ఆయ‌న రాక‌ను అడ్డుకోవ‌డ‌మే డీకే అరుణ ల‌క్ష్య‌మా..?

మాజీ మంత్రి డీకే అరుణ మ‌రోసారి పావులు క‌దుపుతున్న‌ట్టు స‌మాచారం! నిజానికి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరిన త‌రుణంలో ఆమె నుంచి కొంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఆ త‌రువాత‌, రేవంత్ రెడ్డి స్వ‌యంగా ఆమె ఇంటికి వెళ్లి క‌లుసుకోవ‌డం, సీనియ‌ర్ల అడుగుజాడ‌ల్లోనే తాను పార్టీలో న‌డుచుకుంటాన‌ని చెప్ప‌డంతో ఆమె కాస్త త‌గ్గారు. అయితే, ఇప్పుడు మ‌రో ప్ర‌ముఖ నేత కాంగ్రెస్ లోకి వ‌చ్చి చేర‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ఆమె తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆ నాయ‌కుడు ఎవ‌రంటే… మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన భాజ‌పా నేత నాగం జ‌నార్థ‌న్ రెడ్డి.

భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఆయ‌న తీవ్ర అసంతృప్తిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర భాజ‌పా నేత‌ల‌ది ఒక తీరు, ఆయ‌న‌ది ఒక తీరు అన్న‌ట్టుగా ఉంది. రాష్ట్ర భాజపా ఆయన్ని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయలేదు, ఈయన కూడా వారితో కలిసి సాగే సర్దుబాటూ చేసుకోలేదు. అందుకే, మెడ తిర‌గ‌ని మేన‌రికం ఎందుక‌న్నట్టుగా, రాజ‌కీయ భ‌విష్య‌త్తు దృష్ట్యా ఆయ‌న కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు చేయాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎలాగూ రేవంత్ కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారు. దీంతో మూడు రంగుల కండువా కప్పుకునేందుకు మార్గం మ‌రింత సుగ‌మ‌మైంద‌ని చెప్పుకోవ‌చ్చు. రాష్ట్ర పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా నాగం చేరిక‌కు ప‌చ్చ‌జెండా ఊసేసిన‌ట్టు తెలుస్తోంది. దీంతో మార్చి నెల‌లో ఆయ‌న అధికారికంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ముహూర్తం ఖ‌రారు చేసుకోబోతున్నార‌ని వినిపిస్తోంది! అయితే, ఇదే త‌రుణంలో ఆయ‌న కాంగ్రెస్ లో చేర‌డాన్ని కొంత‌మంది కాంగ్రెస్ నేత‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్టు స‌మాచారం. అంతేకాదు, ఈ విష‌యం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ వ‌ర‌కూ వెళ్లింద‌ట‌..!

డీకే అరుణ‌తోపాటు కొంత‌మంది కాంగ్రెస్ నేత‌లు ఈ మ‌ధ్య‌నే ఢిల్లీ వెళ్లొచ్చారు. నాగం జనార్థ‌న రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్ద‌నీ, స్థానికంగా పార్టీకి చాలా స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌నే అంశాన్ని రాహుల్ ముందుంచారని స‌మాచారం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ కు నాగం చాలార‌కాల ఇబ్బందులు క‌లిగించార‌నీ, ఆ వివ‌రాలను రాహుల్ కి ఒక నివేదిక ద్వారా అంద‌జేశార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నాగంను కాంగ్రెస్ లోకి చేర్చుకుంటే ఇప్పుడిప్పుడే బ‌లోపేతం అవుతున్న కాంగ్రెస్ శ్రేణుల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని రాహుల్ కి చెప్పార‌ట‌. ముఖ్యంగా నాగ‌ర్ క‌ర్నూల్ లో కాంగ్రెస్ శ్రేణులు ఆయ‌న చేరిక‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే, వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా నాగం చేరిక‌పై రాష్ట్ర పీసీసీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన వైనంపై కూడా డీకే అరుణ ఫిర్యాదు చేసిన‌ట్టు వినిపిస్తోంది. నాగం చేరిక‌పై ఢిల్లీ స్థాయిలో డీకే అరుణ చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి, ఈ ప్ర‌య‌త్నాల ప‌ర్య‌వ‌సానాలు ఎలా ఉంటాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.