ముందుండాల్సిన ప‌వ‌న్ వెన‌క్కి త‌గ్గుతున్నారేంటీ..!

ఏదో చేస్తార‌ని ఎదురుచూస్తుంటే, ఎన్న‌టికీ ఏదీ చేసేట్టు లేరు అన్న‌ట్టుగా ఉంది జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరు! ప్ర‌త్యేక హోదా కోసం అధికార పార్టీ టీడీపీ పార్ల‌మెంటులోనూ రాష్ట్రంలోనూ గ‌ళ‌మెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఏదో ఒక కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తార‌నే అంతా అనుకుంటున్నారు. కానీ, ఆయ‌న తాజాగా స్పందిస్తున్న తీరు చూస్తుంటే, అలాంటిది ఉంటుందా అనే అనుమానం క‌లుగుతోంది. ఈరోజు మీడియాతో ఇష్టాగోష్టిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడారు. ఆఫ్ ద రికార్డ్ లో కొన్ని అంశాల‌పై స్పందించారు. వాటిలో ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌స్థావించారు.

ఆంధ్రాకు హోదా కోసం అంద‌ర్నీ క‌లుపుకుని ఉద్య‌మం చేద్దామ‌నే ఉంద‌నీ, కానీ ఆఖ‌రివ‌ర‌కూ అంద‌రూ నిల‌బ‌డ‌తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు క‌ల‌గడం లేద‌న్నారు. ప్ర‌త్యేక హోదాని అన్ని పార్టీలూ స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నాయ‌ని ఆరోపించారు. కేంద్రంలోని టీడీపీ మంత్రులు ఎప్పుడో రాజీనామాలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయ‌ప‌డ్డారు. వైకాపా, టీడీపీ ఎంపీలు బాగానే పోరాడుతున్నార‌నీ, కానీ ప్రాతినిధ్యం లేన‌ప్పుడు పార్ల‌మెంటులో ఎంత పోరాడినా న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం లేద‌న్నారు. ఇక‌, వైకాపా అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడుతూ.. దాని వ‌ల్ల ప్రత్యేకంగా ఒరిగే ప్ర‌యోజ‌నం ఏదీ ఉండ‌ద‌న్నారు. కేసీఆర్ ఏర్పాటు చేయ‌బోతున్న థ‌ర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతూ… అధికారం కోసం ఏర్పాటు చేయ‌లేద‌నీ, ప్ర‌త్యామ్నాయ వేదిక‌గా దీన్ని చూడాల‌న్నారు.

హోదా కోసం ఉద్య‌మించాల‌ని ఉన్నా అంద‌రూ చివ‌రివ‌ర‌కూ వ‌స్తారా అనే అనుమానం ప‌వ‌న్ వ్య‌క్తం చేయ‌డం స‌రైంది కాదు! ఎందుకంటే, ఉద్య‌మాల గురించి ప‌వ‌న్ కే బాగా తెలుసు..! చాలా పుస్త‌కాల్లో చ‌దివే ఉంటారు. వెయ్యి మైళ్ల ప్ర‌యాణ‌మైనా ఒక్క అడుగుతో మొద‌లౌతుంది. అంతెందుకు, దేశ‌రాజ‌కీయాల‌ను మార్చేసే థ‌ర్డ్ ఫ్రెంట్ అంటున్న కేసీఆర్ కూడా ప్ర‌స్తుతానికి ఒక్క‌రే, ఆయ‌న ఆలోచ‌న‌కి ఇంకా నాలుగు రోజులే వ‌య‌సు. కాబ‌ట్టి, ఆ ఉద్య‌మం ఏదో ప‌వ‌న్ మొద‌లుపెడితే ఎవ‌రొద్దంటారు..? అప్ప‌ట్లో విశాఖ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప‌లికిన‌ప్పుడే ప‌వ‌న్ కు ఓ మంచి అవ‌కాశం వ‌చ్చింది. ఆ త‌రువాత‌, ఆర్కే బీచ్ లో హోదా కోసం ఉద్య‌మిస్తాన‌ని చెప్పి, దాని గురించి మాట్లాడ‌టం మానేశారు. అంతెందుకు, తాజాగా జె.ఎఫ్.సి. అంటూ చాలా హ‌డావుడి చేశారు. ఉద్య‌మానికి రెడీ అంటూ టీ ష‌ర్టులు, టోపీలు కూడా సిద్ధం చేశారు. కానీ, కార్యాచ‌ర‌ణ మాత్రం ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ప్ర‌స్తుతం అలాంటి ఉద్దేశం ఉన్న‌ట్టు కూడా ఆయ‌న మాట‌ల్లో తెలుస్తోంది. ఇది ప‌వ‌న్ స‌హ‌జ శైలికి స‌రితూగ‌ని అభిప్రాయ వ్య‌క్తీక‌ర‌ణ అన‌డంలో సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.