‘మాకు రెంటల్ పద్ధతి వద్దు… ఆదాయంలో వాటా కావాలి’ అని థియేటర్ యజమానులు.. ‘పర్సంటేజీ ఇవ్వలేం.. ఇప్పటి వరకూ ఉన్న రెంటల్ పద్దతిలోనే సినిమాల్ని విడుదల చేస్తామంటూ’ నిర్మాతలూ మొంకి పట్టు పట్టారు. ఫలితంగా త్వరలోనే టాలీవుడ్ లో థియేటర్లకు తాళాలు పడడం ఖాయమని తెలుస్తోంది. మే 1 నుంచి ఎగ్జిబీటర్లు స్వచ్ఛంద బంద్ కు పిలుపు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే వేసవిలో విడుదల కాబోతున్న సినిమాలకు అది పెద్ద దెబ్బ అనుకోవొచ్చు.
రెంటల్ విధానంపై చాలా కాలం నుంచి ఎగ్జిబీటర్లు అసహనంతో ఉన్నారు. గతేడాది పర్సంటేజీ విధానంపై పట్టుపట్టారు. కొన్ని రోజులు థియేటర్లకు తాళాలు వేశారు. కానీ.. వెనక్కి తగ్గక తప్పలేదు. ఈసారి కూడా అదే జరుగుతుందన్నది నిర్మాతల ఆశ. కానీ.. ఎగ్జిబీటర్లు మాత్రం తమ పంతం నెగ్గించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. పర్సంటేజీ విధానం పట్ల సుముఖంగా లేమని ఇటీవలే గిల్డ్ ఓ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, ప్రదర్శన కారుల మధ్య చర్చలు కూడా మొదలయ్యాయి. కానీ అవేవీ సత్పలితాలు ఇవ్వట్లేదని సమాచారం. బడా నిర్మాతలంతా రెంటల్ కే మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఎగ్జిబీటర్ల వైపు కూడా కొంతమంది పెద్ద మనుషులు ఉన్నట్టు సమాచారం. థియేటర్లు చేతిలో ఉన్న నిర్మాతలు.. పర్సంటేజీ విధానం తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో.. ఈసారి వ్యవహారం మరింత ముదిరే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. మే 1 నుంచి థియేటర్ల సమ్మె మొదలైతే, ఈ వేసవి మరింత దారుణంగా మారడం ఖాయం. పెద్ద సినిమాలు వాయిదా పడుతున్న నేపథ్యంలో టాలీవుడ్ మీడియం రేంజ్ సినిమాలపై ఆశలు పెట్టుకొంది. ఇప్పుడు వాటి విడుదలకు కళ్లెం వేసినట్టు అవుతుంది. మే 1లోగా ఈ సమస్యకు పరిష్కారం దొరకాలి. లేదంటే.. కష్టమే.
