నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. నకిలీ మద్యం తయారీ , అమ్మకాల కేసులో జోగి రమేష్, జోగి రాములను సిట్ అధికారులు కీలక నిందితులుగా ఉన్నారు. వీరికి ఇటీవల షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. బెయిల్ పై బయటకు వచ్చినప్పటి నుండి బెయిల్ షరతులన్నింటిని ఉల్లంఘిస్తున్నారు. చివరికి శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు.
విచారణకు సహకరించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. సాక్షులను ప్రభావితం చేసేలా మరియు దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా వారి ప్రవర్తన ఉందని పోలీసులు చెబుతున్నారు. కేవలం దర్యాప్తుకు ఆటంకం కలిగించడమే కాకుండా, జోగి సోదరుల రాకతో క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు. బెయిల్ మీద బయట ఉంటూ రాజకీయ విద్వేషాలను రగిల్చేలా వ్యాఖ్యలు చేయడం, ప్రత్యర్థి పార్టీల శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరించడం ద్వారా అశాంతికి కారణమవుతున్నారు
ఒకవైపు నకిలీ మద్యం వంటి సామాజిక విపత్తుకు కారణమైన కేసులో నిందితులుగా ఉంటూ, మరోవైపు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా బెయిల్ పొందిన నిందితులు సాక్షులను బెదిరించినా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా న్యాయస్థానాలు బెయిల్ రద్దు చేసే అధికారం కలిగి ఉంటాయి. ఇప్పుడు పోలీసులు సమర్పించిన ఆధారాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వారి రెచ్చగొట్టే ప్రసంగాలు కోర్టు ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కోర్టు పోలీసుల వాదనతో ఏకీభవిస్తే, జోగి సోదరులకు మళ్ళీ జైలు గడప తొక్కక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.