చంద్రబాబు నాయుడు ఆవేదనకి సాక్షి వక్రభాష్యం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొన్నట్నుంచీ చెప్తున్నది ఏంటీ… ఎన్నికల నిర్వహణ సరిగాలేదు, దాదాపు 35 శాతం ఈవీఎంలలో సమస్యలు తలెత్తడమేంటీ, ఇంత దారుణంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ప్రారంభమైన తొలి గంటకే ఈవీఎంలు పనిచేయడం లేదని ఓటింగ్ ఆపేశారనీ, దాంతో ప్రజలు కంగారుపడ్డారనీ, ఏం జరుగుతోందో అర్థమయ్యేందుకు తనకే రెండు గంటలు పట్టిందని ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆ తరువాత, ఆలస్యమైనా ఓటింగ్ కేంద్రాలకు రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇదంతా ఎలా కనిపిస్తోంది… ఓటేసిన ప్రజలను తప్పుబట్టినట్టుగా ఉందా, లేదంటే ఎన్నికలు నిర్వహించినవారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుందా..? సాక్షి కంటికి రెండో రకంగానే కనిపించింది.

సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్ని అడ్డగోలుగా వక్రీకరించి… ‘ప్రజాతీర్పునకు వక్రభాష్యాలా’ అంటూ సాక్షిలో ఒక విశ్లేషణ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం మంది తమ ఓటు హక్కుని వినియోగించుకుంటే… ఈ ఎన్నికల ఒక ఫార్సు అని చంద్రబాబు నాయుడు అంటున్నారని రాశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా అవమానించడమే అవుతుందట. చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రజాస్వామ్యవాదులు (వీళ్లెవరో?) తీవ్రంగా మండిపడుతున్నారట. హైటెక్ బాబుకి ఈవీఎంల పనితీరు తెలీదా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరు చూస్తుంటే పార్టీ పరువు పోయేలా ఉందని టీడీపీ నాయకులు (ఆ నాయకులు ఎవరో చెప్పలేదు) చెప్పుకుంటున్నారని రాశారు. కౌంటింగ్ తరువాత ఓడిపోతే, ఓటమిని హుందాగా అంగీకరించి విశ్లేషించుకోవడం అసలైన రాజకీయ నాయకుడి లక్షణం అంటూ చాలాచాలా రాశారు.

ప్రజాతీర్పు మీద చంద్రబాబు మాట్లాడుతున్నారా..? ఎన్నికలు జరిగిన తీరు మీద కదా ఆయన పోరాటం చేస్తున్నది. ఈవీఎంలు సక్రమంగా పనిచేసి ఉంటే… అర్ధరాత్రి వరకూ ఓటింగ్ కోసం ప్రజలు బారులు తీరి నిలబడే అవస్థలు ఎందుకు ఉండేవి..? ఎన్నికల సంఘం ఏర్పాట్లపై సాక్షిగానీ, వైకాపా నాయకులుగానీ ఎందుకు విమర్శలు చేయడం లేదు..? ప్రజలు ఎందుకు అంతగా ఇబ్బందులు పడాల్సి వచ్చిందనే కోణం నుంచి ఆలోచించరా..? ఎన్నికలు వారు అనుకున్నట్టుగా జరిగాయని ధీమా వారికి ఉందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అభివ్రుద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ ఎన్నికలు బేలెట్ విధానంలోనే జరుగుతున్నాయి. దేశంలో 22 పార్టీలు ఈవీఎం విధానంలో ఎన్నికలపై పోరాటం చేస్తున్నాయి. కనీసం 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇవన్నీ వదిలేసి… ఓటమి హుందాగా అంగీకరించాలనే కామెంట్లు చేయడం ఎందుకు..? ఎన్నికల ఫలితాలు రాకముందు ఇలా వ్యాఖ్యానించడం హుందాతనమా..? అసలైన నాయకుడి మీద నిర్వచనాలు ఇచ్చేముందు… నాయకత్వ లక్షణాలంటే ఎలా ఉండాలో కూడా తెలుసుకుంటే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com