తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించే ఉత్తరాంధ్రలో ఈ సారి మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అనువైన ప్రాంతాల కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి తొమ్మిది ప్రాంతాలను పరిశీలించింది. ముఖ్యంగా నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం, పూసపాటిరేగ సమీపంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం సభ నిర్వహణే కాకుండా, లక్షలాదిగా తరలివచ్చే కార్యకర్తలకు రవాణా, భద్రత, పార్కింగ్ వంటి మౌలిక వసతులపై ముందే కసరత్తు చేస్తున్నారు.
కార్యకర్తలే పార్టీ బలం – అదే టీడీపీ మార్క్!
అధికారంలో ఉన్నా, లేకపోయినా మహానాడును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం టీడీపీకి ఒక ఆనవాయితీ. కార్యకర్తలను గౌరవించుకోవడం, పార్టీ ఆశయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ఈ ఉత్సవం ప్రధాన ఉద్దేశ్యం. గతంలో పల్లా శ్రీనివాసరావు చెప్పినట్లుగా, మహానాడు అనేది కేవలం ఒక సమావేశం కాదు, అది తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ ఏడాది మే 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలో.. మొదటి రెండు రోజులు పార్టీ అంతర్గత సమావేశాలు, రాజకీయ తీర్మానాలు ఉండగా, చివరి రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
గత మహానాడు కడపలో నిర్వహణ
2024 ఎన్నికల్లో భారీ విజయం సాధించి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో మహానాడు నిర్వహించారు. ఉత్తరాంధ్రలో నిర్వహిస్తున్న మహానాడు కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తు అనుకూలత నుంచి రవాణా సౌకర్యాల వరకు ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించి వేదికను ఖరారు చేయనున్నారు. విజయనగరం జిల్లా పిపిపి కిమిడి నాగార్జున, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వంటి కీలక నేతలు ఈ ఏర్పాట్లలో నిమగ్నమవ్వడం చూస్తుంటే, ఉత్తరాంధ్రలో పసుపు కోలాహలం ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతోంది.
ఉత్తరాంధ్రకు రెండేళ్లలో ఎన్నో మైలురాళ్లు
రైల్వే జోన్ సాకారం కావడం, భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ కావడంతోపాటు.. ఏఐహబ్, స్టీల్ ప్లాంట్ వంటి పెట్టుబడులు వచ్చాయి. సానుకూల అంశాల మధ్య ఉత్తరాంధ్రలో మహానాడు నిర్వహించడం పార్టీకి మైలేజీనిస్తుందనడంలో సందేహం లేదు. గతంలో ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఎండగడుతూనే, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ మహానాడును ఒక వేదికగా మలచుకోనుంది. ఉత్తరాంధ్ర గడ్డపై పసుపు జెండా రెపరెపలాడించేందుకు టీడీపీ కేడర్ మహానాడు సమరానికి సిద్ధమవుతోంది.


