తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్ర అనేది ఒక తిరుగులేని అస్త్రంగా మారింది. గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ వంటి నేతలు పాదయాత్రల ద్వారానే అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే కాలక్రమేణా పాదయాత్రల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఇది కేవలం ప్రజలతో మమేకం కావడానికి చేసే నడకగా ఉంటే, ఇప్పుడు ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న హై-టెక్ పొలిటికల్ ఈవెంట్ గా రూపాంతరం చెందింది. అందుకే ఈ సారి పాదయాత్రలు చేయాలనుకున్న వారికి అంత ఈజీ కాదు అనుకోవాలి.
పాదాల నడక కంటే.. ప్రచార హోరే ఎక్కువ!
నేటి కాలంలో పాదయాత్ర చేయాలంటే కేవలం ఓపిక ఉంటే సరిపోదు, వందల కోట్ల బడ్జెట్ ఉండాలి. ఒక ప్రధాన నాయకుడి పాదయాత్రకు రోజుకు కనీసం రెండు కోట్లకు పైగానే ఖర్చవుతోంది. ఈ ఖర్చు కేవలం భోజనాలు, టెంట్లు లేదా రవాణాకే పరిమితం కాదు. నాయకుడి ప్రతి అడుగును షూట్ చేయడానికి డ్రోన్లు, హై-ఎండ్ కెమెరాలతో కూడిన ప్రత్యేక మీడియా టీమ్స్, సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండింగ్ చేయడానికి పని చేసే డిజిటల్ ఆర్మీ, జాతీయ స్థాయి పీఆర్ ఏజెన్సీల నిర్వహణకు భారీగా వెచ్చించాల్సి వస్తోంది. పాదయాత్ర ఇప్పుడు ఒక లైవ్ షోలా సాగుతోంది.
అభ్యర్థులపై ఆర్థిక భారం
పాదయాత్ర ఏ నియోజకవర్గంలో సాగుతుందో, అక్కడి ఇన్చార్జ్ లేదా పోటీ చేయాలనుకునే అభ్యర్థిపై ఆర్థిక భారం పడుతోంది. జన సమీకరణ నుంచి మొదలుకొని, వచ్చిన వారందరికీ సౌకర్యాలు కల్పించడం, నాయకుడి బస, భద్రత వంటివన్నీ స్థానిక నేతలే భరించాల్సి ఉంటుంది. ఇది పార్టీకి మాత్రమే కాదు, అభ్యర్థులకు కూడా భారంగా మారింది. తమ రాజకీయ భవిష్యత్తు కోసం, నాయకుడి దృష్టిలో పడటం కోసం అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి. ప్రస్తుత పాదయాత్రల్లో సహజత్వం కంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కడ ఏ వర్గం ప్రజలను కలవాలి, వారితో ఏం మాట్లాడాలి, ఏ సమస్యపై ఏ విధంగా స్పందించాలి అనే విషయాల్లో ముందే సిద్ధం చేసిన స్క్రిప్టులు ఉంటున్నాయి. పొలిటికల్ కన్సల్టెంట్లు ఇచ్చే డేటా ఆధారంగానే యాత్ర రూట్ మ్యాప్ తయారవుతోంది. ప్రతిరోజూ ఒక హైలైట్ పాయింట్ ఉండేలా, అది మీడియాలో చర్చకు వచ్చేలా పక్కా ప్రణాళికతో హంగామా సృష్టిస్తున్నారు.
ఖర్చు చేసేది అంతా రాజకీయ అవినితే
రాజకీయ నాయకులు వివిధ మార్గాల్లో సంపాదించిన అక్రమ సొమ్ము, ఇలాంటి ఎన్నికల సమయాల్లో లేదా పాదయాత్రల రూపంలో మళ్లీ ప్రజల్లోకి చేరుతోందని సామాన్య ప్రజలు భావిస్తుంటారు. టెంట్లు వేసే వారు, ఫ్లెక్సీల తయారీదారులు, రవాణాదారులు, క్యాటరింగ్ సర్వీసులు ఇలా పరోక్షంగా వేలమందికి ఈ యాత్రల వల్ల ఉపాధి లభిస్తోంది. పాదయాత్ర అనేది ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య ఉద్యమం కంటే ఒక భారీ బడ్జెట్ సినిమాను తలపిస్తోంది. భారీ సెట్టింగులు, ఎమోషనల్ స్పీచ్‌లు, సోషల్ మీడియా ఎలివేషన్ల మధ్య అసలైన ప్రజా సమస్యలు ఎక్కడో మరుగున పడిపోతున్నాయన్నది చేదు నిజం.


