అయోధ్యలో శివసేన, వీహెచ్‌పీ కరసేవ..! రాజకీయం కోసమే..!!

ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రామ్ మందిర్ నిర్మాణంపై విశ్వహిందూ పరిషత్, శివసేన పోటాపోటీగా నేడు రెండు వేర్వేరు బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఈ పరిణామాలతో.. అయోధ్యలో సెక్యూరిటీని పెంచారు శుక్రవారం నుంచే నగరంలో బందోబస్తును కట్టుదిట్టం చేశారు. కీలకప్రాంతాల్లో అశ్వికదళాలను, కవాతు దళాలను మోహరించారు. ఆర్ఎస్ఎస్ మద్దతుతో విశ్వహిందూపరిషత్ ధర్మ సభను నిర్వహిస్తోంది. రామ్ మందిర్ ను వేగంగా నిర్మించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం సభ ఉద్దేశం. శివసేన నిర్వహించే సభకోసం.. ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే శనివారమే అయోధ్యకు చేరుకున్నారు. ఉద్ధవ్ థాకరే రెండురోజులు యూపీలో పర్యటిస్తారు. పాతిక వేల మంది శివసైనికులు కూడా రైళ్లలో అయోధ్యకు చేరుకున్నారు. రెండు సభల కోసం.. అయోధ్యకు రెండు లక్షల మంది వస్తారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

17 నిమిషాల్లో బాబ్రీమసీదును కూల్చివేశారని .. రామ్ మందిర్ నిర్మాణం మాత్రం ఎందుకు ఆలస్యమని శివసేన ప్రశ్నిస్తోంది. ఈ ర్యాలీల వ్యవహారం యూపీలో రాజకీయ రగడ సృష్టిస్తోంది. అయోధ్యకు సరిహద్దు సైన్యాన్ని రప్పించాల్సిన అవసరం కనిపిస్తోందని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. రామాలయ నిర్మాణం కొరకు పార్లమెంట్ ద్వారా ఆర్డినెన్స్‌ తీసుకురావాలని శివసేన డిమాండ్‌ చేస్తోంది. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీతో సహా, హిందుత్వ పార్టీలు రామజపాన్ని అందుకున్నాయి. పార్లమెంట్‌ ఆర్డినెన్స్‌తో సంబంధం లేకుండా సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రామాలయ నిర్మాణం చేపడతామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కొద్ది రోజుల కిందట ప్రకటించారు. ఈ క్రమంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వీహెచ్ పీ , శివసేన సభలపై బీజేపీ.. పాజిటివ్ గా స్పందించింది. రామాలయ నిర్మాణానికి 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి బీజేపీ కట్టుబడి ఉందని రామ్ మాధవ్ ప్రకటించారు.రామాలయ నిర్మాణానికి చట్టం చేయాలని అడగటం ప్రజాస్వామ్య వ్యతిరేకం కాదని చెప్పుకొస్తున్నారు. అయితే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రామాలయ నిర్మాణం కోరుతూ చట్టం తీసుకువచ్చే విషయంపై మాత్రం.. ఆయన సైలెంట్ గా ఉన్నారు. అంటే.. రాజకీయంగా.. ఎంత వరకూ వాడుకోగలిగితే.. అంతగా వాడుకోవాలని బీజేపీ డిసైడయినట్లుగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.