స్టార్ల‌తో సినిమా చేయ‌డం ఎలాగో నాకింకా తెలీలేదు: త‌రుణ్ భాస్క‌ర్‌తో ఇంట‌ర్వ్యూ

పెళ్లి చూపులు సినిమాతో ఒక్క‌సారిగా అంద‌రి దృష్టినీ త‌న వైపుకు తిప్పుకున్నాడు త‌రుణ్ భాస్క‌ర్‌. ఓ కొత్త త‌ర‌హా సినిమాని తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన త‌రుణ్‌… టాలీవుడ్‌లో న్యూజ‌న‌రేష‌న్ సినిమాల‌కు బీజం వేశాడు. తాను అనుకుంటే.. రెండో సినిమాకే స్టార్ హీరోని ప‌ట్టేయొచ్చు. కానీ… త‌న‌కు న‌చ్చిన దారిలోనే వెళ్తూ, మ‌ళ్లీ కొత్త వాళ్ల‌తో సినిమా చేశాడు. అదే ‘ఈ న‌గ‌రానికి ఏమైంది?’. ప్ర‌చార చిత్రాలు చూస్తుంటే… నెక్ట్జ్ జ‌న‌రేష‌న్ సినిమాని మ‌రోసారి చూసే ఛాన్సొచ్చింది అనిపిస్తోంది. శుక్ర‌వారం ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా త‌రుణ్ భాస్క‌ర్‌తో చిట్ చాట్‌.

* పెళ్లి చూపులు విడుద‌లైన రోజుతో పోలిస్తే… ఇప్పుడు టెన్ష‌న్ త‌గ్గిందా, పెరిగిందా?
– కాస్త టెన్ష‌న్ త‌గ్గింద‌నే అనుకోవాలి. ఎందుకంటే ఆ సినిమాతో పోలిస్తే ఇప్పుడు కాస్త న‌మ్మ‌కం పెరిగింది. టెక్నిక‌ల్‌గా పెళ్లిచూపులు కంటే బాగా తీసిన సినిమా ఇది. బ‌హుశా అందుకే కాస్త ధీమాగా ఉన్నానేమో. అన్నింటికంటే ముఖ్యంగా హిట్లు, ఫ్లాపులూ మామూలే, పొగిడినా తిట్టినా స్వీక‌రించాలి అనే విష‌యం బాగా అర్థం చేసుకున్నా. ఇవ‌న్నీ ప్ర‌యాణంలో మామూలైన విష‌యాలు.

* పెళ్లి చూపులు హిట్ట‌య్యాక‌… ఇంత గ్యాప్ తీసుకున్నారెందుకు?
– స‌క్సెస్ అర్థం కావ‌డానికి కాస్త స‌మ‌యం ప‌ట్టింది. ఆఫ‌ర్లు వ‌చ్చాయి. హీరోలు అప్రోచ్ అయ్యారు. ఆ కంగారులో క‌థ రాస్తే… త‌ప్ప‌కుండా త‌ప్ప‌ట‌డుగులు వేస్తాం. అందుకే స‌మ‌యం తీసుకున్నాను.

* సాధార‌ణంగా తొలి అడుగులోనే విజ‌యం సాధిస్తే.. త‌ర‌వాతి సినిమా స్టార్ హీరోతోనే అనుకుంటురు. మీరేమో మ‌ళ్లీ కొత్త‌వాళ్ల‌తో సినిమా తీశారు.
కార‌ణం ఏమిటి?

– నా తొలి సినిమా హిట్ట‌య్యింది కేవ‌లం క‌థా బ‌లంతోనే అని నా న‌మ్మ‌కం. క‌థ బాగుంటే ఎప్పుడైనా, ఎవ‌రితో తీసినా జ‌నం చూస్తారు.
స్టార్ల‌తో సినిమాలు తీసే తెలివితేట‌లు, నా నైపుణ్యం నాకింకా రాలేద‌నే అనుకుంటున్నా. కొత్త వాళ్ల‌తో సినిమా తీయ‌డంలో అనుభ‌వం నాకుంది. అందుకే నా దారిలోనే వెళ్లా. నాకు తెలియ‌ని పని చేస్తే రిస్క్ అనుకోవొచ్చు. నిజంగా స్టార్ల‌తో సినిమా చేస్తే రిస్క్‌లో ప‌డుదునేమో.

* ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ‌రా? ఇదే దారిలో వెళ్తారా?
– నాకు తెలిసిన దారి ఇదే. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చూడ్డానికి బాగుంటాయి. అవి చూసి ఆస్వాదిస్తా. అయితే నాకు తెలిసిన క‌థ‌లు మాత్ర‌మే నేను తీస్తా. నాకు ఎదురైన అనుభ‌వాలు, మ‌నుషులు.. వీటి చుట్టూనే నా క‌థ‌లు తిరుగుతాయి. వాటిని దాటి సినిమా తీయ‌లేను..

* పెళ్లి చూపులు చూశాక చాలామంది స్టార్లు మిమ్మ‌ల్ని పిలిచారు క‌దా, వాళ్లేం అవ‌కాశాలు ఇవ్వ‌లేదా?
– మంచి క‌థ చెప్పు సినిమా చేద్దాం అన్నారు. `నాక్కొంచెం స‌మ‌యం కావాలి.. మీకు త‌గిన క‌థ దొరికితే త‌ప్ప‌కుండా వ‌స్తా` అని చెప్పా. మ‌హేష్, బ‌న్నీ, నాగ్‌… వీళ్లంద‌రికీ పెళ్లి చూపులు బాగా న‌చ్చింది. మాకోసం ఏమైనా క‌థ ఉంటే చెప్పు అన్నారు. అంద‌రూ బాగా ప్రోత్స‌హించారు. మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు

* ఈ క‌థ విని సురేష్ బాబు ఏమ‌న్నారు, ఆయ‌న జోక్యం ఎంత వ‌ర‌కూ ఉంది?
– క‌థ విన్న వెంట‌నే `షూటింగ్ మొద‌లెట్టేయండి` అన్నారు. నిజంగా ఆ మాట షాక్ ఇచ్చింది. ఎందుకంటే సురేష్ బాబు సాధార‌ణంగా స‌మయం తీసుకుంటారు. రెండు మూడు నెల‌లు తిప్పించుకుంటారు. కానీ.. `ప్రొసీడ్‌` అన‌డం మాలో మాకు న‌మ్మకాన్ని పెంచింది. ఆయ‌న మూడంటే మూడుసార్లు సెట్‌కి వ‌చ్చారు. ఒక్క మార్పు కూడా చెప్ప‌లేదు. పెళ్లి చూపులు సినిమాని ఎంత స్వేచ్ఛ‌గా చేశానో.. ఈ సినిమాని అలా చేశా.

* ఇంత‌కీ ఈ క‌థ ఎలాంటిది?
– న‌లుగురు ఫిల్మ్ మేక‌ర్స్ క‌థ ఇది. నా స్నేహితులు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో, ఎలా మాట్లాడుకుంటారో అలానే ఉంటుంది. అలాగ‌ని ఇది వాళ్ల క‌థ కాదు. పూర్తిగా ఊహాజ‌నిత‌మైన‌ది.

* హ్యాంగోవ‌ర్ ఛాయ‌లు ఉంటాయా?
– హ్యాంగోవ‌ర్‌, జింద‌గీ నా మిలేగీ దుబారా లాంటి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అవన్నీ ఓ స్ట్ర‌క్చ‌ర్‌లో ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ రాసుకున్న క‌థ ఇది. ఇదేం రోడ్ జ‌ర్నీ కాదు. ఓ డైర‌క్ష‌న్ లేకుండా సాగే న‌లుగురి క‌థ ఇది. వాళ్ల జ‌ర్నీ కూడా డెర‌క్ష‌న్ లేకుండానే ఉంటుంది. అదెలా అనేది తెర‌పై చూడాలి. పెళ్లి చూపులులో తెలంగాణ స్లాంగ్ ఎక్కువ‌గా వాడాను. ఈసారి భీమ‌వ‌రం యాస కూడా వినిపిస్తుంది.

* విజ‌య్ దేవ‌ర‌కొండ అతిథి పాత్ర‌లో చేశార‌ట‌..
– అవును. అయితే అది ఉందో, లేదో నాకే తెలీదు. కేవ‌లం చిన్న పాత్ర‌. దాన్ని ప‌ట్టుకుని క్యాష్ చేసుకొనేంత లేదు..

* అంద‌రిలా డ‌బ్బులు సంపాదించ‌డానికే ప‌రిశ్ర‌మ‌కొచ్చారా?
– అవును. డ‌బ్బులు కావాలి. లేదంటే షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉండేవాడ్ని క‌దా? అయితే ఇప్ప‌టికిప్పుడు కోట్లు సంపాదించాల‌ని లేదు. నేను మ‌ధ్య త‌ర‌గ‌తి నుంచి వ‌చ్చాను. ఆటోల్లో, బ‌స్సుల్లో తిర‌గ‌డం కూడా నాకు తెలుసు. ఇప్ప‌టికిప్పుడు విమానం ఎక్కేయాల‌ని లేదు.

* రానాతో ఓ సినిమా ఉంటుంద‌ట‌..?
– సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లోనే నా మూడో సినిమా కూడా ఉంటుంది. అయితే అది రానాతోనా, వెంక‌టేష్ గారితోనా అనేది తెలీదు. వాళ్ల‌కు త‌గిన క‌థ దొరికితే త‌ప్ప‌కుండా ముందు వాళ్ల‌నే అప్రోచ్ అవుతా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close