తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలు వినిపిస్తున్న సరికొత్త వాదన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అసలు ట్యాపింగ్ జరగలేదని మొదట్లో బుకాయించిన నేతలు, ఇప్పుడు ట్యాపింగ్ నేరం కాదు అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. ప్రజా భద్రత కోసమో, మాఫియా లేదా ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకో ప్రభుత్వం నిఘా ఉంచడం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. దానికి కొన్ని కఠినమైన నిబంధనలు ఉంటాయి. కానీ, తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అందుకు పూర్తి భిన్నంగా జరిగిందని తెలుస్తోంది.
దొరికిపోయారు కాబట్టే ఈ సమర్థన వాదనా?
న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు సహా అందరిపై ట్యాపింగ్ జరిగిన అంశంపై దర్యాప్తు చేస్తున్నామని సిట్ చీఫ్ సజ్జనార్ స్పష్టంగా చెబుతున్నారు. తెలంగాణలో ట్యాపింగ్ జరిగింది దేశద్రోహులపై కాదు, సొంత పార్టీ నేతలు, విపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, చివరకు సినిమా నటుల మీద. వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను, వ్యాపార రహస్యాలను తెలుసుకుని, వాటిని రాజకీయ ఫిరాయింపులకు లేదా ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకోవడం ముమ్మాటికీ నేరమే. దీనిని ప్రజా భద్రత పేరుతో సమర్థించుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ప్రస్తుతం సిట్ దర్యాప్తులో వందలాది డిజిటల్ సాక్ష్యాలు, ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌ల రికవరీ, అప్రూవర్‌గా మారిన పోలీసు అధికారుల వాంగ్మూలాలతో బీఆర్ఎస్ అగ్రనేతలు ఇరుక్కుపోయినట్లు కనిపిస్తోంది. రేపు కోర్టులో ఈ ఆధారాలు బయటపడితే ప్రజల ముందు పరువు పోతుందని ముందే గ్రహించిన నేతలు, ఇప్పుడు వ్యూహాత్మకంగా తమ వాదనను మార్చినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ అందరూ చేస్తారు.. అది నేరం కాదు అనే ఒక నార్మలైజేషన్ వాదనను ప్రజల్లోకి వదలడం ద్వారా, రేపు రాబోయే ఆధారాల తీవ్రతను తగ్గించాలన్నది వీరి ఎత్తుగడగా కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
నేరాన్ని నేరంగా ఒప్పుకుంటున్నట్లేనా?
బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు చేస్తున్న వాదనను గమనిస్తే.. పరోక్షంగా ట్యాపింగ్ జరిగిందని వాళ్ళు ఒప్పుకుంటున్నట్లే భావించాల్సి ఉంటుంది. ఒకప్పుడు మేం ట్యాపింగ్ చేయలేదు అన్న నోళ్లు, ఇప్పుడు ట్యాపింగ్ నేరం కాదు అని ఎందుకు అంటున్నాయి అంటే, సాక్ష్యాధారాలు అడ్డంగా దొరికిపోయాయని వీరికి అర్థమైపోయింది. దొరికిన దొంగలు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అడ్డగోలు తర్కాలను తెరపైకి తెస్తున్నట్లుగా ఈ వ్యవహారం ఉంది. ఒకరి వ్యక్తిగత గోప్యతను హరించడం రైట్ టు ప్రైవసీకి విరుద్ధమని తెలిసినా, ఇలాంటి వాదనలు చేయడం వారి నైతిక పతనాన్ని సూచిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
బ్లాక్‌మెయిలింగ్ సంస్కృతికి పునాది
గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌ను ఒక ఆయుధంగా వాడుకుని ప్రత్యర్థి పార్టీల నేతలను భయపెట్టడం, వ్యాపారవేత్తల నుంచి నిధులు వసూలు చేయడం, అసమ్మతి గొంతులను నొక్కడం వంటి పనులు జరిగాయని ఆరోపణలు కాంగ్రెస్ చేస్తోంది. ఇది కేవలం ట్యాపింగ్ మాత్రమే కాదు, ఒక మాఫియా తరహా వ్యవస్థను ప్రభుత్వ యంత్రాంగంలో నడిపించడమేనని అంటున్నారు. రేపు రాబోయే చార్జ్ షీట్లలో ఈ అంశాలు బట్టబయలైతే, ప్రజలకు ఏమని సమాధానం చెబుతామన్న భయమే బీఆర్ఎస్ నేతల ప్రస్తుత గగ్గోలుకు కారణమని అంటున్నారు. అధికార అహంకారంతో నాడు చేసిన అకృత్యాలు నేడు మెడకు చుట్టుకుంటున్నాయి. లీకులు ఇస్తున్నారని ఆందోళన చెందడం కంటే, అసలు చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడానికి ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు. రాజకీయాల కోసం పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించి, ఇప్పుడు అది నేరం కాదని వాదించడం ద్వారా బీఆర్ఎస్ మరింత పలచనవుతోందని అనుకోవచ్చు.


