పాదయాత్రకు అధికార ముద్ర

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్పం పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విమర్శల కారణంగా ముందే కావలసినంత ప్రచారం వచ్చేసింది. శుక్రవారం బ్రేక్‌ వేసుకోవడానికి కూడా న్యాయస్థానం కారణమైంది. తుని ఘటనను ప్రస్తావించి శాంతి భద్రతల సాకు లీసుకొచ్చినప్పటికీ ప్రజలలో స్పందన రాకపోవడంతో పోలీసులు అనుమతి నివ్వక తప్పలేదు. నిజానికి ఒక నాయకుడి పాదయాత్ర సందర్భంలో రూట్‌ మ్యాప్‌ తెలుసుకుని తగు భద్రతా ఏర్పాట్లు చేయడం పోలీసుల బాధ్యత. అందులోనూ ప్రతిపక్ష నేతకు క్యాబినెట్‌ హౌదా వుంటుంది గనక అది తప్పనిసరి. అయితే ఇక్కడ ఈ ప్రక్రియ రాజకీయ రూపం సంతరించుకోవడం అధికార పార్టీ పుణ్యమే. పోలీసు శాఖ తనుగా వైఎస్‌ఆర్‌ పార్టీ నేతలను పిలిపించి మాట్లాడ్డం, అనుమతి విషయమై ఏదో అస్పష్టత వున్నట్టు చిత్రించడం విచిత్రమే. వైసీపీ ఆ అవకాశాన్ని బాగానే ఉపయోగించుకుంది. బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి, పార్థసారథి వంటి హేమాహేమీలు వెళ్లి డిజిపిని కలసి తమ పాదయాత్ర ప్రణాళిక అందజేయడం వల్ల భవిష్యత్తులో ఆరోపణలకూ అవకాశం లేకుండా పోయినట్టే. మొత్తం యాత్రపై ఒక్కచోటే ఒక్కసారే ఎలాగూ చర్చ సాధ్యం కాదు గనక ఎక్కడికక్కడ జిల్లా పోలీసుల సహాయం తీసుకుంటామని వైసీపీ నేతలు చెప్పారట. దానికీ పోలీసులు అంగీకరించవలసి వచ్చింది. అయినా ఏదో చెప్పాలి గనక చెప్పినట్టు సుప్రీం కోర్టు నిర్ణయించిన పద్దతుల పరిధిలో వున్నంత వరకే అనుమతి వుంటుందని ముక్తాయింపు తర్వాత విడుదల చేశారు. అయితే ఆ తర్వాత కూడా మంత్రులు గంటా శ్రీనివాసరావు, జవహర్‌ బాబు, పత్తిపాటి పుల్లారావు ఒకేరోజు పనిగట్టుకుని యాత్రపై దాడి చేయడం ద్వారా తమ వంతు ప్రచారం కల్పించారు. మరోవైపున జగన కూడా తిరుపతిదేవుడి సందర్భనతో రంగం సిద్ధం చేసుకున్నారు. శాసనసభ కూడా బహిష్కరించి పాదయాత్రకు వెళ్లేవారిని వెళ్లనీయక ఇంత ముందస్తు ప్రచారం ఎందుకు కల్పించినట్టు? ఏం సాదించినట్టు? దాన్ని ముందే ఆపడానికి అవకాశం వుందని ఆలోచించారనుకోవాలా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.