రివ్యూ: ‘ఆట‌గ‌ద‌రా శివ‌’

తెలుగు360.కామ్ రేటింగ్ :2/5

రోడ్ జ‌ర్నీ సినిమాల్లో గొప్ప స‌మ్మేళ‌నం క‌నిపిస్తుంటుంది. బంధాలు, భావోద్వేగాలు, అనుభూతులు, చిరున‌వ్వులు, క‌న్నీళ్లు… ఇలా ఏదైనా, ఎంతైనా చూపించొచ్చు. ఆ ప్ర‌యాణాల్లో ఉండే మ్యాజిక్కే అది. అందుకే చాలా వ‌రకూ రోడ్ జ‌ర్నీ క‌థ‌లు.. గుండెల్ని హ‌త్తుకున్నాయి. చిర‌కాలం మ‌దిలో ఉండిపోయాయి. అయితే… దాన్ని డీల్ చేసే ప‌ద్ధ‌తి తెలిసుండాలి. భావోద్వేగాలు పండించేలా సన్నివేశాల్ని రాసుకోగ‌ల‌గాలి. ఈ విష‌యంలో ఫెయిల్ అయితే… ఆ ప్ర‌యాణం మొత్తం గ‌తుకుల మ‌య‌మే అవుతుంది. క‌న్న‌డ‌లో విజ‌య‌వంత‌మైన ‘రామ రామ‌’ కూడా రోడ్ జ‌ర్నీ క‌థే! అక్క‌డ ఈ చిత్రానికి వ‌సూళ్లు, ప్ర‌శంస‌లూ ద‌క్కాయి. దాన్నే తెలుగులో ‘ఆట‌గ‌ద‌రా శివ‌’గా రీమేక్ చేశారు. ‘ఆ న‌లుగురు’లాంటి చిత్రాన్ని అందించిన చంద్ర సిద్దార్థ్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఈ చిత్రాన్నీ అదే స్థాయిలో మ‌లుస్తాడ‌న్న నమ్మ‌కం కుదిరింది. మ‌రోవైపు తాత్విక చింత‌న ర‌గిలిస్తూ ‘ఆట‌గ‌ద‌రా శివ‌’ అనే టైటిల్ కూడా ఆక‌ట్టుకునేదే. మ‌రి ఈ రెండింటికీ న్యాయం జ‌రిగిందా? ‘రామ రామ‌’ ఆత్మ‌… ‘ఆట గ‌ద‌రా..’లోనూ క‌నిపించిందా?

క‌థ‌

బాబ్జి (ఉద‌య్ శంక‌ర్‌) కి ఓ హ‌త్య కేసులో ఉరిశిక్ష ప‌డుతుంది. బాబ్జీని ప‌ట్టిచ్చిన‌వారికి ప‌ది ల‌క్ష‌ల న‌జ‌రానా ప్ర‌క‌టిస్తుంది ప్ర‌భుత్వం. జైలు నుంచి త‌ప్పించుకున్న బాబ్జీకి జంగ‌య్య (జంగ‌య్య‌) లిఫ్ట్ ఇస్తాడు. జంగ‌య్య ఓ త‌లారీ. వృత్తి ప‌ట్ల నిబ‌ద్ధ‌త‌, నిజాయ‌తీ ఉన్న వ్య‌క్తి. తాను వెళ్తున్న‌ది బాబ్జీని ఉరితీయ‌డానికే అని, తాను లిఫ్ట్ ఇస్తోంది కూడా త‌న‌కే అని అర్థ‌మ‌వుతుంది. మ‌రి ఆ స‌మ‌యంలో త‌లారీ ఏం చేశాడు? ప‌ది ల‌క్ష‌ల కోసం, త‌న నిజాయ‌తీని నిరూపించుకోవ‌డం కోసం బాబ్జీని న్యాయ స్థానానికి అప్ప‌గించాడా? లేదంటే… ఓ మ‌నిషిలా ఆలోచించి స‌హాయం చేశాడా? అనేదే ‘ఆట‌గ‌ద‌రా శివ‌’ క‌థ‌.

విశ్లేష‌ణ‌

`చంపేవాడు, చ‌చ్చేవాడు ఇద్ద‌రూ క‌లిసే తిరుగుతున్నారు` అనేది ట్రైల‌ర్‌లో వినిపించే మాట‌. ఈ క‌థ మొత్తం సింగిల్ ముక్క‌లో చెప్పాలంటే అంతే! ఓత‌లారీ, ఉరిశిక్ష ప‌డిన ఖైదీ మ‌ధ్య సాగిన సుదీర్ఘ ప్ర‌యాణం ఈ క‌థ‌. నిజానికి చాలా గొప్ప పాయింట్‌. తాత్విక‌త‌, వేదాంతం, జీవితం…. ఇలా ర‌క‌ర‌కాల కోణాల్లో ఎంత ఎమోష‌న్ అయినా పండించొచ్చు. అంత డెప్త్ ఈ పాయింట్‌లో ఉంది. అయితే… మ‌నకెప్పుడూ పాయింట్లు స‌రిపోవు. దాన్ని తెర‌పై తీసుకొచ్చే విధాన‌మే కీల‌కం. ‘గ‌మ్యం’ గుర్తుంది క‌దా? ఓ దొంగ‌, ప్రేమ కోసం ప‌రిత‌పించే ఓ ధ‌నికుడు చేసే ప్ర‌యాణం ఆ క‌థ‌. ఆ ప్ర‌యాణంలో జీవిత సారాన్ని మొత్తం రంగ‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ క‌థ‌లో ఇంకా ఎక్కువ అవ‌కాశాలున్నాయి. కానీ.. స‌రైన స‌న్నివేశాలు ప‌డాలి. అవి రాసుకోవ‌డంలో చంద్ర సిద్దార్థ్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు.

బాబ్జీని ముందు నుంచీ మొర‌టోడిగా, మ‌న‌సులేనివాడిగా చూపిస్తూ వ‌చ్చారు. దాంతో ఆ పాత్ర‌పై ఏ క్ష‌ణంలోనూ సింప‌తీ రాదు. ఓ గ‌ర్భ‌తిని కాపాడి, పురుడు పోసి.. ఓ బిడ్డ భూమ్మీద‌కు రావ‌డానికి కార‌ణ‌మ‌య్యాడ‌ని `నువ్వు దేవుడివి సామీ` అంటూ అంద‌రూ కాళ్లా వేళ్లా ప‌డుతుంటారు. నిజానికి ఆ స‌న్నివేశంలో బాబ్జీ చేసిందేమీ ఉండ‌దు. ఆటోలో ఉన్న గ‌ర్భ‌వ‌తిని కారులోకి షిఫ్ట్ చేయ‌డం త‌ప్ప‌. దానికే ఓ హంత‌కుడ్ని దేవుడిలా చూస్తుంటారంతా. నిజంగానే గ‌ర్భ‌వ‌తి కోస‌మో, త‌న‌కు లిఫ్ట్ ఇచ్చిన జంగ‌య్య కోస‌మో, లేదంటే ఆ కారులో ఎక్కిన ప్రేమ జంట కోస‌మో.. బాబ్జీ ప్రాణాల‌కు తెగించి పోరాడితే… ఆ స్థాయి బిల్డ‌ప్ ఇవ్వొచ్చు. కానీ అవేం జ‌ర‌గ‌వు. దాంతో బాబ్జీ త‌న చుట్టు ప‌క్క‌ల ఉన్న పాత్ర‌ల‌కు దేవుడిగా, ప్రేక్ష‌కుల‌కు మాత్రం హంత‌కుడిగా క‌నిపిస్తుంటాడు. అటు జంగ‌య్య పాత్ర‌తో బాబ్జీకి ఉన్న బంధాన్ని, వాళ్ల ఎటాచ్‌మెంట్‌ని ఇంకాస్త బ‌లంగా చూపిస్తే బాగుండేది. ‘నా శ‌వం జంగ‌య్య‌కు ఇవ్వండి’ అని చెప్పేంత రిలేష‌న్ వీరిద్ద‌రి మ‌ధ్య‌లో ఎక్క‌డా ఉండ‌దు. దాదాపుగా మాతృక‌నే ఫాలో అయిపోయిన చంద్ర సిద్దార్థ్‌… అక్క‌డ‌క్క‌డ త‌న సంతృప్తి కోసం చిన్న చిన్న మార్పులు చేశాడు. ప‌తాక స‌న్నివేశాల్ని తిరిగిరాసుకున్నాడు. క్లైమాక్స్ వ‌ర‌కూ చంద్ర సిద్దార్థ్ ఆలోచ‌నే బాగుంద‌నిపించింది. అయితే ఈమధ్య‌లో చేసిన కొన్ని మార్పుల వ‌ల్ల ఫ‌లితం లేకుండా పోయింది. ఇంత సీరియెస్‌గా క‌థ న‌డుస్తుంటే జ‌నం చూస్తారా, అనే అనుమానం చంద్ర సిద్దార్థ్‌కి వ‌చ్చి ఉంటుంది. అందుకే హైప‌ర్ ఆదిని రంగంలోకి దించాడు. తానేమో స‌మ‌యం, సంద‌ర్భం లేకుండా `జ‌బ‌ర్ ద‌స్త్‌`లో మిగిలిపోయిన పంచ్‌ల‌న్నీ వేసుకుంటూ వెళ్లిపోయాడు. దాని వ‌ల్ల న‌వ్వులు పండ‌క‌పోగా… అస‌లు క‌థ ట్రాక్ త‌ప్ప‌డానికి ప‌రోక్షంగా కార‌ణ‌మ‌య్యాడు.

న‌టీన‌టులు

జంగ‌య్య‌, బాబ్జీ పాత్ర‌లు పోషించిన ఇద్ద‌రూ తెలుగు తెర‌కు కొత్త‌వారే. జంగ‌య్య‌కు క‌న్న‌డ సినిమాల్లో న‌టించిన అనుభ‌వం ఉంది. కాబ‌ట్టి… ఆయ‌న త‌న పాత్ర‌ని సాఫీగా, స‌హ‌జంగా పోషించుకుంటూ వెళ్లిపోయాడు. ఉద‌య్ శంక‌ర్ కూడా ఓకే అనిపిస్తాడు. అయితే క‌నీసం ఆ పాత్ర‌కైనా తెలుగులో కాస్తో కూస్తో ప‌రిచ‌యం ఉన్న‌వాళ్ల‌ని ఎంచుకుంటే బాగుండేది. హైప‌ర్ ఆదితో పాటు జ‌బ‌ర్ ద‌స్త్ టీమ్‌లో ఇద్ద‌రు ముగ్గుర్ని రంగంలోకి దింపినా… కామెడీ వ‌ర్క‌వుట్ కాలేదు. పైగా… అస‌లు క‌థ‌కి అదే అడ్డు త‌గిలింది.

సాంకేతికంగా

‘రామ రామ‌’లో ఉన్న పాయింట్ చాలా శ‌క్తిమంత‌మైంది. కాబ‌ట్టి.. క‌థాంశం వ‌ర‌కూ ఎలాంటి లోపాలూ లేవు.కాక‌పోతే.. అంత మంచి పాయింట్‌ని ఎమోష‌న‌ల్ డ్రైవ్‌గా న‌డిపించ‌డంలో చంద్ర‌సిద్దార్థ్ విఫ‌ల‌మ‌య్యాడు. మాట‌ల్లో తాత్విక‌త క‌నిపిస్తుంది. అయితే… కొన్ని చోట అది అర్థంకానంత క్లిష్టంగా ఉంది. పాట‌లు, అవి వ‌చ్చే సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. అతి త‌క్కువ లొకేష‌న్లు, కొత్త న‌టీన‌టులు, ఓ నిర్మానుష్య‌మైన రోడ్డు, ఓ జీపు… ఇంత‌కు మించిన ఖ‌ర్చేం లేదు. దాంతో.. అనుకున్న బ‌డ్జెట్‌లోనే ఈసినిమాని తీసేసి ఉంటారు. నిడివి త‌క్కువ‌గా ఉండ‌డం కాస్త క‌లిసొచ్చే విష‌యం.

తీర్పు

టైటిల్‌, ప్లాట్….. ఇవి రెండూ ‘గ‌మ్యం’ స్థాయిలో ఓ సినిమా చూసే వేదిక క‌ల్పించాయి. కానీ.. హృద‌యాన్ని హ‌త్తుకుని, మెలిపెట్టి, మ‌న‌సుల్ని ప్ర‌శ్నించే స‌న్నివేశాలు రాసుకోక‌పోవ‌డంతో ద‌ర్శ‌కుడు త‌న ‘గ‌మ్యం’ చేరుకోలేక‌పోయాడు. కొన్ని క‌థ‌లు విన‌డానికీ, చ‌దువుకోవ‌డానికీ బాగుంటాయి… చూడ్డానికి కాదు. ఈ క‌థ కూడా అలానే త‌యారైంది.

ఫినిషింగ్ ట‌చ్‌: శివ‌… శివా….

తెలుగు360.కామ్ రేటింగ్ :2/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com