ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త డ్రామా మొదలైంది. ఇప్పటిదాకా విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తించిన వైసీపీ నేతలు, ఇప్పుడు ఒక్కసారిగా సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీశారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు లేని ఏడుపు ఇప్పుడు ఉబికి వస్తోంది. ఏడుద్దాం..రండి అంటూ పార్టీ నేతల్ని మోటివేట్ చేస్తున్నారు.
ఏపీ జనానికి ఇక ఎమోషనల్ సీన్లు గ్యారెంటీ!
వైసీపీ నేతల్లో హఠాత్తుగా భావోద్వేగం పొంగిపొర్లుతోంది. ఇన్నాళ్లూ తమ అధినేతను పొగిడేందుకు,ప్రత్యర్థి నేతల్ని తిట్టేందుకు నిఘంటువుల్లో లేని పదాలను వెతికిన నాయకులు, ఇప్పుడు అకస్మాత్తుగా కళ్లు తుడుచుకుంటున్నారు. బొత్స వైఎస్సార్ మరణాన్ని గుర్తు తెచ్చుకుని టీవీ కెమెరాల ముందు కన్నీరు మున్నీరయ్యారు. నాడు వైఎస్ చనిపోయాక ఆయన కుటుంబాన్ని, పార్టీని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా రాజకీయాలు చేసిన వారే, ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్‌ను నమ్ముకోవడం చూస్తుంటే.. ఏడుపులో కూడా ఏదో వ్యూహం ఉంది బాసూ అని జనం నవ్వుకుంటున్నారు.
తిట్టి కొట్టించుకోవడానికి అప్డేటెడ్ వెర్షన్ ఏడుపులు
తిట్టి కొట్టించుకోవడం ఒక పద్ధతి అయితే, ఇప్పుడు ఏడ్చి సానుభూతి పిండుకోవడం వైసీపీ లేటెస్ట్ ప్లాన్ లాగా కనిపిస్తోంది. రాష్ట్రంలో అమరావతికి అనుకూలంగా పార్లమెంటు చట్టం చేయడం, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో.. వైసీపీ నేతలకు దిక్కుతోచడం లేదు. అందుకే, ప్రజల దృష్టి మళ్లించడానికి సెంటిమెంట్ ఒక్కటే మార్గమని డిసైడ్ అయ్యారు. ఆఖరికి జగన్ రెడ్డి కూడా ఏదో ఒక బహిరంగ సభలో మెథడ్ యాక్టింగ్ అదరగొట్టి, భావోద్వేగంతో రెండు చుక్కలు రాల్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మీడియా సంస్థలపై దాడులు చేస్తూనే, తమ నాయకుల ఇళ్లలోని మహిళల గురించి ఎవరో అన్నారంటూ కన్నీళ్లు పెట్టుకోవడం ద్వారా సానుభూతి పొందాలని చూస్తున్నారు. కానీ, గతంలో తాము చేసిన వ్యక్తిగత దూషణలు, భువనేశ్వరి వంటి వారిపై చేసిన వ్యాఖ్యలు ప్రజలకు గుర్తున్నాయన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారు.
కన్నీటి కథా చిత్రాలకు రెడీ కావాల్సిందే
ఏపీ ప్రజలు రాబోయే రోజుల్లో మరిన్ని కన్నీటి కథా చిత్రాలు చూడటానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే, సిద్ధాంతాలతో పనిలేకుండా, కేవలం సానుభూతి మీద బండి లాగాలని వైసీపీ బలంగా నిర్ణయించుకుంది. గతంలో సిద్ధం అన్న వారు, ఇప్పుడు కన్నీళ్లతో సిద్ధం అని చెబుతున్నట్లు ఉంది. అయితే, ప్రజలు ఇప్పుడు చాలా విజ్ఞతతో ఉన్నారు.. ఏది గుండె లోతుల్లోంచి వచ్చే ఏడుపో, ఏది ఎన్నికల ముందొచ్చే ప్లాన్డ్ ఏడుపో వారికి బాగా తెలుసు!
