తెలంగాణ సీఎం పీఠంపై కన్నేసిన మజ్లిస్..!

“ఎంఐఎం మిత్రపక్షం లాంటిదే. మా పార్టీ వంద శాతం సెక్యూలర్. అందుకే ఎంఐఎంతో పొత్తు పెట్టుకోం. కానీ ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుంది..” ఇదీ కేసీఆర్ చెప్పిన మాట. కానీ ఈ ఫ్రెండ్లీ అనేది కేసీఆర్ వైపు నుంచి మాత్రమే. మజ్లిస్ వైపు నుంచి కాదని.. తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. మజ్లిస్ ఏకంగా ముఖ్యమంత్రి సీటు మీదే కన్నేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ఒవైసీ ఈ దిశగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కర్ణాటకలో కుమారస్వామి సీఎం కాగలిగినప్పుడు…తెలంగాణలో ఎంఐఎం అభ్యర్థి ఎందుకు సీఎం కాలేడని అక్బరుద్దీన్ తన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగంలో పేర్కొన్నారు. నవంబర్‌లో ఎన్నికలని కేసీఆర్‌అంటున్నారు… అయితే డిసెంబర్‌లో మజ్లిస్‌ జెండా ఎగరేద్దాం, సత్తా చూపిద్దామన్నారు.

అక్బరుద్దీన్ డిసెంబర్ లెక్కకు ఓ స్కెచ్ ఉంది. అదేమిటంటే.. నవంబర్‌లో ఎన్నికలు జరిగితే… డిసెంబర్‌లో ఫలితాలొస్తాయి. ఆ ఫలితాల్లో ఎవరికీ మెజార్టీ రాకపోతే… కాంగ్రెస్‌కు పీఠం దక్క కూడదని… టీఆర్ఎస్, టీఆర్ఎస్‌కు పీఠం దక్కకూడదని.. కాంగ్రెస్ పార్టీ పడి.. కర్ణాటకలో జేడీఎస్‌కు ఇచ్చినట్లుగా… ఎంఐఎంకు.. ముఖ్యమంత్రి పీఠం ఇవ్వవొచ్చు కదా.. అనేది అక్బరుద్దీన్ వాదన కావొచ్చు. హైదరాబాద్ పాతబస్తీతో పాటు.. ఇటీవలి కాలంలో.. దేశవ్యాప్తంగా… ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేస్తున్న మజ్లిస్.. చాలా చోట్ల సంచలన విజయాలు నమోదు చేసింది. మహారాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్లను ఓవైసీ బ్రదర్స్ గెలిపించుకున్నారు. ఇక తెలంగాణలోనూ పార్టీని విస్తరించడానికి చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి పాతబస్తీ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లలో మజ్లిస్ విజయం పక్కా. ఇక జూబ్లిహిల్స్ లాంటి నియోజకవర్గాల్లో ఎప్పుడూ రెండో స్థానంలో వస్తుంది.

ముస్లింలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న… కరీంనగర్, నిజమాబాద్ లాంటి జిల్లాల్లోనూ.. ఎంఐఎంకు గట్టి పట్టు ఉంది. ఇప్పుడు.. పాతబస్తీలో కాకపోయినా.. ఇతర చోట్ల… మజ్లిస్ మద్దతు తన పార్టీకి లభిస్తుందని ఆశ పడుతున్నారు. అందుకే లోపాయికారీగా కొన్ని చోట్ల.. ఆ పార్టీకి మద్దతిచ్చేందుకు సిద్ధమవతున్నారు. ఇప్పుడున్న ఏడు సీట్లకు మరో నాలుగైదు పెంచుకోగలిగితే… కచ్చితంగా నిర్ణయాత్మక శక్తిగా ఉంటామని.. మజ్లిస్ ఆలోచన కావొచ్చనేది రాజకీయ పార్టీల అంచనా. ఏ పార్టీకి మద్దతు రాని పరిస్థితి వచ్చి… మజ్లిస్ మద్దతే కీలకమైతే.. ఓవైసీ బ్రదర్స్… ఓ ఆట ఆడిస్తారన్నది మాత్రం అందరికీ తెలిసిన విషయమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]