంలో ఇంత హ‌డావుడి ఎలా ఉందంటే, కొడంగ‌ల్ ఉప ఎన్నిక రేపోమాపో అన్న‌ట్టుగా అనిపించింది. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి కాస్త మారింది. తెరాస‌లో కొడంగ‌ల్ ఎన్నిక జోష్ కాస్త త‌గ్గింద‌ని తెలుస్తోంది.

స్పీక‌ర్ ఫార్మాట్ లో రేవంత్ రాజీనామా చేశారు. కానీ, ఆ రాజీనామా ప‌త్రం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ద‌గ్గ‌రే ఉంద‌నీ, ఇంకా స్పీక‌ర్ కు చేర‌లేద‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ ప‌త్రం ఎప్పుడు స్పీక‌ర్ కు చేరుతుందో, ఆ లేఖ‌ను పంపించ‌కుండా టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఎందుకు తాత్సారం చేస్తున్నారో తెలీదు! దీంతో, కొడంగ‌ల్ ఉప ఎన్నిక ఇప్ప‌ట్లో ఉంటుందా అనే అనుమానాలు కూడా క‌లుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తెరాస కూడా ఈ ఉప ఎన్నిక పేరుతో గ‌త కొద్దిరోజులుగా ప్ర‌ద‌ర్శిస్తున్న హ‌డావుడిని కాస్త త‌గ్గించుకున్న‌ట్టు చెబుతున్నారు. ఒక‌వేళ ఉప ఎన్నిక అంటూ జ‌రిగితే తెరాస త‌ర‌ఫున మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి సోద‌రుడు ప‌ట్నం న‌రేందర్ రెడ్డిని బ‌రిలోకి దింపాల‌ని తెరాస భావిస్తోంద‌న్న క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. దీంతో ఆయ‌న కూడా ఈ మ‌ధ్య కాస్త చురుగ్గానే పార్టీ ప‌నుల్లో త‌ల‌మున‌క‌ల‌య్యారు! అయితే, రేవంత్ రాజీనామా ప‌త్రం ఇంకా స్పీక‌ర్ వ‌ర‌కూ రాక‌పోయేస‌రికి, కాస్త చ‌ల్ల‌బ‌డ్డార‌ని అంటున్నారు. ఆయ‌న రాజీనామాపై స్ప‌ష్ట‌త వ‌చ్చేవ‌ర‌కూ ఎన్నికల ప్ర‌య‌త్నాల‌ను కాస్త ప‌క్క‌న పెట్టాల‌నే ఆలోచ‌న‌లో అధికార పార్టీ నేత‌లు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

తెరాస నాయ‌క‌త్వ‌మంతా కొడంగ‌ల్ పై ప్ర‌త్యేక దృష్టి పెట్టేస‌రికి… కొన్ని స‌మీక‌ర‌ణ‌లు మారాయ‌ని చెప్పుకోవ‌చ్చు! అధికార పార్టీ దూకుడు చూసిన త‌రువాత రేవంత్ వ్యూహంలో కొంత మార్పు వ‌చ్చింద‌ని కూడా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు ద‌గ్గ‌ర ఉన్న రాజీనామా ప‌త్రం తెలంగాణ స్పీక‌ర్ కు చేరేందుకు మ‌రింత స‌మ‌యం ప‌ట్టేలానే క‌నిపిస్తోంది. ఉప ఎన్నిక విష‌య‌మై మొద‌ట్లో క‌త్తులు దూసిన రేవంత్ కూడా ఇప్పుడు ఆ టాపిక్ ఊసెత్త‌డం లేదు. మౌనంగానే ఉంటున్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రానికి వ‌చ్చాక‌, కాంగ్రెస్ తో త‌న కీల‌క పాత్ర ఏంటో స్పష్ట‌త వచ్చేవ‌ర‌కూ ఆయ‌న యాక్టివేట్ అయ్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మొత్తానికి, కొడంగ‌ల్ ఉప ఎన్నిక పేరుతో తెరాస చేసిన హ‌డావుడికి ఫ‌లితం ఉంటుందా అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.