బ‌రేలీ బ‌రిలో సోనియాకు ప్ర‌త్యామ్నాయం ఎవ‌రు..?

రాహుల్ గాంధీకి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డానికి ఒక రోజు ముందే కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే, ఆమె కేవ‌లం అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి మాత్ర‌మే త‌ప్పుకుంటున్నార‌నీ, రాజ‌కీయాల‌కు పూర్తిగా దూరం కావ‌డం లేద‌ని కాంగ్రెస్ నేత‌లు వివ‌ర‌ణ ఇచ్చారు! ఇక‌పై పార్టీకి సంబంధించిన అన్నిర‌కాల బాధ్య‌త‌లూ రాహుల్ గాంధీకి అప్ప‌గిస్తున్నారు. దాదాపు రెండు ద‌శాబ్దాలపాటు రాహుల్ కూడా క్రియాశీల రాజ‌కీయాల్లో ఉన్నారు కాబ‌ట్టి, పార్టీ బాధ్య‌త‌ల్ని ఆయ‌న స్వ‌తంత్రంగా నిర్వ‌ర్తిస్తార‌నీ, సోనియా స‌ల‌హాలు సూచ‌న‌లు ఉన్నా అవి నామ‌మాత్రంగా ఉంటాయ‌ని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే, సోనియా రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై కొంత అస్ప‌ష్ట‌త అయితే ఉంది. వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కూడా ఆమె పోటీకి దూరంగా ఉంటార‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే రాయ్ బ‌రేలీ పార్ల‌మెంటు స్థానం ప‌రిస్థితి ఏంట‌నే చ‌ర్చ కాంగ్రెస్ లో మొద‌లైన‌ట్టు స‌మాచారం.

దాదాపు ద‌శాబ్దానికి పైగా రాయ్ బ‌రేలీ నియోజ‌క వ‌ర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌గా నిలుస్తూ ఉంది. 2004లో సోనియా గాంధీ తొలిసారిగా ఇక్క‌డి నుంచి పోటీ చేశారు. అప్ప‌ట్నుంచీ ఇప్ప‌టివ‌ర‌కూ వ‌రుస‌గా ఆమె బ‌రేలీ నుంచి విజ‌యం సాధిస్తూ వ‌చ్చారు. కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని స్థానాల్లో ఒక‌టిగా రాయ్ బ‌రేలీ మారిపోయింది. ఇంకోప‌క్క అమేథీ కూడా కాంగ్రెస్ కు కంచుకోట అనే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ రెండు నియోజ‌క వ‌ర్గాలూ సోనియా కుటుంబానికే చెందిన‌వారే ప్రాతినిధ్యం వ‌హించేవి అనే ముద్రప‌డిపోయింది. అయితే, ప్ర‌స్తుతం అమేథీ నుంచి రాహుల్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. రాజ‌కీయాల‌కు సోనియా దూరం కాబోతున్నారని చెబుతున్నారు కాబ‌ట్టి, ఆమె స్థానంలో ఇప్పుడు ఎవ‌రిని దించుతార‌నే చ‌ర్చ మొద‌లైంది.

ప్రస్తుతానికి తెర‌మీదికి వ‌చ్చిన పేరు ఎవ‌రిదంటే… ప్రియాంకా గాంధీ! రాహుల్ ని అధ్య‌క్షుడిని చేయ‌డం ద్వారా యువ నాయ‌కత్వానికి ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్టు కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారం చేసుకుంటోంది. కాబ‌ట్టి, వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ప్రియాంకాను దించే అవ‌కాశం ఉంద‌ని కొంతమంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీనికి భిన్న‌మైన మ‌రో అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఈసారి ఒక సీనియ‌ర్ నేత‌ను అక్క‌డి నుంచీ పోటీకి దించుతార‌ని కూడా అంటున్నారు. ప్రస్తుతానికైతే ఆమె ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రియాంకా పొలిటిక‌ల్ ఎంట్రీపై కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే, 2019 ఎన్నిక‌ల్లో దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ కేంద్రంగానే బ‌రిలోకి దిగాల‌నే వ్యూహంలో ఉంది. ఇంకోప‌క్క‌, వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై కూడా కొన్ని విమ‌ర్శ‌లు ఉన్నాయి క‌దా! కాబ‌ట్టి, కొంత ఆల‌స్యంగా ప్రియాంక‌ను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి తెస్తార‌నేవాద‌నా ఉంది. ఏదేమైనా, రాయ్ బ‌రేలీ స్థానం ఎవ‌రికి చేతికి వ‌స్తుంద‌నేది మాత్రం కొంత ఆస‌క్తిక‌రంగానే మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.