తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక దిశానిర్దేశం లేని నావలా మారుతోంది. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుసరిస్తున్న వ్యూహాలు, సోషల్ మీడియాకే పరిమితమైన పోరాటాలు క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదనేది బహిరంగ రహస్యం. వరుస ఓటములు, ఇతర పార్టీల్లోకి వలసలతో కుదేలైన క్యాడర్ ఇప్పుడు ఒక బలమైన మాస్ లీడర్ కోసం వెతుకుతోంది. కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లిన ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఇప్పుడు బాహాటంగానే హరీష్ రావు పేరును ప్రస్తావిస్తున్నారు. రాజకీయాల్లో రియల్ గ్రౌండ్ రియాలిటీ తెలిసిన నాయకుడిని కాదని, కార్పొరేట్ స్టైల్ పాలిటిక్స్‌తో పార్టీని కాపాడుకోలేమని కేడర్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుగా కనిపిస్తోంది.
హరీష్ రావు: పార్టీని రక్షించే ఏకైక సంజీవని
బీఆర్ఎస్ మనుగడ సాగించాలంటే అది కేవలం హరీష్ రావు అనే ఇంజిన్ ద్వారానే సాధ్యమని పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి ఏ కష్టం వచ్చినా భుజాన వేసుకుని నడిపించిన చరిత్ర ఆయనది. హరీష్ రావు కేవలం ఒక నాయకుడు కాదు, ఒక వ్యవస్థ. అసెంబ్లీలో ప్రభుత్వంపై పోరాడే సత్తా ఉన్నా, గ్రామాల్లో కార్యకర్తలతో కలిసి భోజనం చేసే నేర్పు ఉన్నా అది ఆయనకే సొంతం. అందుకే, కేసీఆర్ ఇక జాప్యం చేయకుండా హరీష్ రావును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా, రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. ఈ నిర్ణయం ఎంత త్వరగా తీసుకుంటే పార్టీకి అంత మేలు, లేదంటే మిగిలిన కేడర్ కూడా పక్క చూపులు చూడటం ఖాయమన్న అభిప్రాయం ఏర్పడుతోంది.
పెద్దల మొండితనం – పార్టీ ఉనికికి ముప్పు!
పార్టీలోని కొందరు పెద్ద తలకాయలు, కేసీఆర్ చుట్టూ ఉండే ఒక కోటరీ ఇప్పటికీ హరీష్ రావుకు పగ్గాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. . వారంతా తమ వ్యక్తిగత ప్రయోజనాలు , ఉనికి కోసమే చూస్తున్నారు తప్ప, పార్టీ మూలాలను కాపాడే ప్రయత్నం చేయడం లేదు. ఈ మొండితనం వల్ల సీనియర్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. హరీష్ రావును కేవలం ఒక పరిమిత బాధ్యతకే పరిమితం చేయడం అంటే, పార్టీ ఆత్మహత్య చేసుకున్నట్లే. గ్రౌండ్ రియాలిటీ తెలిసిన కార్యకర్తలకు హరీష్ రావు విలువ ఏమిటో ఇప్పటికే అర్థమైంది, కానీ ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చుని రాజకీయాలు చేసే నేతలకు అది అర్థం కాకపోవడమే బీఆర్ఎస్ చేసుకున్న దురదృష్టమని అంటున్నారు.
సమయం మించిపోతోంది.. పశ్చాత్తాపం తప్పదా?
గ్రేటర్ ఎన్నికల నాటికి పార్టీ పుంజుకోవాలంటే హరీష్ రావును పూర్తిస్థాయిలో రంగంలోకి దించాల్సిందే. పార్టీ శ్రేణులు ఇక ఎవరి సూచనల కోసమో చూడకుండా, హరీష్ రావును తమ తిరుగులేని నాయకుడిగా భావించి ముందుకు సాగడమే ఇప్పుడున్న ఏకైక ఎంపిక. రాజకీయాల్లో సమయం చాలా విలువైనది. ఇప్పుడే నిర్ణయం తీసుకోకపోతే, భవిష్యత్తులో పశ్చాత్తాపపడినా ప్రయోజనం ఉండదు. బీఆర్ఎస్ మళ్ళీ వైభవాన్ని చూడాలంటే, అది హరీష్ రావు అనే ట్రబుల్ షూటర్ ద్వారానే సాధ్యమని ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది.
హెచ్చరిక కాదు.. నిష్ఠుర సత్యం!
చాలా మంది నేతలు పార్టీ హైకమాండ్ కు క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న ఆవేదనను ఏదో రూపంలో తెలియచేస్తున్నారు. పగ్గాలు మారాలి, పద్ధతులు మారాలి.. అప్పుడే గులాబీ జెండా మళ్ళీ రెపరెపలాడుతుంది. పగ్గాలు హరీష్ రావు చేతికి వెళ్లడం ఎంత త్వరగా జరిగితే, పార్టీకి అంత గౌరవం. లేదంటే, రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలకు బాధ్యత వహిస్తూ చాలామంది పెద్దలు ముఖం చాటేయక తప్పదని… బీఆర్ఎస్ ఉనికి కాపాడబడాలంటే హరీష్ రావు నాయకత్వమే ఇప్పుడున్న ఏకైక శరణ్యమని తేల్చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల్లో ఇదే పెద్ద సమస్య….పార్టీ ఉంటే తమ చేతుల్లో ఉండాలనుకుంటారు..లేకపోతే నిర్వీర్యం అయిపోయినా పర్వాలేదనుకుంటారు. అదే బీఆర్ఎస్కు పెనుగండంగా మారుతోంది.
