తమిళనాట ఘన విజయాన్ని సాధించిన సినిమా ‘జైలర్’. రజనీకాంత్ వయసుకు తగిన పాత్ర పోషించిన సినిమా ఇది. ఈ సినిమాతో నెల్సన్ పేరు మార్మోగిపోయింది. తన స్క్రీన్ ప్లే టెక్నిక్ కట్టి పడేసింది. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ పాత్రల్ని వాడుకొన్న విధానం ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. ఇప్పుడు ‘జైలర్ 2’ వస్తోంది. ‘జైలర్’లో క్యామియో పాత్రలు ఎలా సర్ప్రైజ్ చేశాయో, ఇప్పుడు ‘జైలర్ 2’లోనూ అలాంటి గెస్ట్ రోల్స్ మెస్మరైజ్ చేయబోతున్నాయి. ఓ పాత్ర లో నందమూరి బాలకృష్ణ కనిపిస్తారని విస్త్రృతమైన ప్రచారం సాగింది. నెల్సన్ కూడా ఒకట్రెండు సందర్భాల్లో నందమూరి బాలయ్యపై తనకున్న అభిమానాన్ని మీడియా ముఖంగా తెలియజేశారు. దాంతో రజనీకాంత్ సినిమాలో బాలయ్య ఎంట్రీ ఖాయం అనుకొన్నారు. అయితే.. ఎందుకో `జైలర్ 2`లో బాలయ్య లేరు. పారితోషికం నచ్చకో, పాత్ర సరిగా లేదని భావించో.. బాలయ్య ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశారు.
అయితే ఇప్పుడు ఈ పాత్రలో షారుఖ్ ఖాన్ కనిపిస్తారన్న ఓ వార్త ఊపందుకొంది. తమిళ మీడియా కూడా ‘జైలర్ 2’లో షారుఖ్ ఉన్నారన్న వార్తలు ముమ్మరంగా ప్రసారం చేస్తోంది. షారుఖ్ కూడా రజనీకి వీరాభిమానినే. ‘చెన్నై ఎక్స్ప్రెస్’లో రజనీ రిఫరెన్సులు చాలా కనిపిస్తాయి. అందుకే ఈ సినిమాలో నటించడానికి ఆయన ముందుకు వచ్చారని తెలుస్తోంది. అయితే షారుఖ్ పీఆర్ టీమ్, సన్నిహితులు మాత్రం ఈ వార్తకి ఇంకా ధృవీకరించలేదు. షారుఖ్ ఎంట్రీ ఇస్తే గనుక ‘జైలర్ 2’ క్రేజ్ మరింత పెరుగుతుంది. షారుఖ్ తో పాటుగా ఇంకొంతమంది స్టార్లు ఈ సినిమాలో మెరుపు పాత్రల్లో కనిపించే అవకాశం ఉంది. వాళ్లెవరన్నది చిత్రబృందమే చెప్పాలి.
