చర్చలన్నీ పవన్‌ రోల్‌ వైపే… జనవరి నుంచి జనంలోకి?

సూపర్‌హీరోగా పవన్‌ కళ్యాణ్‌ వేసే పాత్రలు ఎలా వుంటాయన్నది ఎప్పుడూ ఆసక్తి గొల్పే అంశమే. మామూలు పాత్రలనే తన మ్యానరిజమ్స్‌తో పండించి వసూళ్లు కొల్లగొడుతుంటారు. చాలా కామెడీ కొంచెం సీరియస్‌ ఇలా. రాజకీయ రంగంలోనూ ఇప్పుడు పవర్‌ స్టార్‌ పాత్రపై వూహలు అలాగే వున్నాయి. ఎన్నికలు పార్టీలు జయాపజయాల గురించిన చర్చ ఎక్కడ మొదలైనా చివరకు పవన్‌ కళ్యాణ్‌ ఆయన జనసేన ప్రభావం దగ్గరకు రావలసిందే. ఎందుకంటే గతంలో ఆయన ప్రచారం తెలుగుదేశంకు కలిసివచ్చినా వైసీపీకీ టీడిపి-బిజెపి కూటమికి మధ్య ఓట్ల తేడా 5 లక్షలే! ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లో సీట్లు రాకపోతే ప్రభుత్వమే ఏర్పడేది కాదు. ఇదంతా పవన్‌ చలవేనని టిడిపి నేతలు ఒప్పుకుంటారు. మరి ఆయన స్వంతంగా పోటీ చేస్తే ఇదంతా తమకు నష్టం కావడమే గాక ఇంకా కొంచెం ఎక్కువ ఓట్లే పోతాయన్న ఆందోళన వుంది. అందుకే ఆయనేదో తమతోనే వున్నట్టు జగన్‌ వర్సెస్‌ పవన్‌ తరహాలో టిడిపి వారు మాట్లాడుతుంటారు. ఇదే ఎత్తుగడ బిజెపిది కూడా.

టిడిపి వైసీపీల మధ్య దాగుడు మూతలాడుతున్న బిజెపి పవన్‌ తమతో వుండొచ్చనే సంకేతాలు ఇచ్చి గందరగోళం పెంచుతున్నది. ఆయన ఇప్పటివరకూ వామపక్షాలకు అనుకూలంగా మాట్లాడారు. పార్టీ నిర్మాణం కార్యకర్తల ఎంపికపై దృష్టి పెట్టానంటున్నారు. మొదట తను పోటీ చేస్తానన్న అనంతపురంలో కార్యకర్తల ఎంపిక మొదలు పెట్టి అంతటా పూర్తి చేశారు. సీమలో మలివిడత కూడా చేయొచ్చునని సమాచారం. తెలంగాణకు వస్తే హైదరాబాద్‌తో సహా అయిదు జిల్లాల ఎంపిక అయిపోయిందట. ఏమైనా కేంద్రీకరణ ఎపిపైనే గనక అక్కడ ఆయన ఏం చేస్తారనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
డిసెంబర్‌ నాటికి ఎంపికలు నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసి జనవరి నుంచి జనంలోకి రావాలని ఆయన యోచిస్తున్నారట. బయిటివారి విరాళాలు తీసుకోరాదని నిర్ణయించుకోవడం వల్ల కేవలం సినిమాల వల్ల వచ్చే ఆదాయమే ఉపయోగించాలని అందుకోసం మరో అయిదారు నెలలు సినిమాలు పూర్తి చేయాలని ఆయన ప్రణాళికగా కనిపిస్తుంది. అప్పటి వరకూ ఈ వూహాగానాలు సాగుతూనే వుంటాయి. హఠాత్తుగా ప్రత్యేక హౌదా ఇచ్చేసి బిజెపి జనసేనతో కలవొచ్చని కూడా టిడిపి వర్గాలు సందేహిస్తున్నాయి. కాని హౌదా సమస్య ఇక మళ్లీ రాకపోవచ్చు. ప్రధాని మోడీకి ఆ ఆలోచన లేదు కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.