కాదేదీ టైటిల్ కి అనర్హం అనే టైపులో ఆలోచిస్తుంటుంది చిత్రసీమ. ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి ఎలాంటి టైటిల్ అయినా పెట్టడానికి రెడీ అవుతుంటుంది. ఈ క్రమంలోనే తిట్లు, శాపనార్థాలు కూడా టైటిల్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు మైత్రీ మూవీస్ సంస్థ ఓ టైటిల్ ని రిజిస్టర్ చేయించింది. ఆ టైటిల్ గురించి తెలుసుకొంటే.. ఇదేం టైటిల్? అనిపించకమానదు. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటనుకొంటున్నారు..? ‘దొంగనా కొడుకు’.
‘లిటిల్ హార్ట్స్’ తో సూపర్ హిట్ కొట్టిన మౌళితో మైత్రీ మూవీస్ ఓ సినిమా రూపొందిస్తోంది. శ్రీను అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ‘దొంగనా కొడుకు’ అనే టైటిల్ ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టైటిల్ సరదాగా ఉండొచ్చు. పలుకుబడిలో ఉండే పదం కావొచ్చు. కానీ ఇలాంటి టైటిల్స్ ఫ్యామిలీ ఆడియన్స్ అటెన్షన్ కోల్పోయేలా చేస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ రాకపోయినా ఫర్వాలేదు, వాళ్ల నుంచి పాజిటీవ్ ఫీడ్ బ్యాక్ లేకపోయినా ఫర్వాలేదు అనుకొంటే మాత్రం ఈ టైటిల్ ని ఫిక్స్ చేసుకోవొచ్చు. కాకపోతే మైత్రీ సంస్థకు ఓ ఇమేజ్ ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ సంస్థకు ఉంది. ‘దొంగనా కొడుకు’ టైటిల్ ఇమేజ్ ని కాపాడే టైటిల్ అయితే కాదు. పోగొట్టే టైటిల్ కూడా కాకపోవొచ్చు. కానీ బ్యాడ్ ఇంప్రెషన్ మాత్రం తప్పకుండా తీసుకొస్తుంది. ఇలాంటి టైటిల్ విషయంలో చిత్రబృందం మరోసారి క్రాస్ చెక్ చేసుకొంటే మంచిదేమో?
