పోరాటానికీ లాబీయింగ్ కీ తేడా తెలియపోతే ఎలా..?

ప్ర‌త్యేక హోదాపై మొద‌ట్నుంచీ పోరాడుతున్న‌ది వైకాపా మాత్ర‌మే అని ఎంపీ విజ‌యసాయి రెడ్డి మ‌రోసారి అన్నారు. హోదా కోసం త‌మ అధ్య‌క్షుడు జ‌గ‌న్ మాత్ర‌మే పోరాడుతున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు నిర్వహించిన అఖిల ప‌క్ష స‌మావేశాన్ని విఫ‌ల ప‌క్ష స‌మావేశంగా ఎద్దేవా చేశారు. ఒక్క జ‌గ‌న్ మాత్ర‌మే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సాధించ‌గ‌ల‌ర‌ని చెప్పుకొచ్చారు. దాని కోసం పోరాటం కొన‌సాగిస్తామ‌ని మ‌రోసారి చెప్పారు. అంతేకాదు, త‌మ పోరాటంలో భాగ‌స్వామ్యం అయ్యేందుకు ఏ రాజ‌కీయ పార్టీ క‌లిసి వ‌చ్చినా.. క‌లుపుకుని పోతామ‌ని విజ‌య‌సాయి రెడ్డి చెప్పారు.

ఈ మాట విన‌గానే మొట్ట మొద‌ట క‌లిగే అనుమానం ఏంటంటే… ప్ర‌త్యేక హోదా కోసం వైకాపా చేస్తున్న పోరాటం ఏంటీ అని..! ప్రస్తుతం కేంద్రంపై వారు పెంచుతున్న ఒత్తిడి ఏదీ అని..! తెల్లారి ద‌గ్గ‌ర నుంచీ ప్ర‌ధానికీ భాజ‌పా పెద్ద‌ల‌కీ స‌న్నాయి నొక్కులు నొక్క‌డానికే వారు ప్రాధాన్య‌త ఇస్తున్నారే, దీన్ని పోరాటం అంటే ఎలా..? ప్ర‌త్యేక హోదా ఎందుకు ఇవ్వ‌లేద‌ని కేంద్రాన్ని నిల‌దియ్య‌రు, హామీలు ఎందుకు నెర‌వేర్చ‌డం లేద‌ని ప్ర‌ధానిని ప్ర‌శ్నించ‌రు. ఇది చాల‌ద‌న్న‌ట్టు.. పార్ల‌మెంటు ముందు ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తారు. ఇందులో పోరాటం అనేది ఎక్క‌డైనా ఉందా అనే అనుమానం ప్ర‌జ‌ల‌కి క‌లుగుతోంది.

ఇంకోమాట‌… ప్ర‌త్యేక హోదా కోసం మొద‌ట్నుంచీ పోరాడుతున్న‌ది ఒక్క వైకాపా మాత్ర‌మేన‌ట‌..! ఈ విష‌య‌మై అధికార పార్టీ చేసిన ప్ర‌య‌త్నం విజ‌య‌సాయి విస్మ‌రించినంత మాత్రాన‌.. ప్ర‌జ‌లు మ‌ర‌చిపోరు క‌దా! చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్పాటైన ద‌గ్గ‌ర నుంచీ కేంద్రం ఇస్తామ‌న్న హోదా కోసం ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అంటూ కేంద్రం హోదా కుద‌ర‌దని, ప్యాకేజీ ఇస్తామ‌ని చెబితే… స‌రే, పేరేదైతేనేం ప్ర‌యోజ‌నాలు ముఖ్యం క‌దా అని ఒప్పుకున్నారు. ఆ ప్యాకేజీ పేరుతో ఇస్తామ‌న్న నిధుల కోసం ఎప్ప‌టిక‌ప్పుడు ఢిల్లీకి వెళ్తూ, కేంద్రంతో ఓపిగ్గా వ్య‌వ‌హ‌రించారు. ఎప్ప‌టికీ స్పందించ‌క‌పోయేస‌రికి పొత్తును కాదనుకున్నారు. కేంద్రంపై పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. ఇదంతా పోరాటంలా క‌నిపించ‌డం లేదా..?

నాలుగేళ్లుగా జ‌గ‌న్ చేసిన పోరాటం ఏంటంటే… యువ‌భేరి లాంటి కొన్ని స‌భ‌లు పెట్టారు. అది కూడా చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డానికి మాత్ర‌మే! నాలుగేళ్లుగా అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నామ‌ని చెబుతున్న ఈ నేత‌లు… ఒక్క‌టంటే ఒక్క‌సారైనా కేంద్రాన్ని ప్ర‌శ్నించారా..? ఎందుకు హోదా ఇవ్వ‌రూ అంటూ భాజ‌పాని నిల‌దీశారా..? ఈ క్ష‌ణం కూడా.. ఓ ప‌క్క కేంద్రంపై అవిశ్వాసం పెట్టేసి… న‌రేంద్ర మోడీపై త‌మ‌కు న‌మ్మ‌కం ఉంద‌ని మాట్లాడుతున్నారు. కేవ‌లం త‌మ స్వార్థ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఢిల్లీలో చేసే లాబీయింగ్ ను కూడా పోరాటం అని చెప్పుకోవ‌డం విజ‌య‌సాయి రెడ్డికి మాత్ర‌మే చెల్లుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.