ఏపీ రాజధానిగా అమరావతికి భారత్ రాష్ట్ర సమితి రాజ్యసభలో సంపూర్ణ మద్దతు ప్రకటించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన రాజకీయ చర్చకు దారితీసింది. ప్రాంతీయ విభేదాలను పక్కన పెట్టి, ఒక పొరుగు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం బీఆర్ఎస్ గళమెత్తడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందని భావిస్తున్నారు.
రాజ్యసభ వేదికగా గులాబీ గళం
లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ, రాజ్యసభలో అమరావతికి మద్దతుగా బీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. బీఆర్ఎస్ తన పార్టీని జాతీయ స్థాయికి విస్తరించాలని భావించినప్పటి నుండే ఏపీ రాజధాని విషయంలో ఒక స్పష్టమైన వైఖరితో ఉంది. గతంలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించినప్పుడే, అమరావతిని ఏకైక రాజధానిగా తాము గుర్తిస్తున్నట్లు కేసీఆర్ సంకేతాలిచ్చారు. ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా అదే విషయాన్ని పునరుద్ఘాటించడం ద్వారా, తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని ఆ పార్టీ చాటిచెప్పింది.
తెలంగాణ రాజకీయ సమీకరణాలు – ఆంధ్రా ఓటర్ల ప్రభావం
బీఆర్ఎస్ అమరావతికి మద్దతు తెలపడం వెనుక ప్రధానంగా తెలంగాణలోని రాజకీయ అవసరాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో స్థిరపడిన ఆంధ్ర మూలాలున్న ఓటర్ల మద్దతు బీఆర్ఎస్కు అత్యంత కీలకం. అమరావతి అనేది ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా మారిన తరుణంలో, దానిని వ్యతిరేకిస్తే తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఓటర్లు తమకు దూరం అవుతారని బీఆర్ఎస్ నాయకత్వం ముందే ఊహించింది. అందుకే, ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించడం ద్వారా తెలంగాణలో తమ రాజకీయ పట్టును కాపాడుకోవాలనేది గులాబీ దళం వ్యూహం.
వైసీపీ ఈర్ష్య రాజకీయాలు
బీఆర్ఎస్ వంటి పార్టీ కూడా అమరావతికి మద్దతు ఇస్తున్నప్పుడు, ఏపీలో ఉన్న వైసీపీ దానిని వ్యతిరేకించడం ఆ పార్టీ రాజకీయ అపరిపక్వతను సూచిస్తోంది. పొరుగు రాష్ట్ర పార్టీకి ఉన్న దూరదృష్టి వైసీపీ నాయకత్వానికి లేకపోవడం విస్మయకరమని.. వారి వ్యక్తిగత ద్వేషం , ఈర్ష్య కారణంగా, రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే వైసీపీ ప్రాధాన్యత ఇచ్చిందని భావిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మద్దతుతో వైసీపీ మరింత ఒంటరి కావడమే కాకుండా, రాజధాని విషయంలో తాము చేస్తున్న పోరాటం ఎంత డొల్ల అనే నిజాన్ని ప్రజలు గుర్తించేలా చేసింది.
