సిపిఎం-విశాఖ టు హైదరాబాద్‌

సిపిఎం 22వ జాతీయ మహాసభలు 2018 ఏప్రిల్‌లో హైదరాబాదులో జరగబోతున్నాయి. ఇందుకోసం ఉమ్మడి రాష్ట్ర సిపిఎం కార్యదర్శి, ఇప్పుడు ఢిల్లీలో జాతీయ బాధ్యతలు నిర్వహిస్తున్న బి.వి.రాఘవులు చైర్మన్‌గా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రధాన కార్యదర్శిగా ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు కూడా సభలోపాల్గొని తాము పూర్తిగా సహకరిస్తామని హామీనిచ్చారు.గతంలో రాజ్యసభ సభ్యుడుగా పాతబస్తీలో ప్రభావ శీల పాత్ర వహించిన మధుకు నగరంతో తమకంటే ఎక్కువ సంబంధం వుందని వీరభద్రం అన్నారు. ఈ సందర్భంలో ముఖ్యఅతిధిగా హాజరైన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. గతసారి అంటే 2015 మేలో విశాఖపట్టణంలో సిపిఎం 21వ మహాసభ జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా మహాసభ జరపడం ద్వారా తమకు రెండు రాష్ట్రాలు ఒకటేనన్న సంకేతం ఇస్తున్నామని ఆయన చమత్కరించారు.దేశంలోనే కొత్త రాష్ట్రాలుగా వున్న రెండింటిలోనూ వరుసగా సభలు పెట్టడం కూడా కొత్తగా వుంటుందని భావించామన్నారు.హైదరాబాదులో జరుగుతన్న కారణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఇతర అంశాలు ప్రసంగాలలో ప్రస్తావనకు వచ్చాయి. వాస్తవంగా 2002లోనూ కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం వుండగా సిపిఎం మహాసభలు హైదరాబాదులో జరిగాయి. అప్పుడప్పుడే గుజరాత్‌లో మారణకాండ కూడా సంభవించింది. తర్వాత కాలంలో సిపిఎం మద్దతుతో కాంగ్రెస్‌ నాయకత్వంలో యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి రావడం, అణు ఒప్పందంపై మద్దతు ఉపసంహరించుకోవడం వంటి సంచలనాలు జరిగాయి. ఇప్పుడు కూడా బిజెపినే అధికారంలో వుంది గాని అప్పటికన్నా బలంగా స్వంత మెజార్టితో మోడీ పాలిస్తున్నారు. కాంగ్రెస్‌ అప్పటితో పోలిస్తే బాగా బలహీనపడిన కాంగ్రెస్‌ను మళ్లీ పునరుజ్జీవం తేవడానికి రాహుల్‌ గాంధీ పెనుగులాడుతున్నారు. సిపిఎం వరకూ కాంగ్రెస్‌తో గాని ప్రాంతీయ పాలక పార్టీలతో గాని పొత్తులకు అవకాశం వుండదని ముందే విధానం నిర్ణయించుకుంది. కనుక ఈ మహాసభలు పూర్తి భిన్నమైన నేపథ్యంలో జరుగుతాయన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.