ఆంధ్రాలో భాజ‌పా ఆశిస్తున్న ప్ర‌యోజ‌నం ఏంటి..?

గుజ‌రాత్ ఫ‌లితాల త‌రువాత ఏపీలో భాజ‌పా నేత‌ల స్వ‌రం పెరిగింది. గ‌డ‌చిన రెండ్రోజులుగా సోము వీర్రాజు మాట‌ల దాడి పెంచారు. నిజానికి, మొద‌ట్నుంచీ చంద్ర‌బాబు తీరుపై ఆయ‌న కొంత నిర‌స‌న గ‌ళంతోనే ఉన్నారు. కానీ, ఇప్పుడు మ‌రింత ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. తెలుగుదేశం వైఖ‌రి వ‌ల్ల‌నే తాము గ‌తంలో చాలా న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింద‌న్నారు. చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి అప్ప‌ట్లో ముందుస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి దెబ్బ‌తిన్నామ‌నీ, కానీ నాటి ప‌రిస్థితులు ఇప్పుడు లేవ‌ని అన్నారు. 2004లో ఉన్న భాజ‌పా వేర‌నీ, ఇప్పుడున్న భాజ‌పా వేర‌ని వీర్రాజు వ్యాఖ్యానించారు. త‌మ‌కు పొత్తు పేరుతో టిక్కెట్లు ఇచ్చి, భాజ‌పా నేత‌ల‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగానే టీడీపీ ఓడిస్తోంద‌న్నారు. అయితే, ఈ వ్యాఖ్య‌ల‌పై తెలుగుదేశం నేత‌లు ఎవ్వ‌రూ ప్ర‌తిస్పందించొద్ద‌నీ, భాజ‌పాని విమ‌ర్శించొద్ద‌ని పార్టీ నేత‌ల‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించిన‌ట్టు సమాచారం.

ఇంత‌కీ, సోము వీర్రాజు వ్యాఖ్య‌లు భాజ‌పా వైఖ‌రికి అద్దం ప‌డుతున్న‌ట్టా, లేదంటే.. ఈ విమ‌ర్శ‌లను ఆయ‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయాలుగా ప‌రిగ‌ణించాలా..? ఒక‌వేళ వీర్రాజుది వ్య‌క్తిగ‌త ఆవేశ‌మే అనుకుంటే ఈ అంశంపై ఇతర భాజ‌పా నేత‌లు స్పందించాలి క‌దా! ఆయ‌న వ్యాఖ్య‌ల్ని పార్టీ వైఖ‌రిగా ప‌రిగ‌ణించొద్దు అని ఎవ‌రో ఒక‌రు ఏదో ఒక ప్ర‌క‌ట‌న చెయ్యాలి. అలాంటి ఏదీ లేదు. విచిత్రంగా, ఈ విమ‌ర్శ‌ల్ని భాజ‌పా వైఖ‌రిగా చూడొద్దంటూ టీడీపీ నేత‌లే త‌మ‌ను తాము కాస్త నియంత్రించుకునేందుకు చెప్పుకుంటూ ఉండ‌టం విశేషం! నిజానికి, సోము వీర్రాజు వ్యాఖ్య‌ల‌పై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ మొన్న‌నే కాస్త ఘాటుగా స్పందించారు. అయితే, ఆయ‌న‌కి కూడా చంద్ర‌బాబు క్లాస్ వేశార‌నీ, పార్టీ అధిష్టానం అనుమ‌తి లేకుండా భాజ‌పాపై ఎవ్వ‌రూ ఎలాంటి విమ‌ర్శ‌లు చెయ్యొద్దంటూ చెప్పార‌ట‌!

సో… భాజ‌పా విష‌యంలో టీడీపీ వైఖ‌రి ఏంటనేది స్ప‌ష్టంగానే అర్థ‌మౌతోంది. కేంద్రంతో ఆంధ్రాకి చాలా అవ‌స‌రం ఉంది. పోల‌వ‌రం, రాజ‌ధాని నిధులు, ప్ర‌త్యేక ప్యాకేజీ.. ఇలా చాలా రావాల్సి ఉన్నాయి. అవ‌న్నీ మెల్ల‌గా రాబ‌ట్టుకోవాలంటే.. సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా కొన్నాళ్లు ఉండాల‌నేది చంద్ర‌బాబు వైఖ‌రి. కాబ‌ట్టి, ఎంత క‌వ్వించినా టీడీపీ నుంచి సీరియ‌స్ రియాక్ష‌న్ రాద‌నేది చాలా స్ప‌ష్టం. మ‌రి, ఈ త‌ర‌హా విమ‌ర్శ‌ల ద్వారా ఆంధ్రా భాజ‌పా ఆశిస్తున్న‌ది ఏంటో అర్థం కావ‌డం లేదు..? గుజ‌రాత్, హిమాచల్ ఫ‌లితాల‌ను చూసి… దేశ‌మంతా నెమ్మ‌దిగా కాషాయ‌మ‌యం అవుతోంది కాబ‌ట్టి, ఆంధ్రాలో కూడా అదే జ‌రిగిపోతుంద‌ని సోము వీర్రాజు లాంటివాళ్లు అనుకుంటే, అది భ్ర‌మే అవుతుంది. ఎందుకంటే, ఆంధ్రాలో భాజ‌పాకి సొంత‌మైన బ‌ల‌మంటూ పెద్ద‌గా లేదు. ఇక్కడ హిందుత్వ లాంటి అంశాలు బలంగా పనిచేసే పరిస్థితి లేదు. మోడీ మేనియా కూడా కొంతవరకే ప్రభావితాంశం. ఇక్కడున్న కుల సమీకరణాలు భాజపాకి అర్థమయ్యేవీ కావు. కాబట్టి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా పొత్తు త‌ప్ప‌దు. మరోసారి టీడీపీతో పొత్తు వద్దనేది వీర్రాజు లాంటి నేతల అభిప్రాయం అయినప్పటికీ… దీర్ఘకాలిక పార్టీ ప్రయోజనాల ద్రుష్ట్యా ఆలోచిస్తే, టీడీపీని భాజపా జాతీయ నాయకత్వం దూరం చేసుకోదు. టీడీపీ కూడా భాజపాని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోదు. ప‌రిస్థితి ఇంత స్ప‌ష్టంగా ఉంటే… సోము వీర్రాజు వీరావేశంతో ఎందుకంత పెద్ద మాట‌లు విసిరేస్తున్నట్టు..? అదిష్టానం అనుమ‌తి లేకుండానే ఈ స్థాయిలో మాట్లాడేస్తారా..? ఇప్పుడీ అంశాలే ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చ‌నీయం అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.