ఆ విజ‌యం త‌మదే అంటున్న ప్ర‌తిప‌క్షం!

ఏపీ క్యాబినెట్ తాజాగా తీసుకున్న కీల‌క నిర్ణ‌యం… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెల్టు షాపుల్ని తొల‌గించ‌డం! నెల‌రోజుల్లోపు రాష్ట్రంలో బెల్టు షాపులు ఉండ‌కూడ‌ద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. ఈ మ‌ధ్య తాము నిర్వ‌హించిన ఓ స‌ర్వేలో మ‌హిళ‌ల అభిప్రాయాలు తెలుసుకున్నామ‌నీ, బెల్టు షాపుల‌కు వ్య‌తిరేకంగా వారు స్పందించార‌నీ, అందుకే వారి అభిప్రాయాల‌ను గౌర‌విస్తూ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సీఎం చెప్పారు. లైసెన్సులు లేకుండా అమ్మ‌కాలు జ‌రుపుతున్న‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అయితే, ఈ నిర్ణయంపై ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపా వ‌ర్గాలు స్పందించ‌డం విశేషం! చంద్ర‌బాబు స‌ర్కారు తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని త‌మ విజ‌యంగా చెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తుండం గ‌మ‌నార్హం!

గుంటూరు ప్లీన‌రీలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ‘న‌వ‌ర‌త్న’ ప‌థ‌కాలు టీడీపీ స‌ర్కారుకు టెన్ష‌న్ పుట్టిస్తున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాలు అభిప్రాయ ప‌డుతున్నాయి. జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ఆ తొమ్మిది ప‌థ‌కాలు చంద్ర‌బాబుకు వ‌ణుకు పుట్టిస్తోంద‌ని అంటున్నారు. అందుకే, ప్లీన‌రీ త‌రువాతే డ్వాక్రా మ‌హిళా సంఘాల‌కు రూ. 676 కోట్లు విడుద‌ల చేశార‌నీ… ఇదీ జ‌గ‌న్ ప్ర‌భావం వ‌ల్ల తీసుకున్న నిర్ణ‌య‌మే అని చెబుతున్నారు. బెల్టు షాపుల ఎత్తివేత అంశం మూడేళ్ల కింద‌టే టీడీపీ మేనిఫెస్టోలో పెట్టింద‌నీ, కానీ ఇప్పుడు జ‌గ‌న్ మ‌ద్య నిషేధం ప్ర‌క‌టించేస‌రికి టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌నీ, అందుకే హుటాహుటిన క్యాబినెట్ లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారంటూ వైసీపీ నేత‌లు అభివ‌ర్ణిస్తున్నారు. జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ప‌థ‌కాల‌పైనే క్యాబినెట్ లో ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగింద‌ని వారు చెప్పుకుంటున్నారు.

మ‌ద్య నిషేధ హామీని జ‌గ‌న్ తెర మీదికి తెచ్చాకే ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో స్పంద‌న వ‌చ్చిన మాట కొంత వాస్త‌వం కావొచ్చు. కాక‌పోతే, దీన్ని వైసీపీ విజ‌యంగా చెప్పుకోవ‌డ‌మే స‌రైన రాజ‌కీయ వ్యూహం కాద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. వైసీపీ అభిప్రాయం ప్రకారం.. జ‌గ‌న్ ప్ర‌క‌టించిన 9 హామీల్లో రెంటింటిని చంద్ర‌బాబు స‌ర్కారు నెర‌వేర్చేసింద‌ని ఒప్పుకుంటున్న‌ట్టే క‌దా! ఈ లెక్క‌న జ‌గ‌న్ ఇచ్చిన హామీల్లో మ‌రో ఏడు మాత్ర‌మే ఉన్నాయి. వాటిపై కూడా ప్ర‌భుత్వం దృష్టి సారించి… మ‌రీ జ‌గ‌న్ చెప్పిన‌ట్టు కాకుండా, చిన్న‌చిన్న మార్పుల‌తో వాటినీ అమ‌ల్లోకి తెచ్చే అవ‌కాశం ఉంది. అంటే, ఏ తొమ్మిది హామీల‌తో అయితే 2019 ఎన్నిక‌ల్లో టీడీపీపై పోరాటం చేయాల‌ని వైసీపీ భావిస్తోందో… వాటిని ఎన్నిక‌ల్లోపే టీడీపీ స‌ర్కారు నెర‌వేర్చి చూపించే అవ‌కాశాలు ఉన్న‌ట్టే క‌దా! తాత్కాలిక విజ‌యాలుగా వైసీపీ వీటి గురించి చెప్పినా… ఎన్నిక‌ల స‌మ‌యం వ‌చ్చేస‌రికి ప్ర‌చారం చేసుకోవ‌డానికి వారి వ‌ద్ద‌ ఏం మిగులుతుంది..? ఇవ‌న్నీ జ‌గ‌న్ న‌వ‌ర‌త్న హామీల ప్ర‌భావ‌మే అని చెప్పుకున్నా… తాము సాధించిన విజ‌యాలుగా టీడీపీ ప్ర‌చారం చేసుకుంటుంది క‌దా!
నిజానికి, ఎప్పుడో ఏడాదిన్న‌ర త‌రువాత రాబోయే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌ట్నుంచే మ్యానిఫెస్టో ప్ర‌క‌టించేస్తే… ఆలోపు ప‌రిస్థితులు మార‌వ‌ని అనుకున్నారా..? ఈ చిన్న లాజిక్ ను వైసీపీ ఎందుకు మిస్ అవుతోందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.