దేశంలో మరోసారి లాక్డౌన్ విధిస్తారంటూ పుకార్లు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాల్లో రాబోయే కాలం సవాల్‌తో కూడుకున్నదని, కరోనా కంటే దారుణమైన పరిస్థితులు ఎదురైనా ఆశ్చర్యపోనక్కర్లేదని చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకోవడమే ఈ గందరగోళానికి కారణమైంది.
పశ్చిమాసియా ప్రభావం భారత్‌పై
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అందరూ చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇప్పటికి ఆ వ్యవహారం డెడ్ లాక్ పడిపోయింది. ఇది దేశంలో ద్రవ్యోల్బణానికి దారితీసి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చేస్తుంది. ప్రధాని మోదీ ఉద్దేశం ప్రజలను భయపెట్టడం కాదు, రాబోయే ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ప్రతి పౌరుడు పొదుపుగా ఉండాలని, అనవసర ఖర్చులకు దూరంగా ఉంటూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడమే.
ముందుగా జాగ్రత్త పడటమే మోదీ ఉద్దేశం
ప్రపంచ దేశాల సరఫరా వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉన్నందున, భారతదేశం ముందస్తు జాగ్రత్తగా తన వ్యూహాత్మక నిల్వలను పెంచుకుంటోంది. కరోనా సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల దృష్ట్యా, ప్రభుత్వం ఈసారి ముందస్తుగానే ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ అనిశ్చితి వల్ల రూపాయి విలువ పడిపోకుండా, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా లాక్డౌన్ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇది పూర్తిగా ఆర్థిక , భద్రతాపరమైన అప్రమత్తత మాత్రమే
లాక్ డౌన్ భయాలు అక్కర్లేదు!
విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకుంటేనే ఇలాంటి అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులను మనం తట్టుకోగలమని ప్రభుత్వం భావిస్తోంది. పొరుగు దేశాల్లో నెలకొన్న అస్థిరత, సరిహద్దు వివాదాలు కూడా మనపై ఒత్తిడి పెంచుతున్నాయి. కాబట్టి, ప్రజలు పుకార్లను నమ్మి పానిక్ కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కేవలం దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకుంటున్న జాగ్రత్త చర్యలే. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం సురక్షితంగా ఉండాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. పుకార్లను అరికట్టడంతో పాటు, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాల్సిన సమయం ఇది.
