ఇప్పుడు విదేశీ సంస్థలపైనా ఎపి కేసులు!

ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలకూ ప్రత్యేకించి రాజధాని అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటివరకూ చాలా రకాలుగా ఆంక్షలు అమలు చేసింది. ఆరోపణలు చేసింది. రాజకీయంగానూ సోషల్‌మీడియాపై తీవ్రంగానే దాడి చేసింది. మీడియాను కూడా అడపాదడగా హెచ్చరించడం జరుగుతూనే వుంది. ఇదేగాక ప్రతిపక్షం రాజధానికి అడ్డుపడుతున్నదని దాదాపు ప్రతిరోజూ ఆరోపణలు చేస్తూనే వుంది.ఇప్పుడు ఈ ధోరణి అంతర్జాతీయ వ్యాపార సంస్థలకూ పాకనుందా? ఎందుకంటే రాజధాని డిజైన్ల కోసం మొదట రంగంలోకి తెచ్చిన జపాన్‌ సంస్థ మాకీ అసోసియేట్స్‌పై కేసు వేయనున్నట్టు సిఆర్‌డిఎ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ప్రకటించారు. ఈ సంస్థ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నదని ఆరోపించారు. సంగతేమిటంటే మాకీ అసోసియేట్స్‌ ప్రతినిధులు తమ అనుభవాల ఆధారంగా రాజధాని వ్యవహారాలు సరిగ్గాలేవంటూ ఈ మధ్య హిందూలో వ్యాసం రాశారు. అందులో ఆయన తమ కోణమే గాక ప్రకృతి పరిరక్షణ, వ్యయ ప్రయాసలు తదితర అంశాలు ప్రస్తావించారు. దీనివల్ల అంతర్జాతీయంగానూ రాష్ట్ర ప్రజలలోనూ కూడా ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావించిన ప్రభుత్వం క్రికా ద్వారా కేసు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. వారి డిజైన్లు బాగాలేవని ఎక్కువ డబ్బు అడిగారని శ్రీధర్‌ అంటున్నారు. అదే నిజమైతే అప్పుడే చెప్పి వుండాల్సింది. మొదట ఇదే సంస్థను పొగిడి వారు విమర్శలు చేయగానే ఆరోపణలు గుప్పిస్తే విశ్వసనీయత ఏముంటుంది? ఏ వ్యాపార సంస్థ అయినా తనకు తెలిసన సమాచారాన్ని లేదా విమర్శలను వినిపించడం నేరమెలా అవుతుంది?. ప్రభుత్వం వాటిని ఖండించవచ్చు గాని చెప్పడమే పొరబాటంటే కుదరదు. అంతర్జాతీయ స్థాయి సంస్థలకు ఎపి వ్యవహారాలు అంత పెద్ద సమస్య కాదు. ఈ వ్యాపారం దెబ్బతిన్నా పెద్ద వాటికి కలిగే నష్టమూ వుండదు. ఒకవేళ ప్రభుత్వం కేసు వేసినా అది నడిచి నడిచీ ఒక కొలిక్కి రావాలంటే చాలా కాలం పడుతుంది. ఈ ఆరోపణలు వల్ల అంతర్జాతీయంగా తనకు చెడ్డపేరు వస్తుందని ప్రభుత్వం భయపడుతుండొచ్చు. కాని ఆ కంపెనీ భయపడాల్సిన పని లేదు.పైగా అలాటి వారిని తీసుకొచ్చి ముందుగా బాధ్యతలు అప్పగించిన వారూ విమర్శను ఎదుర్కొవలసే వుంటుంది! ఏమైనా మాకీ ఉదంతం మొదటిదే కావచ్చు. ఇంకా కొన్ని పైప్‌లైన్‌లో వున్నట్టు సమాచారం,..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.