ఖైదీని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం…..చిరంజీవి ఇంటర్వ్యూ

2016 సంక్రాంతి సమయంలో బాలయ్య డిక్టేటర్ సినిమా కోసం ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాని ఇబ్బంది పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం….ఈ సంక్రాంతికి కూడా గౌతమీ పుత్రుడి కోసం ఖైదీని కష్టాలు పెడుతోందా? చాలా రోజులుగా ఈ వార్త మీడియాలో హల్చల్ చేస్తోంది. మెగా అభిమానులందరూ కూడా నిజమే అని నమ్ముతున్నారు. 2016లో ఎన్టీఆర్‌ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం వాస్తవమేనని విశ్లేషకులు చెప్పారు. కానీ ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

అయితే ఇప్పుడు మాత్రం ప్రభుత్వం పెట్టిన ఇబ్బంది గురించి చిరంజీవి ఓపెన్ అయ్యాడు. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన చిరంజీవి ప్రి రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, వాళ్ళు పెట్టిన ఇబ్బందుల గురించి వివరంగా చెప్పుకొచ్చాడు. ఆ విషయం చిరు మాటల్లోనే………

‘ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్‌ చేయాలనుకున్న తర్వాత ఆఫీసర్స్‌ను సంప్రదించాం. ముందు ఇస్తామన్నారు. పర్మిషన్‌ కూడా ఇచ్చేశారు. తర్వాత ‘మేం పొరపాటు పడ్డాం. కోర్టు స్టే ఉంది. ఒకవేళ ఇచ్చినా ఇంత మేరకే వాడుకోవాలి’ అన్నారు. ఓ వారం రోజులు తిప్పించుకున్నారు. ఓకే చేయలేదు. ఆ తర్వాత గుంటూరు స్టేడియం విషయంలో కూడా అక్కడున్న అధికారులు ముందు ఓకే అని, ఆ తర్వాత ఇవ్వమన్నారు. అప్పుడు ప్రైవైట్‌ వెన్యూ అయిన హాయ్‌లాండ్‌ని ఎన్నుకున్నాం…..’ ఇవీ చిరు మాటలు. సాధ్యమైనంత వరకూ వివాదాలకు దూరంగా ఉండాలనుకునే నైజం చిరంజీవిది. అందుకే దీని వెనక రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి అని భావించడం లేదు అని చెప్పాడు. కానీ చిరంజీవి మాటలు విన్న ఎవరికైనా అసలు విషయం అయితే అర్థమవుతూనే ఉంది. రాజ్యసభ సభ్యుడు కూడా అయిన టాప్ రేంజ్ తెలుగు హీరో చిరంజీవి. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్న విషయం ఆ అధికారులకు కూడా తెలుసు. అయినప్పటికీ వారం రోజుల పాటు తిప్పించుకోవడం అంటే రాజకీయ ఒత్తిళ్ళు లేవని నమ్మడం కష్టం. మన అధికారుల తీరు గురించి అందరికీ తెలిసిందేగా. అధికార పార్టీలో ఉన్న చిన్నా చితకా లీడర్ మనకు తెలిసి ఉన్నా….ప్రభుత్వంలో కాస్తంత పలుకుబడి ఉన్నా మన పనులన్నీ చకచకా పూర్తి చేసేస్తారు. అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం ఇలా ఉంటుంది వ్యవహారం. సినిమా ఇండస్ట్రీ అమరావతికి తరలిరావాలి అని చెప్పి బ్రహ్మాండంగా మీడియా ముందు మాట్లాడతారు. కానీ తెరవెనకాల మాత్రం ఇలాంటి రాజకీయాలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ రాజకీయ వ్యవహారాలపైన అవగాహన ఉంది కాబట్టే సినిమా ఇండస్ట్రీలో ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారే ఎక్కువ మంది ఉన్నప్పటికీ అమరావతికి వెళదామని మాత్రం ఎవ్వరూ అనుకోవడం లేదు. పరిశ్రమలను ప్రోత్సహిస్తాం……అని చెప్పి ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు. కానీ రాజకీయ స్వార్థంతో పరిశ్రమలు రాకుండా కూడా వాళ్ళే అడ్డుపడుతూ ఉంటారు. చిత్రవిచిత్రమైన రాజకీయం అంటే అలానే ఉంటుందేమో మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com