టాలీవుడ్ దృష్టంతా ఏప్రిల్ 30పైనే ఉంది. ‘పెద్ది’ కోసం అట్టిపెట్టుకొన్న డేట్ ఇది. ఆ రోజున ‘పెద్ది’ వస్తుందని నిర్మాతలు బల్ల గుద్ది చెబుతున్నారు. కానీ రెండు రోజుల నుంచీ ఓ వార్త గట్టిగా చక్కర్లు కొడుతోంది. ఏప్రిల్ 30న `పెద్ది` రావట్టేదని, ఈ సినిమా వాయిదా పడడం ఖాయమని, మేలో గానీ, జూన్ లోగానీ వస్తుందన్నది ఆ వార్తల సారాంశం.
పెద్ది సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో అది నిర్మాతల ఇష్టం. కాకపోతే.. ముందే ఓ క్లారిటీ ఇస్తే, మిగిలిన సినిమాలకు లైన్ క్లియర్ అవుతుంది. ‘పెద్ది’ రాకపై నమ్మకం లేకే… దిల్ రాజు ‘గాయపడ్డ సింహం’ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేస్తున్నారు. ‘లెనిన్’ సినిమా కూడా మే 1నే రావాలి. కానీ ‘పెద్ది’ కోసం వాయిదా వేశారు. ఒక వేళ `పెద్ది` రాకపోతే… ఆ సమయానికి `లెనిన్`ని తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు ‘స్వయంభూ’ చిత్రాన్నీ ఏప్రిల్ 30న విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. కాకపోతే ‘పెద్ది` నిర్మాతల నుంచి ఓ స్పష్టమైన ప్రకటన రావాలి. చివరి నిమిషం వరకూ దాగుడు మూతలు ఆడి, అప్పుడు వాయిదా వేస్తే, మిగిలిన సినిమాల ప్రిపరేషన్‌కు టైమ్ ఉండదు.
మార్చి 26న ‘పెద్ది’ రావాల్సివుంది. కానీ వాయిదా వేశారు. రెండోసారి కూడా వాయిదా అంటే అభిమానులు ఎలా తీసుకొంటారో అనే భయం నిర్మాతల్లో ఉండి ఉండొచ్చు. మరోవైపు ఓటీటీ నుంచి కూడా ఒత్తిడి ఉండి ఉండొచ్చు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 30న తీసుకురావాలన్న కృత నిశ్చయంతో చిత్రబృందం పని చేస్తోంది. కానీ ఏప్రిల్ 30న రావడం కష్టమే అని తేలిపోతే మాత్రం ఆ నిర్ణయం ముందే ప్రకటిస్తే మిగిలిన సినిమాలకు వెసులుబాటుగా ఉంటుంది. లేదంటే.. ఓ మంచి డేట్ మిస్ అయినట్టే.
