తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో దాదాపు 70 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయింది. ఈ ఎన్నికలు అనధికార రిఫరెండమే. పట్టణ ప్రజల పల్స్ తెలుస్తుంది. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి ఉండే సానుకూలత ఈసారి కూడా కాంగ్రెస్కు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పట్టణ పరిపాలనపై తీసుకుంటున్న నిర్ణయాలు ఓటర్లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. సుమారు 80 శాతానికి పైగా మున్సిపాలిటీలను గెలుచుకుంటామన్న కాంగ్రెస్ ధీమా ఫలితాల్లోనూ ప్రతిబింబించే అవకాశం ఉంది.
రెండో స్థానం కోసం హోరాహోరీ – బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ తర్వాత రెండో స్థానంలో ఎవరు నిలుస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన కేడర్ , గత పదేళ్ల పాలన గుర్తింపుతో బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీల్లో రెండో స్థానాన్ని నిలబెట్టుకునేలా కనిపిస్తోంది. అయితే, బీజేపీ కొన్ని పట్టణ ప్రాంతాల్లో పుంజుకున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా చూస్తే అది నామమాత్రపు పోటీకే పరిమితమయ్యే సూచనలు ఉన్నాయి. బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, సంస్థాగత నిర్మాణం గట్టిగా ఉన్న మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోనుంది. కనీసం ఇరవై మున్సిపాలిటీలు గెల్చుకునే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.
కార్పొరేషన్లలో మారుతున్న సమీకరణాలు
ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో పరిస్థితి మున్సిపాలిటీలకు భిన్నంగా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఐదు కార్పొరేషన్లలో కాంగ్రెస్ ఏకపక్షంగా దూసుకుపోయే అవకాశం ఉండగా, రెండు చోట్ల బీజేపీ గట్టి పోటీనిస్తోంది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ వంటి పట్టణాల్లో మతపరమైన , రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ మజ్లిస్ ( పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారనుంది. మజ్లిస్ మద్దతుతో కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ పరోక్ష సహకారంతో మజ్లిస్ మేయర్ పీఠాలను కైవసం చేసుకునే వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ దీన స్థితికి నిదర్శనమా?
ఈ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ చెబుతున్నట్లుగా ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబించడం కంటే, ఆ పార్టీ సొంత బలహీనతలను బయటపెట్టేలా ఉండనున్నాయి. వరుస ఓటములతో కుంగిపోయిన కేడర్లో ఉత్సాహం నింపేందుకు ఈ ఎన్నికలు ఒక అవకాశంగా భావించినా, ఫలితాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, తెలంగాణ ఓటర్లు ప్రభుత్వం మార్పు తర్వాత కనీసం రెండేళ్ల పాటు అదే ధోరణిని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు ఈ పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. ఫలితాలను బట్టి రాజకీయాలు మారనున్నాయి. శుక్రవారం తెలంగాణ రాకీయాల్లో ఓ బిగ్ డే అనుకోవచ్చు.
