జనసేన భూవివాదం లో వైసిపి సెల్ఫ్ గోల్ చేసుకుందా?

మంగళగిరి – చినకాకాని వద్ద పార్టీ కార్యాలయం కోసం జనసేన దాదాపు మూడు ఎకరాల భూమి రైతు యార్లగడ్డ వెంకటేశ్వరరావు వద్ద నుండి లీజు కి తీసుకోవడం,, ఆ భూమి తమదంటూ మైనార్టీ ముస్లిం వర్గానికి చెందిన కొందరు తెరపైకి రావడం, భూమి వివాదాస్పదమైనదని తేలితే, లీజు అగ్రిమెంట్‌ని రద్దు చేసుకుంటామని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఈ వివాదంపై స్పందించడం తెలిసిందే. అయితే ఆ ప్రకటనలోనే ఒక రాజకీయ నాయకుడి అండ తో ఇది జరగడం అనుమానాలకి తావిస్తోందని పవన్ ప్రస్తావించడం గమనార్హం. అయితే ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసిపి పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుందని నెటిజన్లు , సోషల్ మీడియా కోడై కూస్తున్నాయి.

ఆరోపణలు చేసిన ముస్లిం వ్యక్తులు టివి డిబేట్ లో చిన్న చిన్న ప్రశ్నలకే తెల్ల మొఖం వేయడం తో పాటు, భూమి యజమాని యార్లగడ్డ వచ్చి సర్వే నంబర్లతో సహా వివరాలు వెల్లడించడం తో ఇది రాజకీయ కుట్రేనన్న విషయం స్పష్టమైంది. జనసేన నేత గద్దె తిరుపతిరావు కూడా అసత్య ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తామని చెప్పడం చూస్తూంటే ఈ విషయం లో జనసేనది అప్పర్ హ్యాండ్ గా ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి, పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన ఆ రాజకీయ నాయకుడు ఎవరు, ఏ పార్టీ కి చెందిన వారు అనే విషయం పై పడింది.

ముస్లిం కుటుంబం తో పాటు గౌతం రెడ్డి కూడా ప్రెస్ మీట్ లో పాల్గొనడం తో ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఇష్యూ లో ఎంటరయ్యాడనే అభిప్రాయం , స్థానికుల్లోనూ, సోషల్ మీడియాలోనూ జోరుగా వినిపిస్తోంది. అయితే ముస్లిం కుటుంబం కూడా జనసేన మూడేళ్ళ లీజుకి తీసుకున్న స్థలానికి సంబంధించిన పత్రాలు మంత్రి కె ఇ కృష్ణ మూర్తి సహాయం తో తారుమారయ్యాయని వాదిస్తున్నారు. కానీ కేవలం మూడేళ్ళ లీజుకి తీసుకునే స్థలం కోసం అంత దుస్సాహసం ఎవరూ చేయరని, టిడిపి మంత్రి ని ఇరికించే ప్రయత్నం చూస్తూంటే వీరి వెనుక వైసిపి ఉన్నట్టు సామాన్యులు కూడా అర్థం చేసుంటున్నారు. అయితే గౌతం రెడ్డి ఆ మధ్య వంగవీటి రంగా పై అనుచిత వ్యాఖ్యలు చేసి వైసిపి నుండి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన అనధికారంగా వైసిపి నేతగానే కొనసాగుతున్నారు.

ఇప్పుడు స్థల యజమాని, ముస్లిం కుటుంబం చెబుతున్న సర్వే నంబర్లకి తమ స్థలానికి మధ్య పొంతన లేదని ఆధారలతో నిరూపించడం తో వైసిపి అనవసరంగా సెల్ఫ్ గోల్ చేసుకుందని జనం అభిప్రాయపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.