కేసీఆర్ స‌భలో ఆశావ‌హుల ‘నివేద‌న‌’ ఉంటుందా..?

ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌కు నేటితో మూడురోజులే స‌మ‌యం ఉంది. 25 ల‌క్ష‌ల మందిని హైద‌రాబాద్ లోని స‌భావేదిక‌కు తీసుకుని రావాలంటూ ఎమ్మెల్యేల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ల‌క్ష్యం నిర్దేశించేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో గ‌ల్లీగ‌ల్లీలో నేత‌ల హ‌డావుడే ఉంది. నియోజ‌క వ‌ర్గాల్లో స‌న్నాహ‌క స‌మావేశాలు కూడా జోరుగా జ‌రుగుతున్నాయి. ఎవ‌రికి వారు, త‌మకు నిర్దేశించిన నంబ‌ర్ కంటే ఎక్కువ‌మంది జ‌నాన్ని స‌భ‌కు తీసుకెళ్లడం ద్వారా… కేసీఆర్ దృష్టిలో ప్ర‌త్యేకంగా ప‌డొచ్చ‌నే లెక్క‌ల్లో ఉన్నార‌ట‌! అయితే, తెరాస నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావ‌హులు కూడా ఈ ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌ను బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు అవ‌కాశంగా మార్చుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు… పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వానికి స‌మాచారం అందిందని తెలంగాణ భ‌వ‌న్ టాక్‌. దీంతో కొంత‌మంది మంత్రులు ప్ర‌త్యేకంగా కొన్ని నియోజ‌క వ‌ర్గాల‌పై దృష్టిపెట్టిన‌ట్టు స‌మాచారం.

ఇంత‌కీ, స‌మ‌స్య ఏంటంటే… సిటింగు ఎమ్మెల్యేలంద‌రికీ టిక్కెట్లు దాదాపు ఖాయ‌మ‌ని సీఎం కేసీఆర్ ఇదివ‌ర‌కే చెప్పారు క‌దా! తెరాస నుంచి టిక్కెట్ ఆశిస్తున్న పార్టీ ఇన్ ఛార్జులు, కేసీఆర్ సీటిస్తార‌ని వేరే పార్టీల నుంచి వ‌ల‌సొచ్చామ‌ని భావిస్తున్న ఇత‌ర నేత‌లూ కొంత అసంతృప్తికి గురౌతున్న సంగ‌తి తెలిసిందే. సిటింగుల‌కు సీట్లు అని సీఎం చెప్పేసినా… త‌మ వంతుగా చివ‌రి వ‌ర‌కూ ప్ర‌య‌త్నాలు చెయ్యాల‌నే ఆలోచ‌న‌లో కొంత‌మంది నేత‌లున్నార‌ట‌! స‌మ‌స్య అలాంటివారితోనే..! ప్ర‌గ‌తి నివేదన స‌భ‌కు వారు కూడా మ‌ద్ద‌తుదారుల్ని పెద్ద సంఖ్య‌లో త‌ర‌లించేందుకు గ్రూపుల్ని సిద్ధం చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. అంటే, ఒక నియోజ‌క వ‌ర్గం నుంచి తెరాస ఎమ్మెల్యే కోటాలో కొంత జ‌నం, టిక్కెట్లు ఆశిస్తున్న ఇత‌ర నేత‌ల కోటాలో మ‌రికొంత‌మంది జ‌నం… ఈ లెక్క‌న స‌భ ఓవ‌ర్ లోడ్ కావ‌డం ఒక స‌మ‌స్య అయితే, ఈ గ్రూపులు సామ‌ర‌స్యంగానే స‌భ‌లో వ్య‌వ‌హ‌రిస్తాయారా అనేది మ‌రో స‌మ‌స్య‌!

అందుకే, కొంత‌మంది మంత్రులు రంగంలోకి దిగి… ఇలాంటి గ్రూపుల‌తో మాట్లాడుతున్న‌ట్టు తెలుస్తోంది. శేర్లింగ‌ప‌ల్లిలో నాలుగు వ‌ర్గాలు జ‌న స‌మీక‌ర‌ణ‌లో ఉన్నాయ‌ట‌. ఉప్ప‌ల్‌, ఎల్బీన‌గ‌ర్ లో రెండేసి.. కూక‌ట్ ప‌ల్లిలో నాలుగు గ్రూపులు, ఇక ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గర్ జిల్లాలోని దాదాపు స‌గం నియోజ‌క వ‌ర్గాల నుంచి క‌నీసం మూడేసి గ్రూపులు, న‌ల్గొండ జిల్లాలోని స‌గం నియోజ‌క వ‌ర్గాల నుంచి రెండేసి గ్రూపుల‌… ఇలా ఎవ‌రికి వారు జ‌న స‌మీక‌ర‌ణ‌లో ఉన్నార‌నే స‌మాచారం పార్టీకి చేరింద‌ని చెబుతున్నారు. ఈ గ్రూపుల మ‌ధ్య స‌యోధ్య కోసం చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి, మంత్రులు సాగిస్తున్న మంత‌నాలు సత్ఫ‌లితాల‌ను ఇస్తాయా, లేదంటే కేసీఆర్ ప్ర‌గ‌తి స‌భ‌లో ఆశావ‌హుల నివేద‌న క‌నిపిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com