తెలంగాణలో కరెంట్ కోతలు లేకపోవటంవెనక కారణం ఇదే!

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఎదురయ్యే ప్రధాన సమస్య విద్యుత్ అని, రాష్ట్రం చీకట్లోనే మగ్గాల్సి వస్తుందని నాడు ఉద్యమ సమయంలో కిరణ్‌కుమార్ రెడ్డివంటి సీమాంధ్ర నాయకులు హెచ్చరించిన మాట అందరికీ తెలిసిందే. అయితే అందరూ విస్తుపోయేలా తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి వేసవిలోకూడా కరెంట్ కోతలు లేకుండా చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. దానివెనక కారణాన్ని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వివరించారు.

తెలంగాణ ఏర్పడిన గత సంవత్సరమున్నర కాలంలో సంవత్సరంపాటు నిరంతరంగా విద్యుత్‌ను అందించిన సందర్భంగా ప్రభాకరరావు మీడియాతో మాట్లాడారు. ఐదు దశాబ్దాలకాలంనుంచి ఎన్నడూ లేనివిధంగా కరెంట్ కోతలను నివారించామని తెలిపారు. 2014 నవంబర్ 20న తెలంగాణలో విద్యుత్ కోతలను ఎత్తివేశామని చెప్పారు. మూడు ముఖ్యమైన అంశాలపై తాము దృష్టిపెట్టామని చెప్పారు. మొదట అంతర్గత సామర్థ్యం పెంచుకోవటం, తర్వాత ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలను తగ్గించటం, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ పెంచటం ఆ మూడు అంశాలని తెలిపారు. దీనితోపాటు 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. గతంలో 73 శాతం ఉన్న ప్లాండ్ లోడ్ ఫ్యాక్టర్‌ను 80.31 శాతానికి పెంచామని, లోడ్ మేనేజిమెంట్‌ను సరిగా నిర్వహించామని, డిస్కంలద్వారా విద్యుత్ కొరతను అడ్జస్ట్ చేశామని చెప్పారు. వీటన్నంటికి తోడు కేసీఆర్ దూరదృష్టి, అద్భుతమైన ప్రణాళికలు, సూచనల ఫలితంగా కోతలు లేకుండా విద్యుత్ అందించగలిగే స్థితికి చేరుకున్నామని తెలిపారు. కేవలం టీంవర్క్ తోనే సాధ్యమయిందని చెప్పారు. 2016 నాటికి రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్‌ను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసుకునే స్థాయికి చేరుకుంటామని అన్నారు. 2018 నాటికి విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థాయికి చేరుకుంటామని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com