టి. కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఆయ‌నేన‌ట‌!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మ‌రోసారి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి చ‌ర్చ మొద‌లైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున సీఎం అభ్య‌ర్థిగా ఎవ‌రుంటానేది ఇప్పుడే తేలిపోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో కొంత‌మంది పార్టీ నేత‌లు ఉన్నారు. నిజానికి, సీఎం అభ్య‌ర్థిని ఎన్నిక‌ల‌కు ఇన్నాళ్లు ముందుగా ప్ర‌క‌టించిన సంస్కృతి కాంగ్రెస్ లో లేద‌నే చెప్పాలి. కానీ, తెలంగాణ‌లో ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు వేరుగా ఉన్నాయ‌నీ, తెరాసను స‌మ‌ర్థంగా ఎదుర్కోవాలంటే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ఇప్పుడే ప్ర‌క‌టించాల‌ని పార్టీ నేత‌లు ప‌ట్టుబ‌డుతున్నారు. అలా ప‌ట్టుబ‌డుతున్న వారు ఎవ‌రంటే.. పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అనుచ‌రులే కావ‌డం విశేషం!

ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని పార్టీ త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాలంటూ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అనుచ‌రులు కొంత‌మంది పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌త్యేక ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌నీ, ఈ నేప‌థ్యంలో ఉత్త‌మ్ అభ్య‌ర్థిత్వాన్ని క‌న్ఫ‌ర్మ్ చేస్తే తెరాస‌ను ఎదుర్కోవ‌డంలో ఇప్ప‌టి నుంచే వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్లొచ్చ‌నేది వారి ఆలోచ‌న‌. కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌న అనుస‌రించిన రాజ‌కీయ వ్యూహాల‌ను, ఫిరాయింపుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలంటూ అధిష్టానాన్ని కోరారు.

ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని మాత్ర‌మే ఎందుకు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాలీ, వేరే నాయ‌కులు లేరా అనే ప్ర‌శ్న‌కీ ముందుగానే స‌మాధానం చెప్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు భారీ ఎత్తున నిధులు అవ‌స‌రముంటుందనీ, గ‌తంతో పోల్చితే ఖ‌ర్చులు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నార‌ట‌. సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌క‌పోతే నిధుల సేక‌ర‌ణ విష‌యంలో ఎవ్వ‌రూ చొర‌వ చూప‌ర‌ట‌. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఉత్త‌మ్ ను ప్ర‌క‌టిస్తే.. ఆయ‌న నిధుల‌ను భారీ ఎత్తున రాబ‌ట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయంటూ పార్టీ అధిష్టానాన్ని కొంత‌మంది నేత‌లు కోరారు. మ‌రి, టి.కాంగ్రెస్ నేత‌ల ప్ర‌తిపాద‌న‌ను అధిష్టానం ఒప్పుకుంటుందో లేదో చూడాలి. అంతేకాదు, పార్టీలో సీఎం కుర్చీ రేసులో ఉన్నామ‌ని ప్ర‌క‌టించుకున్న నేత‌లు చాలామందే ఉన్నారు. వారు ఈ ప్ర‌తిపాద‌న‌పై ఎలా స్పందిస్తార‌నేది కూడా ప్ర‌శ్నే.? నిజానికి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా ఉండ‌ట‌మే కొంత‌మంది కాంగ్రెస్ నేత‌లకు గిట్ట‌ద‌నే అభిప్రాయం ఉంది. దీన్ని కూడా అధిష్టానం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుంది క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.