తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎన్టీఆర్ ఎవరో ఒకరి సొత్తు కాదు, ఆయన ఒక నేషనల్ లీడర్ మరియు జాతి ఆస్తి అని .. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో వ్యాఖ్యానించారు. 2029లో జమిలి ఎన్నికలు రావడం ఖాయమని .. ఐదున్నరేళ్లు తానే సీఎంగా ఉంటానన్నారు. ఆ తర్వాత ఐదేళ్లు కూడా తన టర్మేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజు, మంత్రి తానేనని తనకు ఎవరూ పోటీ లేరన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం స్వయం ప్రకటిత గృహ నిర్బంధంలో ఉన్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను జైల్లో వేయాలనే ఉద్దేశం తమకు లేదని, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే అది కేవలం చట్టప్రకారం, రాజ్యాంగ నిబంధనలకు లోబడే జరుగుతుందని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని, విదేశాల నుంచి ప్రభాకర్ రావును తీసుకురావడానికి పట్టిన 20 నెలల సమయం వల్లనే విచారణలో జాప్యం జరిగిందని వివరించారు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే దర్యాప్తు ముందుకు సాగుతోందని, తాము ఎవరి ఫోన్లను ట్యాప్ చేయడం లేదని తేల్చి చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం మూడు గేట్ల మరమ్మతులతో సరిపెట్టలేమని, మొత్తం ప్రాజెక్టును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు అధ్యయనం చేస్తున్నామని రేవంత్ తెలిపారు. కేసీఆర్, హరీష్ రావుల తొందరపాటుకు తాము బలి కాబోమన్నారు. ఏపీతో ఉన్న జల వివాదాలపై మాట్లాడుతూ, తెలంగాణకు రావాల్సిన నికర జలాల వాటాను అడ్డుకోవద్దని ఏపీకి సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదని, రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ విషయంలో ఒకే విధమైన పారదర్శక విధానం ఉండాలని కోరారు.
రాష్ట్ర అభివృద్ధిపై రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రణాళికను వివరించారు. మార్చి 31 లోపు మెట్రో టేకోవర్, జూన్ 2న ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు శంకుస్థాపన చేస్తామన్నారు. హైదరాబాద్‌ను బుల్లెట్ రైల్ హబ్ గా మార్చేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు ఇచ్చానని, 2034 నాటికి ఇది అందుబాటులోకి రావచ్చని చెప్పారు.


