ఫిరాయింపుల‌పై తాజా వాద‌న ఇలా ఉంది..!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌ను ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేలు బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. స‌రే, జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఉన్నారు కాబ‌ట్టి, ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలి కాబ‌ట్టి, వారు నిర‌స‌న బాట ప‌ట్టారు. ప్ర‌జ‌ల‌కు చూపించిన కార‌ణం ఏంటంటే… ఫిరాయించిన ఎమ్మెల్యేల‌తో రాజీనామాలు చేయించే వ‌ర‌కూ స‌భ‌లోకి అడుగుపెట్ట‌మ‌న్నారు. నిజానికి, జ‌గ‌న్ పాద‌యాత్ర సంద‌ర్భంగా ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా టీడీపీ నేత‌లు స‌మ‌ర్థంగా తిప్పికొడుతున్నారు. ఈ ఫిరాయింపులు అంశం వ‌చ్చేస‌రికి మాత్రం కాస్త త‌ట‌ప‌టాయిస్తున్నారు! ఫిరాయింపుల్ని స‌మ‌ర్థిస్తున్న‌ట్టు మాట్లాడ‌లేక‌, అలాగ‌ని స‌మ‌ర్థించుకోకుండా ఉండ‌లేక కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్న మాట వాస్త‌వ‌మే. అందుకే, ఈ విష‌య‌మై రోజుకో ర‌క‌మైన వాద‌న‌ వినిపిస్తున్నారు.

తాజాగా మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైకాపా నుంచి టీడీపీలో చేరిన‌ శాస‌న స‌భ్యుల రాజీనామాను స్పీక‌ర్ అంగీక‌రిస్తే, తాము ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామ‌న్నారు. త‌మ రాజీనామాల‌ను స్పీక‌ర్ ఫార్మాట్ లోనే ఇదివ‌ర‌కే అంద‌జేశామ‌ని చెప్ప‌డం విశేషం! తన‌పై జ‌గ‌న్ గానీ, ఆయ‌న‌కాక‌పోతే ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఎవ‌రైనా స‌రే పోటీకి వ‌స్తారా అంటూ ఆదినారాయ‌ణ రెడ్డి స‌వాలు విసిరారు. త‌న రాజీనామాను ఆమోదించాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును కోరిన‌ట్టుగా ఈ సంద‌ర్భంగా చెప్పారు. ఇదే టాపిక్ మీద కొద్దిరోజుల కింద‌ట మ‌రో ఫిరాయింపు నేత అమ‌రనాథ రెడ్డి కూడా మాట్లాడిన అంశాన్ని ఇక్క‌డ గుర్తు చేసుకోవాలి. ఫిరాయింపు నేత‌ల‌తో రాజీనామాలు చేయిస్తే.. వెంట‌నే ఎన్నిక‌లు వ‌స్తాయ‌నీ, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎన్నిక‌లు అనేవి భారీ వ్య‌య‌ప్ర‌యాస‌ల‌తో కూడిన‌ ప్ర‌క్రియ అన్నారు. అంతేకాదు, ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌స్తే ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కొన్ని అభివృద్ధి ప‌నుల‌కు ఆటంకంగా మారుతుంద‌న్న స‌దుద్దేశంతోనే తాము ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని కోరుతున్నాం త‌ప్ప‌, పోటీకి భ‌య‌ప‌డి కాద‌ని స్ప‌ష్టం చేశారు!

ఫిరాయింపుల విష‌య‌మై ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌కు అనుకూల‌మైన వాద‌న‌ను వినిపిస్తున్నారు స‌ద‌రు నేతలు. గ‌త నెల‌లో మాట్లాడిన అమ‌ర‌నాథ రెడ్డి వెర్ష‌న్ ఒక‌లా ఉంటే, ఇప్పుడు ఆదినారాయ‌ణ రెడ్డి వాద‌న మ‌రోలా ఉంది! రాజీనామాలు ఎప్పుడో చేసేశాం, స్పీక‌ర్ ఆమోదించ‌క‌పోతే మేమేం చేస్తాం అన్న‌ట్టుగా ఈయ‌న ధోర‌ణి ఉంది! అంతేకాదు, త‌మ రాజీనామాల‌ను ఆమోదించాల‌ని ముఖ్యమంత్రిని కూడా కోరుతున్నాం అనేశారు. అంటే, వారు నిర్ణ‌యం తీసుకోక‌పోతే తామేం చేస్తామ‌ని చెబుతున్నారా..? ఏదేమైనా, జ‌ంప్ జిలానీల్లో ఉన్న క‌ల‌వర‌పాటుకు ఈ రెండు అభిప్రాయ‌లూ అద్దం ప‌డుతున్న‌ట్టుగా చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.