ప్రొ.నాగేశ్వర్: టీఆర్ఎస్ ప్రత్యేకహోదా డిమాండ్ బీజేపీ ప్లాన్‌లో భాగమా..?

తెలంగాణ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ కానీ గతంలో ఎప్పుడూ తెలంగాణకు ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేయలేదు. పార్లమెంట్‌లో చేయలేదు. బయట కూడా చేయలేదు. ఇంకో విషయం ఏమిటంటే… ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదాకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఈ రెండు పచ్చి నిజాలు. అందరికీ తెలిసినవే. కానీ.. టీఆర్ఎస్ ఇప్పుడు… వేరే వాయిస్ వినిపిస్తోంది.

బీజేపీకి ఆయుధంగా టీఆర్ఎస్‌ మారిందా..?

‌కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ..మద్దతు ఇవ్వకుండా.. ఓటింగ్‌కు గైర్హాజరై టీఆర్ఎస్.. బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలిపింది. ఆ తర్వాత మాత్రమే ఈ డిమాండ్ వినిపించడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వనందుకు మోడీ ప్రభుత్వ బోనులో నిలబడాల్సి వచ్చిన సమయంలో టీఆర్ఎస్ ఈ వాదన వినిపించింది. ముందు నుంచి టీఆర్ఎస్ వాదన వినిపించి ఉంటే తప్పు లేదు. తెలంగాణ నిజంగానే వెనుకబడిన రాష్ట్రం. ఒక్క హైదరాబాద్ తప్పితే మిగతా జిల్లాలన్నీ వెనుకబడే ఉన్నాయి. వీటి ఆధారంగా ప్రత్యేకహోదా అడిగితే తప్పు లేదు. కానీ ఇంత వరకూ అడగలేదు. ఇప్పుడు మాత్రమే ఎందుకు అడుగుతున్నారు..? . ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఎగ్గొట్టడానికి మోడీ ప్రభుత్వానికి ఓ ఆయుధంగా ఉపయోగడటమే.

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా చేసే ప్లానేనా..?

గత అసెంబ్లీ సమావేశాల సమయంలో.. కేంద్రంపై వచ్చిన అవిశ్వాస తీర్మానాలకు స్పీకర్ చర్చకు చేపట్టే ఉద్దేశం లేనప్పుడు.. అన్నాడీఎంకే సభ్యులతో పాటు.. టీఆర్ఎస్ సభ్యులు కూడా వెల్‌లోకి దూసుకెళ్లారు. ఎందుకెళ్లారంటే.. ప్రత్యేకహోదాపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని.. రాకుండా చేసే ఉద్దేశంతోనే వెళ్లారు. ఏపీ ప్రత్యేకహోదాతో తమకు సంబంధం లేదు. మా డిమాండ్లు మావి అని టీఆర్ఎస్‌ సభ్యులు అప్పుడు చెప్పుకొచ్చారు. అది నిజమేననుకుందాం. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం అంగీకరించింది. చర్చకు తీసుకుంది. కానీ టీఆర్ఎస్‌ సైలెంట్‌గా ఉంది. వెల్‌లోకి వెళ్లలేదు . అలాగని వాళ్ల డిమాండ్లు కూడా పరిష్కారం కాలేదు. అంటే.. అర్థం ఏమిటంటే.. బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు తీసుకోదల్చుకోలేనప్పుడు.. వెల్‌లోకి వెళ్లారు. చర్చించాలనుకున్నప్పుడు.. సైలెంట్‌గా ఉన్నారు. అంటే.. వెల్‌లోకి వెళ్లడం అనేది తెలంగాణ ప్రయోజనాల కోసం కాకుండా.. బీజేపీకి సహకారంగానే అని క్లియర్‌గా అర్థమైపోతుంది. ప్రత్యేకహోదా డిమాండ్‌ను కూడా టీఆర్ఎస్ ఈ కోణంలోనే డిమాండ్ చేస్తోంది.

రహస్య మిత్రులతోనే హోదా డిమాండ్లు చేయిస్తున్న బీజేపీ..!

ఆంధ్రప్రదేశ్‌కే కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వడం లేదు. ఇక తెలంగాణకు ఎందుకిస్తారు..? ఇవ్వరని తెలిసి కూడా ఈ డిమాండ్ ఎందుకు పెడుతున్నారు..?. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తే ఇతర రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తాయని కేంద్రం చెబుతుతోంది. బీజేపీ చెప్పినట్లు ఆడుతున్న అన్నాడీఎంకే తమిళనాడుకు కావాలని అంటోంది. బీజేపీకి సన్నిహితంగా వ్యవహరిస్తున్న బిజూజనతాదళ్ ఒడిషాకు కావాలంటోంది. బీహార్‌లో ప్రత్యేకహోదా కావాలంటున్నారు.. ఎన్డీఏ మిత్రపక్షం నితీష్ కుమార్ కుమార్ అడిగారు. ఇక్కడ టీఆర్ఎస్ అడుగుతోంది. కేరళ, కర్ణాటక రాష్ట్రాలు అడగలేదు కదా..!. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అడగడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకహోదా ఇచ్చే ఉద్దేశం లేకనే.. ఈ రాష్ట్రాలన్నింటితోనూ.. డిమాండ్లు చేయిస్తోంది కేంద్రం. తమ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు డిమాండ్లు చేయిస్తే.. తాము చేయించామంటారు. కానీ పరోక్ష మిత్రులతో చేయిస్తే.. ప్రజలు నమ్ముతారు. అంటే టీఆర్ఎస్ ఇప్పుడు… బీజేపీకి పరోక్ష మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది.

బీజేపీ ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ హోదా డిమాండ్..!

అవిశ్వాసానికి మద్దతిచ్చిన వారిలో.. టీఆర్ఎస్ తన మిత్రపక్షాలుగా భావించే తృణమూల్, జేడీఎస్, సమాజ్ వాదీ సహా అనేక పార్టీలు మద్దతిచ్చాయి. అయినా టీఆర్ఎస్ అవిశ్వాసానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు. కనీసం తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వినిపించడానికైనా అవిశ్వాసానికి మద్దతివ్వాల్సింది. దీని వల్ల తెలిసిందేమిటంటే..టీఆర్ఎస్ చేస్తున్న ప్రత్యేకహోదా డిమాండ్ తెలంగాణ కోసం కాదు. బీజేపీ ప్రయోజనాలు కాపాడటం కోసం.

తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్న టీఆర్ఎస్..!

రాష్ట్ర విభజన ప్రతిపాదన వచ్చినప్పుడు సీమాంధ్రులు వ్యతిరేకించారు. అప్పుడు తెలంగాణ వాదులు ఏం చెప్పారంటే… మాకు రాష్ట్రం ఇవ్వండి.. మీరు ఆంధ్రకు ఏమైనా ఇచ్చుకోండి..మాకు అభ్యంతరం లేదు అని చెప్పుకొచ్చారు. నిధులు ఎన్నైనా ఇచ్చుకోండి.. మేమేం పట్టించుకోం అన్నారు. అప్పుడు రాష్ట్రవిభజనతో ఆగ్రహంగా ఉన్న సీమాంధ్రుల్ని సంతృప్తి పరచడానికి ప్రత్యేకహోదా ప్రకటించారు. దీన్ని కూడా మర్చిపోయి.. తెలంగాణకు ప్రత్యేకహోదా అవకాశం లేకపోయినా అడుగుతున్నారంటే.. ఇది నిజాయితీతో కూడిన రాజకీయం కాదు. గతంలో సపోర్ట్ చేసి.. ఇప్పుడు షరుతులు ఎందుకు పెడుతున్నారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసే ఈ ప్రయత్నాన్ని ఎవరూ అంగీకరించకూడదు.

కేంద్రంపై పోరాడటానికి ఎన్నో అంశాలున్నాయి..!

తెలంగాణకు ఇప్పుడు ప్రత్యేకహోదా కాదు.. కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చుకోవాలి. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ను మళ్లీ మంజూరు చేయించుకోవాలి. హైకోర్టు విభజన జరగాలి,.. ఐఐఏం కావాలి.. ఇలా చెప్పుకుంటూ పోతే.. కేంద్రం నుంచి రావాల్సిన ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. వీటన్నింటిపై కొట్లాడటం మానేసి.. ఏపీ డిమాండ్ చేస్తున్న ప్రత్యేకహోదాపై అడ్డం పడటం ఎందుకు..?. ఆంధ్రప్రదేశ్‌ను చూపించి.. ప్రజలను రెచ్చగొడితే ఏం వస్తుంది.? అటు ఏపీకి.. ఇటు తెలంగాణకు ప్రయోజనం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com