కొత్త‌ ఏడాది నుంచీ ఏపీలో ప్ర‌త్యేక హైకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌రువాత పెండింగ్ ఉన్న పంప‌కాల్లో ముఖ్య‌మైంది.. హైకోర్టు విభ‌జ‌న‌. దీన్నొక ప్ర‌ధాన డిమాండ్ కేంద్రాన్ని కొన్నాళ్లపాటు తెరాస తీవ్రంగా అడుగుతూ వ‌చ్చింది. పార్లమెంటు సమావేశాల్లో తెరాస ఎంపీలు కూడా కేంద్రంపై బాగానే విమర్శలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇదే సంద‌ర్భంలో, హైకోర్టు విభ‌జ‌న ఆల‌స్యానికి కార‌ణం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ వైఖ‌రే అంటూ కూడా విమ‌ర్శించిన సంద‌ర్భాలూ ఉన్నాయి. అయితే, ఎట్ట‌కేల‌కు హైకోర్టు విభ‌జ‌న‌పై స్పష్ట‌మైన సంకేతాలు వెలువ‌డ్డాయి. డిసెంబ‌ర్ 15 నాటికి హైకోర్టు తాత్కాలిక భ‌వ‌న నిర్మాణం పూర్తి చేస్తామంటూ ఏపీ స‌ర్కారు అఫిడ‌విట్ ఇచ్చిన నేప‌థ్యంలో సుప్రీం కోర్టు స్పందించింది. తాత్కాలిక భ‌వ‌నం పూర్త‌వ‌గానే నోటిఫికేష‌న్ ఇవ్వాలంటూ ఆదేశించింది.

ఏపీ ఇచ్చిన అఫిడ‌విట్ లో డిసెంబ‌ర్ 15కి అన్ని ర‌కాలుగా రెడీ ఉంటామ‌ని పేర్కొన్నారు. కోర్టు తాత్కాలిక భ‌వ‌నంతోపాటు జ‌డ్జిల నివాస స్థ‌లాలతోపాటు స్టాఫ్ క్వార్ట‌ర్స్ కూడా ఆ తేదీ నాటికి పూర్తిస్థాయిలో సిద్ధ‌మైపోతాయ‌ని ఏపీ స‌ర్కారు తెలిపింది. అయితే, అధికారుల విభ‌జ‌న అంశం కూడా కోర్టులో ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చింది. దీనిపై న్యాయ‌వాది నారీమ‌న్ స్పందిస్తూ… ఆ ప్ర‌క్రియ కూడా ప్రారంభ‌మైపోయింద‌నీ, దానికి సంబంధించిన నోటిఫికేష‌న్ కూడా విడుద‌లైంద‌నీ చెప్పారు. డిసెంబ‌ర్ 15 నాటికి భ‌వ‌నాలు రెడీ అయిపోతే, ఆ త‌రువాత కేంద్ర‌మే నోటిఫికేష‌న్ ఇవ్వాల్సి ఉంటుంద‌ని చెప్పారు.

అయితే, ఇక్కడ గ‌మనించాల్సిన మ‌రో అంశం ఏంటంటే… హైకోర్టు విభ‌జ‌నకు సంబంధించి తెలంగాణ‌, ఆంధ్రా, కేంద్రం త‌ర‌ఫున ముగ్గురు న్యాయ‌వాదులున్నారు కదా. కానీ, కేంద్రం ప్ర‌భుత్వం త‌ర‌ఫున అటార్నీ జ‌న‌ర‌ల్ వాద‌న‌లే ఎక్కువ‌గా వినిపించ‌డం గ‌మ‌నార్హం! అంటే, తెలంగాణ హైకోర్టు విభ‌జ‌న అంశ‌మై ఆ రాష్ట్రం త‌ర‌ఫున న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ కంటే… ఆ స‌మ‌స్య‌పై కేంద్రం పోరాట‌మే ఎక్కువ‌గా ఉంద‌నే అభిప్రాయ‌మూ ఉంది. కేంద్రం, ఆంధ్రా మ‌ధ్య‌న మాత్ర‌మే కోర్టులో వాదోప‌వాదాలు జ‌రిగాయి. సరే, ఏదైతేనేం కొత్త ఏడాది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో రెండు హైకోర్టులు పనులు ప్రారంభించేందుకు దాదాపు లైన్ క్లియర్ అయిపోయినట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.