నీ సమక్షంలోనూ.. వివాదమేనా.. గోవిందా?

జగన్‌ పాదయాత్ర సంగతి అటుంచి తిరుపతి యాత్ర కూడా వివాదగ్రస్తం కావడం విసుగుపుట్టిస్తుంది.ఇటీవలి కాలంలో యాగాలూ స్వాములూ గుళ్లూ గోపురాల ప్రదక్షిణలు పెంచడం ఆయన వ్యక్తిగత వ్యవహారం. ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారో ఆ పదవి కావాలనుకుంటున్న ఆయన కూడా అదే చేస్తున్నారనుకోవాలి. ఈ మధ్య బిజెపికి కాస్త దగ్గరగా మెలిగిన ప్రభావం కూడా పడివుండొచ్చు. ఏమైతేనేం.. కోట్లమంది దర్శించే తిరుపతికి వెళ్లడానికి ఆయనకు పూర్తిగా హక్కుంది. సాంకేతికంగా ఆయన మత విశ్వాసాలేమిటనేది ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు గనకే కేసుల నేపథ్యంలోనూ అంత పెద్ద సంఖ్యలో ఓట్లు సీట్లు ఇచ్చారు. అలాటప్పుడు ఆయన ఫలానా మతం అని నిరూపించడానికి, హిందూయేతరుడుగా చూపించి వివాదం చెయ్యడానికి కారణమేలేదు. తెలుగు రాష్ట్రాల్లో లౌకికతత్వమే తప్ప మతతత్వ రాజకీయం నడవదు. కొన్ని మీడియా సంస్థలు దీన్ని వివాదం చేస్తున్నాయంటూ వైసీపీ నేత, టిటిడి మాజీ అద్యక్షుడూ భూమన కరుణాకరరెడ్డి సుదీర్ఘమైన ఉద్రేకపూరితమైన సమాధానం ఇచ్చారు. తనను ఆ స్థానంలో నియమించిన వైఎస్‌ హయాంలోనే తిరుపతిలో ఆధ్యాత్మిక హిందూమత కార్యక్రమాలు ఎంత విస్త్రతంగా జరిగాయో,ఎన్ని డజన్లసార్లు పర్యటించారో ఏకరువు పెట్టారు. అన్యమతస్తులు విశ్వాసం ప్రకటించేందుకు ఉద్దేశించిన పుస్తకంలో ఒక్కసారి కూడా వైఎస్‌ సంతకం చేయవలసిన అవసరమే కలగలేదని గుర్తు చేశారు. ఈ క్రమంలో కరుణాకరరెడ్డి వాదనల్లో హిందూ ధార్మికతనూ దాని సంరక్షకులుగా వైఎస్‌ఆర్‌, జగన్‌ల పాత్రనూ నొక్కి చెప్పేందుకు ప్రయత్నించడం కూడా కనిపిస్తుంది. అయితే మొదట వ్యర్థ వివాదం లేవనెత్తిన వారే అందుకు అవకాశమిచ్చారని చెప్పాలి. ఇకనైనా ఈ దండగమారి చర్చను ఆపితే మంచిది. రాజకీయ సామాజిక విషయాలు పురోగమనం ముఖ్యం తప్ప మతాల మధ్య తేడాలను పెద్దవి చేసుకునే మాటలు అవాంఛనీయమైనవి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.