జ‌గ‌న్ తాత‌య్య అంటూ సోమిరెడ్డి పంచ్‌..!

ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హామీల వ‌ర్షం కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. దేవుడి ద‌య‌వ‌ల్ల‌, ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో అధికారంలోకి రాగానే అన్నీ చేసేస్తా అంటూ చాలా వాగ్దానాలు చేసుకుంటూ వ‌స్తున్నారు. వీటిల్లో ప్ర‌ధాన‌మైంది వృద్ధాప్య పింఛెన్‌. దీన్ని రూ. 2000ల‌కు పెంచుతా అంటున్నారు. ఒక‌వేళ ఈలోగానే చంద్ర‌బాబు స‌ర్కారు పెంచేస్తే… తాను రూ. 3 వేలు చేస్తాన‌నీ అంటున్నారు. అంతేకాదు, 45 ఏళ్లు దాటినవారికి వృద్ధాప్య పింఛెన్ ఇచ్చేస్తా అంటూ ప్ర‌ధానంగా చెబుతున్నారు. ఇదే వాగ్దానంపై టీడీపీ నేత‌లు స్పందించారు. పింఛెను హామీ విష‌యంలో జ‌గ‌న్ ది అవ‌గాహ‌నా రాహిత్యం అంటున్నారు ఏపీ మంత్రులు.

45 ఏళ్ల‌కే వృద్ధాప్య పింఛెన్ ఇస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇస్తూ ఉండ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి. జ‌నాల్ని 45 ఏళ్ల‌కే ముస‌లాళ్ల‌ను చేసేస్తారా అంటూ ఎద్దేవా చేశారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 1972లో జ‌న్మించార‌నీ, ఇప్ప‌టికి క‌రెక్ట్ గా 45 సంవ‌త్స‌రాలు అయింద‌న్నారు. ఆయ‌న పెన్ష‌న్ పాల‌సీ ప్ర‌కారం ఆయ‌న్ని వృద్ధుడ‌నే అనాల‌నీ, ఆయ‌న పింఛెన్ తీసుకోక‌పోయినా ఇచ్చిన వాగ్దానం ప్ర‌కారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వృద్ధుల‌కు అర్హుడు అంటూ ఎద్దేవా చేశారు. ఆయ‌న‌కి న‌ల‌భై అయిదేళ్లు నిండాయి కాబ‌ట్టి, ఆయ‌న తీర్మానం ప్ర‌కార‌మే ఇక‌పై జ‌గ‌న్ ను తాత‌య్య అనొచ్చు అన్నారు. మ‌రో మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి కూడా ఇదే అంశ‌మై విమ‌ర్శ‌లు చేశారు. పెన్ష‌న్ విష‌య‌మై జ‌గ‌న్ కు స్ప‌ష్ట‌త లేద‌నీ, 65 ఏళ్లు దాటిన‌వారినే వృద్ధులు అంటార‌ని మంత్రి విమ‌ర్శించారు. ప‌దాల‌ను మార్చేస్తూ జ‌గ‌న్ గంద‌ర‌గోళ ప‌డుతున్నార‌ని చెప్పారు.

నిజానికి, 45 ఏళ్ల‌కే పెన్ష‌న్ అనే అంశంపై కొంత అర్థ‌వంత‌మైన చ‌ర్చే జ‌ర‌గాలి. ఇలాంటి జ‌నాక‌ర్ష‌క‌ హామీలు ప్ర‌భుత్వాల‌కు ఎంత భార‌మౌతాయో టీడీపీకి అనుభ‌వైక‌మే. గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేందుకు, వాటికి నిధులు స‌మ‌కూర్చేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చాలా అవ‌స్థలు ప‌డుతున్నారంటూ ఆ మ‌ధ్య టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఓ సంద‌ర్భంలో చెప్పారు. ఇప్పుడు జ‌గ‌న్ ఇస్తున్న హామీలు కూడా అంతిమంగా ప్ర‌జ‌ల‌పై భారాన్ని పెంచేవే అవుతాయి. ఇంత‌వ‌ర‌కూ ఆయ‌న చెప్తున్న ప‌థ‌కాల అమ‌లుకు కొన్ని ల‌క్ష‌ల కోట్ల వ్య‌యం క‌నిపిస్తోంది. విభ‌జ‌న త‌రువాత రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితిలో ఉంది. ప‌రిశ్ర‌మ‌లు లేవు, రాబ‌డి చాల‌దు. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల‌కు చాలా స్ప‌ష్టంగా అర్థ‌మౌతున్నాయి. ఇలాంట‌ప్పుడు జ‌గ‌న్ ఇస్తున్న హామీల‌ను ఎలా నెర‌వేర్చ‌గ‌ల‌రు అనే ఆలోచ‌న కూడా ప్ర‌జ‌ల‌కు ఉంటుంది క‌దా! సో… రాష్ట్ర ఆదాయ వ‌న‌రుల పెంపుపై కూడా జ‌గ‌న్ కొంత స్ప‌ష్ట‌త ఇస్తే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.