బీజేపీలో రామ్‌మాధవ్‌కు ఎర్త్..? జీవీఎల్‌కు ప్రయారిటీ…?

భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు గడ్డు పరిస్థితి నడుస్తోంది. ఏ ఒక్క పరిణామమూ కలసి రావడం లేదు. అందుకే.. ప్రతి దానికి బాధ్యులెవరూ అనే వెదుకులాట జరుగుతోంది. ఒక్కొక్కరిని గుర్తించి..మార్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. క్రమంగా ప్రాధాన్యత తగ్గించుకుంటూ వెళ్తున్నారు. ఈ జాబితాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ కూడా చేరారన్న ప్రచారం ఊపందుకుంది. జమ్మూకశ్మీర్‌ బీజేపీకి ఆయన ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. మహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీతో పొత్తు వ్యవహారాలు మొత్తం రామ్‌మాధవే చూసుకున్నారు. కానీ అది అట్టర్ ఫ్లాపైపోయింది.

కశ్మీర్‌లో పరిస్థితులు చూసిన తర్వాత నరేంద్రమోడీ, అమిత్ షా.. అక్కడ అధికారంలో భాగంగా ఉండటమే వేస్ట్ అని తేల్చి.. కనీసం మాట మాత్రంగా కూడా అటు రామ్‌మాధవ్‌తో పాటు.. పీడీపీకి కూడా తెలియకుండా.. మద్దతు ఉపసంహరణ నిర్ణయాన్ని తీసేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. వాళ్ల నిర్ణయాన్ని రామ్‌మాధవ్ మీడియా ముందు మాత్రం వెల్లడించారు. ఇది రామ్‌మాధవ్‌ స్థాయిని తగ్గించడమే. ఎందకంటే.. బీజేపీ తదుపరి అధ్యక్షునిగా.. రామ్‌మాధవ్ పేరు ప్రచారంలో ఉంది. ఆరెస్సెస్ నుంచి నేరుగా బీజేపీలోకి వచ్చి ప్రధాన కార్యదర్శి అయిన రామ్‌మాధవ్…అనతి కాలంలోనే మంచి వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో తనకు అప్పగించిన రాష్ట్రాల బాధ్యతలను సమక్రంగా నిర్వర్తించారు. ఆయన ఇన్చార్జ్‌గా వెళ్లిన రాష్ట్రాలన్నింటిలోనూ ప్రభుత్వాలను బీజేపీ ఏర్పాటు చేసింది. పైగా ఆరెస్సెస్ అగ్రనాయకత్వం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో రామ్‌మాధవ్ ప్రాధాన్యం అనూహ్యంగా పెరిగింది.
ఇది బీజేపీ ద్వయం.. నరేంద్రమోడీ, అమిత్ షా లకు నచ్చలేదని ప్రచారం జరుగుతోంది. రామ్‌మాధవ్‌ను నియంత్రించడానికి కశ్మీర్‌ను ఓ కారణంగా చూపించి… ప్రాధాన్యత తగ్గించడం ప్రారంభించారని అంటున్నారు. రామ్‌మాధవ్‌ కు ఇటీవలి కాలంలో ఏపీ బాధ్యతలు ఇచ్చారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఏపీ విషయంలో అందరి కంటే.. ముందు జీవీఎల్ రంగంలోకి వస్తున్నారు. ఈ విషయంలో మోడీ, అమిత్ షా జీవీఎల్‌ను ప్రొత్సహిస్తున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తగ్గట్లుగానే ఢిల్లీలో వ్యవహరాలు నడుస్తున్నాయి. మొత్తానికి బీజేపీలో ప్రస్తుతానికి ఆల్‌ ఈజ్‌ నాట్ వెల్ అన్నట్లుంది పరిస్థితి. విజయాలు వచ్చినంత కాలం.. నరేంద్రమోడీకి క్రెడిట్ కట్టబెట్టేశారు. తీరా వైఫల్యాలొచ్చేసరికి… బాధ్యుల్ని వెదుకుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]