మార్చిలో తెలుగు నుంచి రెండు పెద్ద రేంజ్ సినిమాలు రాబోతున్నాయి. ఒకటి రామ్ చరణ్ ‘పెద్ది’ అయితే.. రెండోది నాని ‘పారడైజ్’. ఒకటి 26న, మరోటి 27న రిలీజ్కు రెడీ అయ్యాయి. పోస్టర్లు కూడా వేశారు. కానీ ఇందులో ఓ లాజిక్ వుంది. ‘పెద్ది’ గనుక పక్కాగా వస్తే ‘పారడైజ్’ వాయిదా పడుతుంది. ఈ విషయాన్ని ‘పారడైజ్’ టీమ్ కూడా బాహాటంగానే చెప్పేసింది. దాంతో రెండు సినిమాల్లో ఒకటి రావడం దాదాపు పక్కా.. అని చిత్రసీమ భావిస్తోంది.
అయితే.. ఇప్పుడు రెండు సినిమాలూ డైలామాలోనే పడ్డాయి. ‘పెద్ది’కి సంబంధించిన పెండింగ్ పనులు చాలా ఉన్నాయని టాక్. పైగా ఇది పాన్ ఇండియా సినిమా. షూటింగ్ అయిపోయిన తరవాత ప్రచారానికంటూ కొంత సమయం కేటాయించాలి. రెండు నెలల్లో సినిమా పూర్తి చేయడం, పబ్లిసిటీ చేసుకోవడం జరిగిపోతాయా? అంటే.. కష్టమే అనిపిస్తోంది. దాంతో ‘పెద్ది’ కనీసం నెల రోజులు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మరి.. ‘పారడైజ్’ అయినా రెడీ అవుతుందా అంటే… ఇక్కడా అనుమానమే. ‘పెద్ది’ ఆలస్యమైనా, ‘పారడైజ్’ని అనుకొన్న సమయానికి పూర్తి చేయడం కష్టమే అని టాక్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల షూటింగ్ కి మరికొంత సమయం కావాలని అడుగుతున్నాడట. పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా టైమ్ పట్టేట్టు వుంది. సో.. ‘పెద్ది’తో పాటుగా`పారడైజ్` కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ రెండు సినిమాలూ వస్తాయేమో అని.. మార్చి సినిమాని నెగ్లెట్ చేసింది టాలీవుడ్. ఇప్పటికిప్పుడు ఆ డేట్స్ లాక్ చేసుకోవడం కూడా కష్టమే. మార్చిలో వచ్చే మరో సినిమా ‘టాక్సిక్’. యశ్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. తెలుగు సినిమా కాకపోయినా, తెలుగులో యశ్ సినిమాకు మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు నుంచి ఈ రెండు సినిమాలూ రాకపోతే… యశ్ కి అది పెద్ద ప్లస్ అవుతుంది.


