తెలుగు360 ఎడిటర్స్ కామెంట్ : కేంద్రం ఆర్డినెన్స్‌తో ఏపీ సర్కార్ పదవి కాలం తగ్గిస్తే..!?

“నడమంత్రపు అధికారం నరము మీద పుండులాంటిది” … చేతిలో అధికారం ఉందని రాజ్యాంగానికే కొత్త భాష్యం చెప్పాలని ప్రయత్నిస్తే.. అది ఒళ్లంతా పాకిపోతుంది. తర్వాత కాపాడటానికి ఏ వైద్యుడికీ సాధ్యం కాదు. ఈ మాటలు నేరుగా ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చెబుతున్నవే. రాజ్యాంగ పదవి అయిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌ను.. ఎవరూ ఊహించని విధంగా.. ఓ ఆర్డినెన్స్.. ఆ వెంటనే మరో జీవో ఇవ్వడం ద్వారా తొలగించేయవచ్చని… రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సారి ఏపీ ముఖ్యమంత్రి నిరూపించారు. రాజ్యాంగంలోని అంశాలకు వక్రభాష్యం చెప్పుకోవడం ఇంత తేలికా..? అనిపించేలా చేశారు.

ఎస్‌ఈసీని తొలగించడం దుస్సాహసం.. !

రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్, న్యాయమూర్తులు, ఎలక్షన్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ .. ఇవన్నీ రాజ్యాంగబద్ధమైన పదవులు. రాజ్యాంగపరమైన అధికారాలు ఉంటాయి. ప్రజల ద్వారా ఎన్నికయ్యామని.. మిగిలిన వారి మీద.. ప్రభుత్వాలు సవారీ చేయలేవు. తీసి వేయలేవు. అదంత సులభం కాదు. ప్రజాస్వామ్య పునాదుల్ని బలంగా ఉంచడానికి రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందు చూపుతో… కొన్ని స్వతంత్ర వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అందులో ఎన్నికల సంఘం కీలకం. ఎన్నికల సంఘం… ఎవరి మాటా వినాల్సిన పని లేదు. ఎన్నికలను స్వేచ్చగా.. స్వతంత్రంగా … నిర్వహించగలిగే హక్కు ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండగా వారిని తీసేయడం ఏ ప్రభుత్వాలకూ సాధ్యం కాదు. రాజ్యాంగంలో అన్ని రక్షణలు ఉన్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం.. ఆ రాజ్యాంగ రక్షణలన్నింటినీ తోసి రాజనేసింది. ఆయన పదవి కాలం తగ్గేలా… ఓ ఆర్డినెన్స్ తెచ్చి.. వెంటనే ఆయన పదవి విరమణ చేసేశారని తేల్చేసింది. ఈ ఆర్డినెన్స్, జీవోలు చూస్తే… అధికారం ఉందని.. ఎంతకైనా తెగబడటానికి సిద్ధపడిన ఓ “అరాచక రాజకీయం” మన కళ్ల ముందు మెదలడం ఖాయం.

కొత్త చట్టాలు పాత నియామకాలకు అన్వయించడం ఎక్కడైనా ఉందా..?

చట్టాలు చేయడం ప్రభుత్వాల పని.. ప్రజావసరాలకు తగ్గట్లుగా చట్టాలు చేస్తూంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి చట్టాలు చేస్తూనే ఉన్నారు. ఎన్ని అమల్లోకి పెడుతున్నారో ఎవరికీ తెలియదు. రాజ్యాంగం గురించి కనీస అవగాహన లేకుండా చట్టాలు తీసుకొస్తున్నారు. దిశ చట్టం కేంద్రం దగ్గర ఆగిపోయింది. జ్యూడిషియల్ రివ్యూ కమిషన్ అని న్యాయమూర్తితో కాంట్రాక్టులను రివ్యూ చేయిస్తామని ఓ చట్టం చేశారు. న్యాయమూర్తిని కూడా నియమించారు. అదేమయిందో ఎవరికీ తెలియదు. ప్రాధమిక హక్కు అయిన విద్యను… ఇంగ్లిష్ మీడియంకు పరిమితం చేస్తూ చట్టం తెచ్చారు. అది రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తేల్చింది. ఇలా చెప్పుకుటూ పోతే.. అమల్లోకి రాని చాలా చట్టాలున్నాయి. కొన్ని అమల్లోకి వచ్చాయి. ఇలా అమల్లోకి వచ్చిన చట్టాలు.. ఎప్పుడైతే ఆమోదం పొందుతాయో… అప్పటి నుండి మాత్రమే అమలులోకి వస్తాయి. ఉదాహరణ దిశ చట్టం అమల్లోకి వస్తే.. ఆ తర్వాత దిశ చట్టం ప్రకారం.. కేసులు నమోదు చేసి..శిక్షిస్తారు కానీ.. అంతకు ముందు నమోదైన కేసులకు దిశ చట్టం వర్తింపచేయరు. చట్టం దానికి ఒప్పుకోదు. కానీ.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి… స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ..నిర్ణయం తీసుకున్నారు. వయుసతో నిమిత్తం లేకుండా.. 80 ఏళ్లు.. 90 ఏళ్లు అయినా.. కొత్త ఎలక్షన్ కమిషనర్ని నియమించుకోవచ్చని ఆర్డినెన్స్‌లో పెట్టారు. ఆరు నెలల్లోగా దాన్ని చట్టం చేయాలని. రమేష్ కుమార్ ఎన్నికలు నిర్వహిస్తే తమ కొంపలు మునిగిపోతాయని ఎందుకు అనుకున్నారో కానీ.. ఆయనకు ఆర్డినెన్స్‌ను వర్తింప చేస్తూ… జీవోలు ఇచ్చేశారు. కొత్తగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ .. కొత్త నియామకాలకు వర్తిస్తుంది కానీ.. పాత నియామకాలకు ఎలా వర్తిస్తుందో… ఏ రాజ్యాంగపండితుడూ చెప్పలేకపోయారు. అందుకే.. జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై దేశం మొత్తం విస్మయం వ్యక్తం చేస్తోంది.

రాజ్యాంగాన్ని బలహీనం చేస్తున్న రాజకీయం..!

స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అంటే.. రాజ్యాంగ బద్ధ పదవి. రాజకీయ ఒత్తిళ్లకు అవకాశం లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్‌గా ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతో.. రాజ్యాంగంలో ఆయనకు హైకోర్టు జడ్జి సమానంతో పదవి కల్పించారు. ఏ ప్రభుత్వమూ ఆయనపై కక్ష తీర్చుకోవడం సాధ్యం కాదు. అంత కఠినమైన నిబంధనలు పెట్టారు. ఎప్పుడు పడితే అప్పుడు తీసేయడానికి కుదరదని.. రాజ్యాంగం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 243 కే అధ్యాయం మొత్తం ఎస్‌ఈసీ పదవి, అధికారాలు, నియామకాల మీదే ఉంది. దాని ప్రకారం.. ఐదేళ్ల పాటు.. ఎస్‌ఈసీ పదవీ కాలం ఉంటుంది. మార్చడానికి ఎవరికీ అధికారం లేదు. రాజ్యాంగం మారిస్తేనే.. ఆ చాన్స్ ఉంటుంది. కానీ ఏపీ ప్రభుత్వం ఎస్‌ఈసీని తీసేసేందుకు షార్ట్ కట్‌ను ఎంచుకుని ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గించి.. ఆయనను తొలగించేసింది. రాజ్యాంగంలోని అంశాలకు.. సొంత భాష్యం చెప్పుకోవడం ఇంత తేలికా.. అన్న ఓ సందేహాన్ని ప్రజలందరిలోనూ కల్పించింది ఏపీ సర్కార్. ఇది చాలా విపరిణామాలకు దారి తీయనుంది. రాజ్యాంగాన్నే బలహీనం చేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలాన్ని తగ్గిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొస్తే..!?

రాజ్యాంగం ప్రకారం…ఎంత పదవి కాలానికి నియమితులవుతారో.. ఎన్నికవుతారో.. అంత కాలం అధికారంలో ఉండే హక్కు.. రాజ్యాంగబద్ధ సంస్థల అధిపతులకైనా… రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి.. అలాంటి చాన్స్ లేదని.. తన కొత్త ఆర్డినెన్స్ ద్వారా నిరూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాల పదవీ కాలం.. మూడేళ్లకు.. లేదా.. రెండున్నరేళ్లకు లేదా ఇంకా తక్కువకు నిర్ణయిస్తూ.. కేంద్రం ఆర్డినెన్స్ తీసుకు రావడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ ఓ పెద్ద దిక్సూచీగా మారుతుంది. ఇప్పటి వరకూ ఒక్క సారి ఎన్నికలయితే.. మెజార్టీ ఉంటే.. కేంద్రంతో సఖ్యతగా లేకపోయినా… ప్రభుత్వం మనుగడ సాగుతుదంనే భరోసా ఉండేంది. రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటితే.. రాష్ట్రపతి పాలన అనే అస్త్రం ఉన్నప్పటికీ.. అది ప్రభుత్వాల పదవి కాలాన్ని తగ్గించదు. కానీ ఇప్పుడు… ఆర్డినెన్స్ ద్వారా.. ప్రభుత్వాల పదవీ కాలాన్ని తగ్గించవచ్చని జగన్మోహన్ రెడ్డి ఓ ఐడియా ఇచ్చారు. దాని ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ పదవి కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తే.. ఇప్పుడు ప్రశ్నించే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా..?

జమిలీ ఎన్నికలకు పనికొస్తుందని కేంద్రం సహకరిస్తోందా..?

రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్న ఆర్డినెన్స్‌పై.. గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్… కనీస పరిశీలన లేకుండా.. కొత్త ఎస్‌ఈసీ నియామకానికి తన టేబుల్‌ మీదకు ఫైల్ వచ్చిన ఐదు అంటే.. ఐదు నిమిషాల్లో సంతకం పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. అంటే.. ముందుగానే.. మొత్తంగా ఎపిసోడ్ మొత్తం రెడీ అయిపోతుందని.. ఆమోదించాలన్న నిర్ణయానికి ఆయన వచ్చి ఉంటారు. ఇది కేంద్రం సహకారం లేకుండా సాధ్యం కాదు. రాజ్యాంగాన్ని తూట్లు పొడుతున్న ఈ వ్యవహారానికి కేంద్రం ఎందుకు సహకరించిందనేది.. చాలా మందికి పజిల్ లాంటిదే. కానీ.. కేంద్రం ఆలోచనలు కేంద్రానికి ఉండొచ్చు. ఆ ఆర్డినెన్స్‌ను తాను కూడా వాడుకోవచ్చనుకోవచ్చు. ఓ రాజ్యంగ బద్ధమైన పదవిని జగన్ ఆర్డినెన్స్ ద్వారా మూడేళ్లకు తగ్గించారు. అదే రాజ్యాంగ బద్ధమైన పదవి అయిన ముఖ్యమంత్రి పదవిని… కూడా.. కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా మూడేళ్లకు కుదించొచ్చు. నిజానికి ఈ అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే.. కేంద్రం మదిలో ఎప్పటినుండో జమిలీ ఎన్నికల ఆలోచన ఉంది. అంటే.. కేంద్ర ప్రభుత్వానికి.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం. ఇలా చేయాలంటే.. చాలా రాష్ట్రాల ప్రభుత్వాల అధికారాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అది సాధ్యం కాదు అని రాజ్యాంగ నిపుణులు ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్నారు. రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి దానికి ఆర్డినెన్స్ ద్వారా పరిష్కారం చూపారు. ఐదేళ్ల కాలానికి ఎన్నికయినప్పటికీ.. జగన్ చూపించిన మార్గంలోనే కేంద్రం.. ఆయన పదవికి కోత పెట్టి.. జమిలీ ఎన్నికలకు వెళ్లిపోయే అవకాశం ఇప్పుడు దక్కింది.

న్యాయస్థానాలు సమర్థిస్తే ప్రజాస్వామ్యంలోనే మౌలిక మార్పులు ఖాయం..!

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ను తొలగించి.. కొత్త ఎస్‌ఈసీ నియామకాన్ని న్యాయస్థానాలు సమర్థిస్తే.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో… రాజ్యాంగ పరంగా.. కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. స్టేట్ ఎస్‌ఈసీ అయినా.. కేంద్ర ఎలక్షన్ కమిషన్ అయినా ఇక ప్రభుత్వాల చెప్పు చేతుల్లో పని చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. అప్పటికిప్పుడు… ఎలక్షన్ కమిషనర్లకు లేని అర్హతను జోడించి.. ఆర్డినెన్స్ తెచ్చి.. ఆయనను పీకేసి.. తమకు అనుకూలమైన వ్యక్తుల్ని నియమించుకుని ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఉంది. అప్పుడు అధికారంలో ఉన్న వారే అనధికారిక ఎన్నికల నిర్వాహకులు అయిపోతారు. దేశ ప్రజాస్వామం కొత్త దారిలో వెళ్లడం ప్రారంభమవుతుంది. ఎన్నికల నిర్వహణ ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరగాలన్న రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షకు అలా గండికొట్టేసినట్లవుతుంది. భారత రాజ్యాంగం… ప్రపంచంలోనే సమున్నతం. 70 ఏళ్లలో ఎప్పుడూ సవాళ్లు ఎదురు కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం కాల పరీక్షను ఎదుర్కొంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

జగన్‌కు పీకే నాడు గెలిపించేవాడు – నేడు నథింగ్ !

ప్రశాంత్ కిషోర్ నథింగ్ అని ఐ ప్యాక్ ఆఫీసులో జగన్ పలికిన మాటలకు అక్కడ ఉన్న భారీ ప్యాకేజీలు అందుకుని తూ..తూ మంత్రంగా పని చేసిన రిషిరాజ్ టీం చప్పట్లు కొట్టి ఉండవచ్చు...
video

‘ల‌వ్ మీ’ ట్రైల‌ర్‌: భ‌యంతో కూడిన ఓ ప్రేమ‌క‌థ‌!

https://youtu.be/BacOcD8e_3k?si=D6mw3GiNjusn8mnE దెయ్యంతో ప్రేమ‌లో ప‌డ‌డం ఓ ర‌కంగా కొత్త పాయింటే. 'ల‌వ్ మీ' క‌థంతా ఈ పాయింట్ చుట్టూనే తిర‌గ‌బోతోంది. ఆశిష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ఇది. దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కించారు. ఈనెల...

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close