తమిళనాడు రాజకీయాల్లో ఈసారి డీఎంకే , అన్నాడీఎంకే మాత్రమే కాదు, జాతీయ పార్టీలై బీజేపీ, కాంగ్రెస్ కూడా బ్రాహ్మణ అభ్యర్థులకు ఒక్క సీటు కూడా కేటాయించలేదు. దీనికి ప్రధాన కారణం తమిళనాడులో పుట్టి పెరిగిన ద్రవిడ ఉద్యమం . బ్రాహ్మణీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగిన పెరియార్ ఉద్యమ ప్రభావం నేటికీ అక్కడి రాజకీయాలను శాసిస్తోంది. గతంలో జయలలిత లాంటి బలమైన బ్రాహ్మణ నేత అన్నాడీఎంకేను నడిపించినప్పటికీ, ఆమె మరణం తర్వాత ఆ పార్టీ కూడా పూర్తిగా ఓటు బ్యాంకు రాజకీయాల వైపు మళ్లింది. బ్రాహ్మణులు రాష్ట్ర జనాభాలో కేవలం 2 నుండి 3 శాతం మాత్రమే ఉండటం, వారు ఒక నిర్ణయాత్మక ఓటు బ్యాంకుగా లేకపోవడం వారి అవకాశాలను దెబ్బతీసింది.
సామాజిక సమీకరణాలు
ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తిగా కుల గణాంకాల ఆధారంగా జరిగింది. వన్నియర్, గౌండర్, తేవర్ వంటి బలమైన ఓబీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేయడం ద్వారానే అధికారం దక్కుతుందని పార్టీలు భావిస్తున్నాయి. డీఎంకే తన సామాజిక న్యాయం నినాదంతో అగ్రవర్ణాలకు టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తుండగా, అన్నాడీఎంకే తన పాత ఓటు బ్యాంకును కాపాడుకునే క్రమంలో అదే బాటలో నడిచింది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు అభ్యర్థి గెలుపు గుర్రం కావాలంటే సదరు నియోజకవర్గంలో ఆ అభ్యర్థి కులం బలం కనీసం 20 శాతం పైన ఉండాలని పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి.
జాతీయ పార్టీల వ్యూహాత్మక మౌనం
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బ్రాహ్మణులకు అనుకూలమని భావించే బీజేపీ కూడా ఈసారి తమిళనాడులో ఆ వర్గాన్ని పక్కన పెట్టింది. తమిళనాడులో బయటి పార్టీ , అగ్రవర్ణ పార్టీ అనే ముద్రను పోగొట్టుకోవడానికి బీజేపీ ఈసారి ఉద్దేశపూర్వకంగానే ఓబీసీ , దళిత నేతలకు ప్రాధాన్యత ఇచ్చింది. ద్రవిడ సిద్ధాంతాలకు అనుగుణంగా అభ్యర్థులను మార్చాలని బీజేపీ భావించింది. అటు కాంగ్రెస్ కూడా డీఎంకేతో ఉన్న పొత్తు కారణంగా, వారి వ్యూహానికి భిన్నంగా వెళ్లి బ్రాహ్మణులకు టిక్కెట్లు ఇచ్చి ఉన్న ముస్లిం, ఓబీసీ ఓట్లను దూరం చేసుకోవడానికి ఇష్టపడలేదు.
రాజకీయ శూన్యత.. ప్రాతినిధ్య లోపం
ఇది కేవలం టిక్కెట్ల కేటాయింపు సమస్య మాత్రమే కాదు, తమిళ రాజకీయాల్లో ఒక వర్గం పూర్తిగా రాజకీయ శూన్యతలోకి ( వెళ్తున్న సంకేతం. ఒకప్పుడు పరిపాలనలో, రాజకీయాల్లో కీలకంగా ఉన్న వర్గం ఇప్పుడు కేవలం ఓటర్లుగానే మిగిలిపోతున్నారు. అభ్యర్థుల ఎంపికలో మెజారిటీ వాదం రాజ్యమేలుతుండటంతో, తక్కువ జనాభా కలిగిన మేధావి వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ ప్రాతినిధ్యం అనే కాన్సెప్ట్ కు విఘాతమే అయినప్పటికీ, అధికార దాహంలో ఉన్న రాజకీయ పార్టీలకు మాత్రం ఇది ఒక అనివార్య వ్యూహంగా కనిపిస్తోంది.
