స్టాండప్ కామెడీ పేరుతో హద్దులు దాటి ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను కించ పరుస్తున్న కమెడియన్స్ అనుదీప్ కటికాల పరారీలో ఉన్నారు. స్టాండప్ కామెడీ అంటే నవ్వులు పూయించడం.. కానీ అనుదీప్ కటికాల దీన్ని రాజకీయ నేతల వ్యక్తిగత జీవితాలను కించపరిచే వేదికగా మార్చుకున్నారు. సోమాజిగూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లోని సెంటర్లలో కామెడీ పేరుతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ వంటి నేతలపై అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
విమర్శ ఉండొచ్చు కానీ, అది అసభ్యతగా మారినప్పుడు దాన్ని వినోదం అనలేం. ఈ వ్యవహారం ముదరడంతో ఆయన ఫోన్ స్విచాఫ్ చేసుకుని పరారీలో ఉండటం, నిర్వాహకులు షోలను నిలిపివేయడం చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఒకవైపు నందమూరి అభిమానులు, మరోవైపు మెగా అభిమానులు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. సిద్ధాంతాలు వేరైనా, తమ అభిమాన నేతల వ్యక్తిగత జీవితాలపై నీచమైన కామెంట్లు వస్తే ఏ అభిమాని సహించలేడు.
ఈ గొడవ వల్ల అసలు నష్టం ఎవరికంటే.. నిజమైన టాలెంట్ ఉన్న యువ కమెడియన్లకే. ఏ వ్యవస్థలోనైనా ఇలాంటి చీడపురుగులు ఉంటారు, వారు చేసే అతి వల్ల మొత్తం రంగానికే చెడ్డ పేరు వస్తుంది. స్వచ్ఛమైన వినోదాన్ని అందించే వారు కూడా ఇప్పుడు అనుమానపు చూపులను ఎదుర్కోవాల్సిన పరిస్థితిని ఈయన కల్పించారు. నిజానికి స్టాండప్ కామెడీ అనేది ఒక అద్భుతమైన కళ. కేవలం మాటలతో గంటల కొద్దీ నవ్వించడం అందరికీ సాధ్యం కాదు. కానీ, అడ్డదారిలో ఫేమస్ అవ్వాలనుకునే కొందరు, ఇలాంటి వివాదస్పద అంశాలను నమ్ముకుంటున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్న నిర్వాహకులు కూడా బాధ్యత వహించాలి. కంటెంట్ ఏంటో చూడకుండా వేదికలు ఇస్తే, చివరకు ఆ సంస్థలకే ముప్పు వాటిల్లుతుంది. టాలెంట్‌ను బట్టి పైకి రావాలనుకునే వారికి మేలు జరగాలంటే, ఇలాంటి అసభ్యకర ప్రసంగాలు చేసేవారిని శాశ్వతంగా వేదికలకు దూరం చేయాల్సిన అవసరం ఉంది.
రాజకీయ నాయకులను విమర్శించడానికి ఒక పద్ధతి ఉంటుంది. కానీ, వారిని కేవలం బూతులు తిట్టడమో లేదా వారి వ్యక్తిగత విషయాలను వెక్కిరించడమో కామెడీ అనిపించుకోదు. చట్టం తన పని తాను చేసుకుపోతున్న తరుణంలో, అనుదీప్ పరారీలో ఉండటం ఆయన చేసిన తప్పును పరోక్షంగా అంగీకరించడమే అవుతుంది. వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఇలాంటి వారిని ఏ రంగంలోనైనా ఉపేక్షించకూడదు. అప్పుడే నిజమైన కళాకారులకు గౌరవం, గుర్తింపు దక్కుతాయి.
