పాక్ ‘వెనుకబాటు తనమే’ భారత్ సమస్యలకు మూలం!!

పాకిస్తాన్ ను ఏకాకి గా నిలబెట్టడంలో భారత్ విజయవంతమైందన్న పరిశీలనలు, విశ్లేషణలు సరికాదు. బహుశ అది ఎప్పటికీ జరిగే పనికూడా కాదు. అయితే పాక్ కు వ్యతిరేకంగా అన్ని అవకాశాలను వినియోగించకోవడంలో, అన్ని శక్తులనూ కూడగట్టడంలో ఇంతకుముందెన్నడూ లేనంతగా భారత్ ముందడుగులు వేస్తోంది.

క్రికెట్ లో భారత్ గెలిచినా కూడా పాక్ లో ఇండియా వ్యతిరేక ప్రదర్శనలు, పాక్ క్రీడాకారుల పట్ల నిరసన ప్రదర్శనలూ జరగడం మామూలే! ”ఊరీ టెర్రరిస్టుల దాడులకు ప్రతీకారంగా భారత్ సైనిక కమాండోలు చేసిన మెరుపుదాడులు లేదా సర్జికల్ స్ట్రైకింగ్స్ పట్ల పాక్ ప్రజల ప్రతిస్పందనలు ఆదేశపు టివిలలో, పత్రికలలో పెద్దగా రాలేదు. భారత ప్రభుత్వం తన దేశ ప్రజల ఉద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు సాధించడానికే ”మెరుపుదాడుల” ప్రచారాన్ని సాగిస్తోందని, అవి సర్జికల్ అటాక్స్ కాదని పాక్ చేసిన ప్రకటన మాత్రమే పదేపదే ఆదేశపు మీడియాలో వస్తోంది. ఇంతకీ అపుడు ఏమి జరిగిందన్న అయోమయమే పాక్ ప్రజల స్పందనా రాహిత్యానికి కారణం కావచ్చు!

ప్రపంచం కాదనలేని విశిష్టత, ప్రాధాన్యత, ప్రాముఖ్యత వున్న భారతదేశం పొరుగునే వుండటం, అంతకు మించి దేశం ఏర్పడిందిమొదలు భారత్ పట్ల వ్యతిరేకత వుండటమే పాకిస్తాన్ కు స్ట్రేటజిక్ గా ప్రాముఖ్యతకు మూలం!
ఆ విధంగా పాకిస్తాన్ ది భౌగోళిక- రాజకీయ వ్యూహాత్మక స్థితి. పాకిస్తాన్ అంతర్గతంగా ఎటువంటిదైనా, భారతదేశంతో తన వివాదాలు ఏవైనా, కశ్మీర్‌లో ఏ జోక్యం చేసుకున్నా ఆ దేశానికి భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. అటువంటి ప్రాముఖ్యతను అమెరికా, చైనా, రష్యా దేశాలు తమతమ అవసరాల రీత్యా నిలబెడుతూండటం బహిరంగ రహస్యమే!

మతం కారణంగా పాకిస్తాన్‌ కు ఇస్లామిక్ ప్రపంచం ఇచ్చే ప్రాధాన్యత భారత్ కు వుండదు. ఇవన్నీ అంతర్జాతీయ రాజకీయాలు. వాటికి ప్రయోజనాలతో తప్ప న్యాయాన్యాయాలతో పనిలేదు. ఈ స్థితి దశాబ్దాలుగా వుంది. టెర్రరిస్టుల పోషణ, ఇండియా మాత్రమె గాక పలు దేశాలలో టెర్రరిజానికి పాక్ కేంద్రంగా మారటం వంటి దోషాలే అమెరికా కన్నెర్రకు ”ప్రస్తుత కారణాలు” అయ్యాయి.

భారత ఉపఖండంలో గత అరవై డెబ్బై ఏళ్ళలో సంభవించిన సాంఘిక ఆర్ధిక పరిణామాలను సుదీర్ఘకాలం సైనిక పాలనలో వున్న పాకిస్తాన్ అందిపుచ్చకోలేకపోవడం లేదా ట్రాన్స్ ఫర్మేషన్ చెందకపోవడం లేదా అన్ని విధాలా వెనుకబడే వుండటం కూడా ఆదేశానికీ మనదేశానికీ కంపేటబిలిటీ కుదరకపోవడానికి కారణమైంది.

భారత ఉప ఖండమంతటా ఉండిన ఫ్యూడల్ ఆర్థిక వ్యవస్థ స్థానంలో ఇన్వెస్టుమెంట్ ఎకానమీ విస్తరిస్తోంది. రాచరికాలు, జమీందారీలకు బదులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాలు బలపడుతున్నాయి. సాధారణ ప్రజల చైతన్యాలు, భాగస్వామ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాలన్నీ సవ్యంగా సాగి ఉన్నట్లయితే భారతదేశం మాదిరిగా పాకిస్తాన్ కూడా ఒక బలమైన ఆధునిక ఆర్థిక, ప్రజాస్వామిక దేశంగా అవతరించి ఉండేది.

తన పరిస్థితి అన్నివిధాలా అస్తవ్యస్తంగా తయారుకావటానికి మూలాలను పాక్ ఆలోచించుకోవలసి ఉంది.అందులో కశ్మీర్ సమస్య, ఊరీ దాడి, సర్జికల్ దాడి వంటి వాటికి కూడా సమాధానాలు లభిస్తాయి. ఈ స్పృహ అక్కడి రాజకీయ నాయకత్వానికి ఎంతో కొంత వుంది కూడా. కాని సైన్యానికి, బురాక్రసీకి, మతశక్తులకు ఈ అవగాహన లేదు. సామాన్య ప్రజలు ప్రజాస్వామిక వ్యవస్థలలో మాదిరిగా ఉద్యమాలు, తిరుగుబాట్లు చేయలేరు.

ఇది పాకిస్తాన్ కు ఎప్పటికైనా తనకు తాను సమాధానం చెప్పుకోవలసిన ప్రశ్నే!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com