తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రస్తుతం క్లైమాక్స్ కు చేరుకుంది. ఈ ఎన్నికల్లో ఎక్కడా స్థానిక అభివృద్ధి అనేది చర్చకు రావడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత రెండేళ్లుగా తన దృష్టిని కేవలం హైదరాబాద్, మూసీ పునరుద్ధరణ, హైడ్రా , ఫ్యూచర్ సిటీ వంటి మెగా ప్రాజెక్టులకే పరిమితం చేశారు. ఫలితంగా రాష్ట్రంలోని మిగిలిన 116 మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలు కుంటుపడ్డాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేళ వీటిని చర్చకు రాకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి తన ప్రచారంలో పూర్తిగా రాజకీయ విమర్శలకే పదును పెడుతున్నారు.
ఎన్నికల ఎజెండాగా మారని స్థానిక సమస్యలు
రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెచ్చిన హైడ్రా వంటి వ్యవస్థలు హైదరాబాద్‌లోనే ప్రకంపనలు సృష్టించాయి. మూసీ ప్రక్షాళనకు రూ. 4,000 కోట్లకు పైగా నిధుల ప్రణాళికలు సిద్ధం చేసినా, జిల్లాల్లోని మున్సిపాలిటీలకు గత రెండేళ్లలో ప్రత్యేకంగా చేసిందేమీ లేదనేది నగ్న సత్యం. నిధుల లేమితో మున్సిపల్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయి. ఎన్నికలకు ముందు హడావుడిగా రూ. 2,780 కోట్లు విడుదల చేసినట్లు జీవోలు ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పనులు పట్టాలెక్కలేదు. ఈ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై విమర్శలు, బీఆర్ఎస్-బీజేపీ మధ్య రహస్య ఒప్పందం వంటి రాజకీయ అంశాలనే ప్రధాన ఎజెండాగా మార్చేస్తున్నారు.
విపక్షాల వైఫల్యం – విమర్శలకే పరిమితం
మున్సిపాలిటీల దుస్థితిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రధాన విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ ఘోరంగా విఫలమవుతున్నాయి. గత పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో పట్టణ ప్రగతి ద్వారా మున్సిపాలిటీలకు ఎంతో కొంత నిధుల ప్రవాహం ఉండేది. ఇప్పుడు ఆ నిధులు నిలిచిపోయిన విషయాన్ని, రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్‌ను చూపిస్తూ జిల్లాలను గాలికొదిలేశారనే వాస్తవాన్ని ప్రజలకు వివరించడంలో విపక్షాలు పట్టు సాధించలేకపోతున్నాయి. రేవంత్ రెడ్డి విసిరే రాజకీయ సవాళ్లకే కౌంటర్లు ఇవ్వడంలో విపక్ష నేతలు మునిగిపోవడంతో, అసలైన స్థానిక సమస్యలు తెరమరుగైపోతున్నాయి.
రేవంత్ రెడ్డి వ్యూహమే !
మున్సిపల్ ఎన్నికలు అంటే సాధారణంగా డ్రైనేజీలు, నీటి సరఫరా, రోడ్లు వంటి అంశాలపై జరగాలి. కానీ, రేవంత్ రెడ్డి తన ప్రసంగాల్లో వీటి ప్రస్తావన రాకుండా, రాష్ట్ర రాజకీయాల స్థాయిలోనే చర్చను ఉంచుతున్నారు. మేము గెలిస్తేనే నిధులు వస్తాయి అనే అధికార పార్టీ నినాదానికి వ్యతిరేకంగా రెండేళ్లలో మీరు ఏం చేశారు అని గట్టిగా నిలదీసే అభ్యర్థులు లేకపోవడం కాంగ్రెస్‌కు కలిసి వస్తోంది. ఫలితంగా ఈ ఎన్నికలు స్థానిక అభివృద్ధి కంటే, రేవంత్ రెడ్డి వ్యక్తిగత చరిష్మాకు, విపక్షాల మనుగడకు మధ్య జరుగుతున్న యుద్ధంలా మారిపోయాయి. అభివృద్ధిని అజెండాగా కాకుండా, కేవలం రాజకీయ ఆరోపణలనే పెట్టుబడిగా పెట్టి ఎన్నికలకు వెళ్లడం రేవంత్ రెడ్డి గడుసుతనానికి నిదర్శనం అనుకోవచ్చు.
